
వైభవంగా సప్తస్వర అవధాన వైజయంతి
72 మేళకర్త రాగాలపై అవగాహన సదస్సు
పి.గన్నవరం: ముంగండ గ్రామంలోని శ్రీత్యాగరాజ ఆరాధన సమితి, ఉభయ తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ప్రముఖ సినీ సంగీత దర్శకుడు స్వర వీణా పాణిచే సప్తస్వర అవధాన వైజయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీణాపాణిచే 72 మేళకర్త రాగాలపై అవగాహన సదస్సు జరిగింది. వీణాపాణి సప్తస్వర అవధానం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. సభికులు అడిగిన రాగాలలో.. వీణాపాణి చేసిన సంగీత అవధానం ఉర్రూతలూగించింది. విశేష అతిథిగా హైదరాబాద్‌కు చెందిన ఆధ్యాత్మిక పాటల ప్రముఖ రచయిత, సాహితీవేత్త పరిమి కేదార్నాథ్ పాల్గొని మాట్లాడారు. అద్భుతమైన సాహిత్యంతో ఆయన సభికులను మంత్రముగ్ధులను చేశారు. ఈ సందర్భంగా స్వర వీణాపాణి, కేదార్నాథ్ తదితరులను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. తొలుత ఎల్.గన్నవరంలోని అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ వారి నివాసాన్ని వారు సందర్శించారు. సీతమ్మ వారి చిత్రపటానికి పూలమాలలు వేశారు. గ్రామంలోని మూడు దేవాలయాలను సందర్శించి పూజలు చేశారు. ఎల్.గన్నవరంలో మిర్తిపాటి నారాయణ, సూర్యకుమారి దంపతుల చిత్ర పటాలకు, ముంగండలో నడిమింటి నాగరాజారావు చిత్ర పటానికి వారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముంగండలో హైదరాబాద్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక సభ్యుడు మిర్తిపాటి రామం నేతృత్వంలో జరిగిన అవధాన కార్యక్రమానికి తెన్నేటి లక్ష్మి నర్శింహమూర్తి సంధాన కర్తగా వ్యవహరించారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక (హైదరాబాద్) వ్యవస్థాపకుడు బాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వేముల కిషన్‌రావు, బ్రాహ్మణ వేదిక నాయకులు గొల్లపల్లి ఫణీంద్ర, ప్రముఖ చిత్ర కళాకారుడు రవి పరస, తబలా వాద్యకారుడు టి.మోహన్ తదితరులు హాజరయ్యారు. అధిక సంఖ్యలో సంగీత, సాహిత్య అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.