బాకీ అడిగాడని కడతేర్చారు | - | Sakshi
Sakshi News home page

బాకీ అడిగాడని కడతేర్చారు

Published Mon, Apr 14 2025 12:08 AM | Last Updated on Mon, Apr 14 2025 12:08 AM

బాకీ అడిగాడని కడతేర్చారు

బాకీ అడిగాడని కడతేర్చారు

దొమ్మేరు హత్య కేసులో వీడిన మిస్టరీ

ముగ్గురు నిందితుల అరెస్ట్‌

రెండు మోటారు సైకిళ్లు,

నాలుగు సెల్‌ఫోన్ల స్వాధీనం

36.7 గ్రాముల బంగారు

ఆభరణాలు రికవరీ

నిందితుడు పెద్దేవం

సచివాలయంలో సర్వేయర్‌

కొవ్వూరు: గత నెల 26వ తేదీ రాత్రి జరిగిన హత్య కేసును పట్టణ పోలీసులు ఛేదించారు. నందమూరు – దొమ్మేరు పుంతరోడ్డులోని పోలంలో పెండ్యాల ప్రభాకరరావు (46) హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఆదివారం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ జి.దేవకుమార్‌ హత్య కేసు వివరాలను వెల్లడించారు. పోలవరం మండలం పాత పట్టిసీమకి చెందిన చుక్కా రామ శ్రీనివాస్‌ ఈ హత్య చేసినట్లు ధ్రువీకరించారు. ప్రధాన నిందితుడు తాళ్లపూ డి మండలం పెద్దేవం సచివాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్నారు. గోపాలపురం మండలం దొండపూడికి చెందిన అంకోలు జగదీష్‌ దుర్గాప్రసాద్‌, పోలవరానికి చెందిన నోముల ప్రవీణ్‌ కుమార్‌ నిందితుడికి సహకరించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు ముగ్గురిని 12వ తేదీ మధ్యాహ్నం ప్రధాన నిందితుడు శ్రీనివాస్‌ ఇంటి వద్ద పట్టణ సీఐ పి.విశ్వం అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వివరాల్లోకి వెళితే మృతుడు ప్రభాకరావు వింటేజ్‌ కంపెనీ ఉత్పత్తుల వ్యాపారం చేస్తూ ఏజెంట్ల ద్వారా విక్రయిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే చుక్కా రామ శ్రీనివాస్‌తో పరిచయం ఏర్పడింది. గత ఏడాది డిసెంబర్‌లో ప్రభాకరావు వద్ద శ్రీనివాస్‌ రూ.2.4 లక్షలు అప్పు తీసుకున్నారు. బాకీ తీర్చమని ప్రభాకరరావు ఒత్తిడి తేవడమే కాకుండా శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులకు కూడా చెప్పాడు. విలాసాలు, క్రికెట్‌ బెట్టింగ్‌లకు అలవాటు పడి నిందుతుడు చాలా అప్పులు చేశాడు. ప్రభాకరరావును చంపేస్తే తన బాకీ తీర్చనవసరం లేదని భావించి స్నేహితులైన జగదీష్‌, ప్రవీణ్‌కుమార్‌లకు తెలిపాడు. మార్చి 26వ తేదీ రాత్రి జగదీష్‌ దుర్గాప్రసాద్‌ను వెంటబెట్టుకుని కొవ్వూరు పట్టణ శివారున హైవేలో అండర్‌ పాసేజ్‌ వద్దకి చేరుకున్నారు. ప్రభాకరరావుకు శ్రీనివాస్‌ ఫోన్‌ చేసి రమ్మని పిలిచాడు. ఆర్థిక లావాదేవీలు ఉండడం, వ్యాపార సంబంధాలు ఉండడంతో ప్రభాకరరావు ఇంటి నుంచి మోటారు సైకిల్‌ వేసుకుని నందమూరు–దొమ్మేరు అండర్‌ పాసేజ్‌ వద్దకు చేరుకున్నారు. శ్రీనివాస్‌ అండర్‌ పాసేజ్‌ నుంచి కొద్ది దూరం వచ్చి ప్రభాకరరావు మోటారు సైకిల్‌ ఎక్కారు. తాను ఫోన్‌ చేసిన తర్వత రావాలని జగదీష్‌ దుర్గాప్రసాద్‌కు సూచించాడు. ఇద్దరు కలిసి నందమూరు–దొమ్మేరు పుంత రోడ్డు మార్గంలో వెళుతూ నీరుకొండ శేషగిరిరావుకు చెందిన డ్రాగన్‌ ఫ్రూట్‌తోట వద్ద మూత్ర విసర్జనకు ఆపమని అడిగాడు. అదే సమయంలో శ్రీనివాస్‌ తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రభాకరరావుపై విచక్షణారహితంగా పలుమార్లు నరికాడు. అనంతరం ప్రభాకరరావు కంఠం నరికి మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. ఆ సమయంలో మృతుడి కుడి చేతికి ఉన్న బంగారు కడియం, నాలుగు బంగారపు ఉంగరాలు తీయడానికి ప్రయత్నించి రాకపోవడంతో చేతిని నరికి పేపర్‌ చుట్టి బ్యాగ్‌లో పెట్టుకున్నారు. మృతుడి వద్ద ఉన్న ఫోన్‌, మెడలో ఉన్న బంగారు గొలుసు, ఉంగరం బ్యాగ్‌లో పెట్టుకున్నాడు. అనంతరం జగదీష్‌ దుర్గా ప్రసాద్‌కు ఫోన్‌ చేసి రమ్మని పిలిచి ఇద్దరు కలిసి మోటారుసైకిల్‌పై దొమ్మేరు, కాపవరం మీదుగా పోలవరం వెళ్లి పోయారు. ఈ విషయాన్ని మూడో నిందితుడు ప్రవీణ్‌కుమార్‌కు చెప్పాడు. అనంతరం వారు తెచ్చిన ప్రభాకరరావు చేతికి ఉన్న ఉంగరాలు తీసుకున్నారు. తరువాత చేతిని, హత్యకు వినియోగించిన కత్తిని, ప్రభాకరరావు సెల్‌ఫోన్‌ను, నేరం చేసిన సమయంలో వారు ధరించిన దుస్తులను బ్యాగ్‌లో పెట్టి గుటాల వద్ద గోదావరి నదిలో వదిలేశారు. ఈ కేసులో 31.8 గ్రాముల ఒక బంగారపు గొలుసు, 4.9 గ్రాముల బంగారపు ఉంగరం ప్రధాన నిందుతుడి నుంచి స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. నేరం చేసిన సమయంలో వినియోగించిన మోటారుసైకిల్‌ను, రెండు సెల్‌ఫోన్లను, జగదీష్‌ దుర్గా ప్రసాద్‌ వద్ద నేరానికి వినియోగించిన అతని మోటారు సైకిల్‌ను, ఒక సెల్‌ఫోన్‌ను, ప్రవీణ్‌కుమార్‌ వద్ద సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే గుటాల సమీపంలో నిందితులు గోదావరి నదిలో పడేసిన వస్తువులను, మృతుడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో దోచుకున్న బంగారంలో జగదీష్‌ దుర్గాప్రసాద్‌ కొయ్యలగూడెంలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో కడియం తాకట్టు పెట్టి రూ.1.26 లక్షలు, తాళ్లపూడిలో కిస్ట్రియన్‌ సిరియన్‌ బ్యాంక్‌ (సీఎస్‌బీ)లో మూడు ఉంగరాల తాకట్టు పెట్టి రూ.43,600 తీసుకున్నారు. ఈ బంగారు ఆభరణాలను రికవరీ చేయాల్సి ఉందన్నారు. పట్టణ సీఐ పి.విశ్వం, రూరల్‌ సీఐ కె.విజయ్‌బాబు, ఎస్సై పి.రవీంద్ర, నిడదవోలు ఎస్సై కె.జగన్మోహనరావు, కొవ్వూరు రూరల్‌ ఎస్సై కె.శ్రీహరి రావు, ఇతర సిబ్బంది ఈ కేసు చేధించడంలో సహకరించారన్నారు. వీరిని జిల్లా ఎస్పీ నరసింహా కిశోర్‌ అభినందించినట్లు డీఎస్పీ దేవకుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement