
వైభవంగా తలుపులమ్మతల్లి జాతరోత్సవాలు
● ఘనంగా ప్రారంభం
● 26న జాగరణ, 27న ఊరేగింపు, తీర్థం
తుని రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ తల్లి పుట్టింటి సంబరాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. లోవకొత్తూరు రామాలయంలో గతేడాది భద్రపర్చిన గరగలను ఆదివారం నృత్య కళాకారులు తీసి దేవస్థానానికి తీసుకువెళ్లారు. పుట్టధార పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేసి అమ్మవారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేసి నూతన వస్త్రాలు, పూలతో అలంకరించారు. గరగలను ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు, మాజీ చైర్మన్ దూలం మాణిక్యం, ఇసరపు గాంధీ శిరస్సుపై ధరించి గరగ నృత్యాలతో అమ్మవారి గంధ అమావాస్య సంబరాలను సాంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. అనంతరం డప్పు కళాకారుల వాయిద్యాల నడుమ లోవకొత్తూరు గ్రామంలో అమ్మవారి ఉపాలయానికి చేరుకున్నారు. ఈఓ మాట్లాడుతూ 14 రోజులు వివిధ గ్రామాల్లో గరగల నృత్యాలు చేస్తూ కళాకారులు అమ్మవారికి విస్తృత ప్రచారం కల్పిస్తారన్నారు. ఈ నెల 26న లోవ కొత్తూరులో ఉపాలయం ప్రాంగణంలో జాగరణోత్సవాలు, వివిధ సాంస్కృతిక, జానపద, సాంఘిక ప్రదర్శనలు, విద్యుత్ దీపాలంకరణలు ఏర్పాటు చేశామన్నారు. 27న ఊరేగింపు నిర్వహించి, తీర్థం, అమ్మవారి దర్శనాలు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలన్నారు. మాజీ సర్పంచ్ పలివెల శ్రీనుబాబు, వేదపండితులు, ప్రధాన అర్చకులు, పలువురు భక్తులు పాల్గొన్నారు.
అగ్నిప్రమాదంలో
గూడపర్తి వాసి మృతి
● అనకాపల్లి బాణసంచా
తయారీ కేంద్రంలో ఘటన
● సామర్లకోటకు చెందిన
నలుగురికి గాయాలు
● వేట్లపాలెంలో విషాదం
సామర్లకోట: అనకాపల్లి జిల్లా కోటవురట్లలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో మండల పరిధిలోని వేట్లపాలెం శివారు గూడపర్తికి చెందిన దేవర నిర్మల (38) మృతి చెందింది. నిర్మలతో పాటు ఆమె భర్త గొడత వీరవెంకటసత్యనారాయణ, సామర్లకోట పెన్షన్‌లైన్‌కు చెందిన యాలంగి రాజు, యాలంగి సంతోషిణి, యాలంగి సారోన్ కూలి పనికి వెళ్లి బాణసంచా తయారీ కేంద్రంలో చేరారు. ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో నిర్మల మృతి చెందగా మిగిలిన వారు స్వల్వ గాయాలలో బయట పడిన్నట్లు వారి బంధువులు తెలిపారు. నిర్మలతో సహజీవనం చేస్తున్న గూడపర్తికి చెందిన గొడత వీరవెంకటసత్యనారాయణకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న నిర్మల కుటుంబ సభ్యులు హుటాహుటిన అనకాపల్లి వెళ్లారు. ఈ ఘటనతో గూడపర్తిలో విషాద ఛాయలు అలముకున్నాయి. సీఐ ఎ.కృష్ణభగవాన్ గూడపర్తి చేరుకుని సమాచారం సేకరించారు. అక్కడి ప్రమాద వార్త తెలిసిన వెంటనే వేట్లపాలెంలో బాణా సంచాతయారీదారులు తమ దుకాణాలను మూసి వేశారు. ఎంపీపీ బొబ్బరాడ సత్తిబాబు గూడపర్తి చేరుకుని సమాచారం సేకరించారు. కాగా సుమారు ఆరేళ్ల క్రితం పెన్షన్‌లైన్‌కు చెందిన డొకుబుర్ర రాజు, శేషారావులు పెదపూడిలో బాణా సంచాతయారీకి వెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే.