అగ్గిరవ్వలు | - | Sakshi
Sakshi News home page

అగ్గిరవ్వలు

Published Mon, Apr 28 2025 12:15 AM | Last Updated on Mon, Apr 28 2025 12:15 AM

అగ్గి

అగ్గిరవ్వలు

రగలనివ్వద్దు

అత్యవసర ఫోన్‌ నంబర్లు

రాజమహేంద్రవరం 0883–2444101

ఆర్యాపురం 0883–2445101

నిడదవోలు 08813–221101

కొవ్వూరు 08813–231101

అనపర్తి 08857–227201

కోరుకొండ 0883–2496101

కాకినాడ 0884–2374571

పెద్దాపురం 08852–241299

పిఠాపురం 08869–251501

ప్రత్తిపాడు 08868–246709

తుని 08854–253601

జగ్గంపేట 08852–233388

నిడదవోలు: వేసవి ఎండల తీవ్రత నానాటికీ పెరుగుతోంది. ఇంట్లో ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్‌ల వాడకం గణనీయంగా పెరుగుతోంది. విద్యా సంస్థలకు వేసవి సెలవులు కావడంతో కొన్ని ఇళ్లల్లో దాదాపు 24 గంటలూ ఏసీలు పని చేస్తూనే ఉన్నాయి. మరోవైపు చెట్టు చేమ, పొలాలు, గడ్డి, తాటాకు ఇళ్లు.. ఇలా ఆరుబయట ఉన్న అన్నీ ఎర్రటి ఎండకు ఎండిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితులన్నీ అగ్ని ప్రమాదాలకు ఆస్కారమిచ్చేవే. ఏమాత్రం చిన్న అజాగ్రత్తగా వ్యవహరించినా అగ్నిప్రమాదాల ముప్పు తప్పదు. ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే అగ్ని ప్రమాదాలను ముందస్తుగా నివారించే అవకాశం ఉంటుంది. ప్రాణ, ఆస్తి నష్టాల నుంచి బయటపడవచ్చును.

ప్రమాదాలకు అవకాశాలిలా..

● ఎండల తీవ్రతకు విద్యుత్‌ వినియోగం బాగా పెరుగుతోంది. దీంతో, ఓవర్‌ లోడుకు తట్టుకోలేని పాత విద్యుత్‌ వైర్లతో షార్ట్‌ సర్క్యూట్ల కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.

● ఎలక్ట్రిక్‌ హోల్డర్లు, ఇసీ్త్ర పెట్టెలు, మిక్సీలు, వాషింగ్‌ మెషీన్లు వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోయినా, వాటికి ఉద్దేశించిన ప్లగ్‌లు వాడకపోయినా ప్రమాదాలు జరిగే చాన్స్‌ ఉంటుంది.

● భవనాల్లో హోమ్‌ థియేటర్స్‌, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్లు వంటివి వాడేటప్పుడు కరెంట్‌ సరఫరాలో హెచ్చుతగ్గులు ఏర్పడి ప్రమాదాల జరగవచ్చు.

● విద్యుత్‌ లైన్‌ నుంచి తాటాకు ఇళ్లకు నేరుగా వైర్లు లాగడం వలన కూడా ప్రమాదాలు జరుగుతాయి.

● సెలవులు తదితర కారణాలతో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇంట్లోని విద్యుత్‌ మెయిన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయనందువలన ఒక్కోసారి షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదాలు జరగవచ్చు.

● పల్లెల్లో చాలా మంది ఆరుబయట భోజనాలు వండుకునే క్రమంలో పొయ్యి వెలిగించి, ఇంట్లో టీవీ చూస్తూనో మరో పని చేస్తూనో ఉంటారు. అదే సమయంలో గాలి ఉధృతికి ఆ పొయ్యి నుంచి నిప్పురవ్వలు ఎగసిపడి తాటాకు ఇళ్ల వంటివి అగ్నికి ఆహుతి కావచ్చు. ఇటువంటి ప్రమాదాలు అనేకం జరుగుతున్నాయి.

● వంట పూర్తయిన తర్వాత పొయ్యిలో నిప్పులను పూర్తిగా ఆర్పకపోవడం.

● ఇంట్లో వంట పూర్తవగానే గ్యాస్‌ స్టౌ ఆఫ్‌ చేస్తారు. కానీ, సిలిండర్‌కు ఉన్న రెగ్యులేటర్‌ ఆఫ్‌ చేయరు. ఈ చిన్నపాటి నిర్లక్ష్యంతో ఒక్కోసారి వంట గ్యాస్‌ లీకై పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

● గ్రామీణ ప్రాంతాల్లో చిమ్నీ లేని దీపాలు వాడటం వలన కూడా ప్రమాదాల జరగవచ్చు.

● అవగాహన లోపంతో పెంట కుప్పల్లో నిప్పులు వేయడంతో అవి గాలికి రాజుకుని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.

● గ్రామీణ ప్రాంతాల్లో ఆరుబయట వేసిన మంటలను ఆర్పకపోవడం.

● కాల్చిన సిగరెట్లు, అగ్గిపుల్లలు ఆర్పివేయకుండా పడవేయడం కూడా ఒక్కోసారి పెద్ద ప్రమాదాలకు కారణమవుతుంది.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే మేలు

● ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, పరిశ్రమలు, గిడ్డంగులు, ఆసుపత్రులు, కళాశాలలు, పాఠశాలల్లో అగ్నిమాపక నిబంధనలు కచ్చితంగా పాటించాలి.

● పాత విద్యుత్‌ వైరింగ్‌ మార్చుకోవాలి.

● పాఠశాలల్లో ప్రమాదాలు జరిగేటప్పుడు విద్యార్థులు బయటకు వచ్చే మార్గాలను యాజమాన్యం ముందస్తుగానే ఏర్పాటు చేయాలి. పై అంతస్తు నుంచి కిందకు దిగేందుకు మెట్లు విశాలంగా నిర్మించాలి.

● పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, ఫంక్షన్‌ హాల్స్‌, సినిమా థియేటర్ల యాజమాన్యాలు అగ్నిమాపక శాఖ నుంచి కచ్చితంగా నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) తీసుకోవాలి. అగ్ని ప్రమాదాలను నివారించడానికి అవసరమైన అన్ని పరికరాలనూ అందుబాటులో ఉంచుకోవాలి.

● వంట గదిలో అదనపు గ్యాస్‌ సిలిండర్లు, ఫ్రిజ్‌ లేకుండా చూసుకోవాలి.

● వంట పూర్తయిన వెంటనే సిలిండర్‌ రెగ్యులేటర్‌ను తప్పనిసరిగా ఆఫ్‌ చేయాలి.

● గ్యాస్‌ స్టౌవ్‌ను సిలిండర్‌ కంటే ఎత్తులో ఉంచాలి.

● వంట గదిలోకి వెళ్లేటప్పుడు నేరుగా కరెంటు స్విచ్‌లు వేయరాదు. గ్యాస్‌ వాసన వస్తోందేమో పరిశీలించాలి. అలా రాకపోతే స్విచ్‌ వేయవచ్చు. ఒకవేళ గ్యాస్‌ లీకయినట్లు అనుమానం వస్తే కిటికీలు, తలుపులు వెంటనే తెరవాలి. రెగ్యులేటర్‌ ఆఫ్‌ చేయాలి.

● ఇల్లు వదిలిపెట్టి దూర ప్రాంతాలకు వెళ్లి, ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే గ్యాస్‌ రెగ్యులేటర్‌ను తప్పనిసరిగా తీసివేయాలి.

● ప్రతి ఇంట్లో కనీసం 200 లీటర్ల నీరు అందుబాటులో ఉంచుకోవాలి.

● గ్రామీణ పాంత్రాల్లో ఎండిన గడ్డిని వాములుగా వేయాలి. వాముల నుంచి ఇళ్లకు తప్పనిసరిగా 60 అడుగుల దూరం ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

● బహిరంగ ప్రదేశాల్లో మంటలు వేయరాదు.

● పడుకునే ముందు వంట పొయ్యిని తప్పనిసరిగా ఆర్పివేయాలి.

● పూరిళ్లలో నివసించేవారు పొయ్యిలు, నిప్పులు పూర్తిగా ఆర్పివేయాలి.

● ఇళ్ల కప్పులు మరీ తక్కువ ఎత్తులో ఉండకుండా చూసుకోవాలి.

● నిద్రపోయే ముందు దీపాలు ఆర్పి, టార్చ్‌లైట్‌ అందుబాటులో ఉంచుకోవాలి.

● చిన్న పిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు అందుబాటులో ఉంచరాదు.

వెంటనే స్పందిస్తాం

అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలోని ఏపీ విపత్తు స్పందన, అగ్నిమాపక కేంద్రాల్లో ఫైరింజన్లు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయి. ప్రతి వాహనంలో 4,500 లీలర్ల నీటిని నిల్వ ఉంచి, ప్రమాదాల సమయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్లి, మంటలను అదుపు చేస్తాం. ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, కర్మాగారాలు, గిడ్డంగులు, ఆసుపత్రులు, కళాశాలలు, పాఠశాలల్లో అగ్నిమాపక నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నాం.

– సీహెచ్‌ మార్టిన్‌ లూథర్‌ కింగ్‌,

ఏపీ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ జిల్లా అధికారి, రాజమహేంద్రవరం

మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

ఫైర్‌.. తీసుకోవాలి కేర్‌

వేసవిలో అగ్ని ప్రమాదాల ముప్పు

చిన్నపాటి ముందు జాగ్రత్తలతో నివారణ

అవగాహనతో నష్టాలు దూరం

అగ్ని ప్రమాదాల్లో గాయపడితే..

అగ్ని ప్రమాదాల్లో కాలి, గాయపడిన వారి దుస్తులకు నిప్పు అంటుకున్నట్లయితే పరుగెత్తనీయకుండా నేలపై దొర్లించాలి. అలా సాధ్యం కాకుంటే దుప్పటి చుట్టాలి.

కాలిన శరీర భాగం మీద చల్లని నీరు పోయాలి.

పొగతో నిండిన గదుల్లో మోచేతులు, మోకాళ్లపై పాకుతూ బయటకు రావాలి. ఆ సమయంలో నోటికి అడ్డంగా తడిగుడ్డ కట్టుకుని గాలి పీల్చడం ద్వారా పొగ, కార్బన్‌ డయాక్సెడ్‌ పీల్చకుండా ఆపవచ్చును.

అగ్ని ప్రమాద సమయంలో బాత్‌ రూముల్లోకి వెళ్లకుండా ఆరుబయటకు వచ్చే ప్రయత్నం చేయాలి.

2022–25 మధ్య జిల్లావ్యాప్తంగా అగ్నిప్రమాదాల వివరాలు

సంవత్సరం ప్రమాదాలు ఆస్తినష్టం కాపాడిన ఆస్తి

2022–23 385 రూ.65.76 కోట్లు రూ.34.73 కోట్లు

2023–24 402 రూ.44.50 లక్షలు రూ.52.04 కోట్లు

2024–25 302 రూ.94.72 లక్షలు రూ.38.89 కోట్లు

ఈ నెల 1వ తేదీ వరకూ 39 రూ.45.89 లక్షలు రూ.96.27 లక్షలు

అగ్గిరవ్వలు1
1/2

అగ్గిరవ్వలు

అగ్గిరవ్వలు2
2/2

అగ్గిరవ్వలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement