
నేడు గురుకుల ప్రవేశ పరీక్షలు
అమలాపురం రూరల్: ఏపీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు శుక్రవారం ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల నిర్వహణపై కాకినాడ జిల్లా తుని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ హేమలత, పరీక్ష కేంద్రాల ముఖ్య పర్యవేక్షకులు, అధికారులతో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) రాజకుమారి కలెక్టరేట్‌లో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్థానిక జెడ్పీ బాలికల హైస్కూల్, వెత్సవారి అగ్రహారంలోని మహాత్మా గాంధీ మున్సిపల్ హైస్కూల్ కేంద్రాల్లో గురుకుల ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి వరకూ ప్రవేశాలకు బ్యాక్‌లాగ్‌కు సంబంధించి 40 మంది ఈ పరీక్షకు హాజరు కానున్నారన్నారు. గురుకుల జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలల ప్రవేశ పరీక్షకు 285 మంది హాజరు కానున్నారని తెలిపారు. 5, 6, 7, 8 తరగతుల ప్రవేశ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, జూనియర్, డిగ్రీ కాలేజీల ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరుగుతుందని వివరించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించాలని రాజకుమారి స్పష్టం చేశారు. సమావేశంలో ప్రవేశ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ బి.హనుమంతరావు, చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.