
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడాలి
ప్రత్తిపాడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బుగత బంగార్రాజు అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ మోసపూరిత విధానాలపై, ప్రధాని మోదీ ఫాసిస్టు పాలనపై బలమైన ప్రజా పోరాటాలు చేపట్టాలని పిలుపు నిచ్చారు. ప్రత్తిపాడు లిబరేషన్ కార్యాలయంలో శనివారం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బంగార్రాజు మాట్లాడుతూ సూపర్ సిక్స్‌తో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. దళిత, ఆదివాసీలపై, మహిళలపై హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాలన్నారు. పేదలు సాగుచేస్తున్న భూములకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఆదివాసీ భూములు కబ్జా చేసేలా మైనింగ్ మాఫియాకు అండగా ఉంటూ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని దుయ్యబట్టారు. సనాతన ధర్మం పేరుతో పవన్‌కళ్యాణ్ ప్రజలను మరింత మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 22న నిర్వహించే లిబరేషన్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, మే 20న నిర్వహించే అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు రేచుకట్ల సింహాచలం, కె.జనార్ధన్, మానుకొండ లచ్చబాబు ప్రసంగించారు. కార్యక్రమంలో లిబరేషన్ అనుబంధ సంస్థల నాయకులు తాడి నాగేశ్వరరావు, రాజాల రత్నం, చిన్నం అర్జునుడు, అనుసూరి లక్ష్మి, మాసా రాజామణి, దుమ్ముల సింహాచలం, డక్కమళ్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.