ఈలపాట... సీసపద్యం! | Editor Vardhelli Murali article on TDP Politics In AP Assembly Sessions | Sakshi
Sakshi News home page

ఈలపాట... సీసపద్యం!

Published Sun, Mar 27 2022 1:43 AM | Last Updated on Sun, Mar 27 2022 7:19 AM

Editor Vardhelli Murali article on TDP Politics In AP Assembly Sessions - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఇంకో రెండు మూడు రోజులు కొనసాగివుంటే బాగుండేది. ముఖ్యమైన బిల్లులేవో మిగిలిపోయాయని కాదు... తెలుగుదేశం పార్టీ క్రియేటివ్స్‌ను ఇంకొన్ని చూసి ఉండేవాళ్లం కదా అని! కాగితాలు చించి, స్పీకర్‌ తల మీద అక్షతల్లా చల్లే కళారూపాన్ని ఒకరోజు ప్రదర్శించారు. ఒకరోజు ఈలలు వేశారు. అందుకోసం కొందరు సభ్యులు విజిల్స్‌ కొనుక్కుని సభకు వచ్చారు. ఒకరోజు చిడతలు వాయిం చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ‘చిడతల బాబాయణాన్ని’ ప్రదర్శించడానికి ఒక ప్రత్యేక బృందం ఉండేది. ‘జయము జయము చంద్రన్న... జయము నీకు చంద్రన్న’ అనే మకుటంతో ఈ బాబాయణ భజన సాగేది. పోల వరంపై ప్రకటన చేసినప్పుడు ముఖ్యమంత్రి ఈ పాత విజు వల్‌ను సభకు చూపెట్టారు కూడా! సభ్యుల దగ్గర చిడతలు ఎటూ ఉన్నాయి కనుక ఇంకో రోజు ఆగివుంటే సభలో లైవ్‌గానే చిడతల బాబాయణాన్ని చూసే అవకాశం దక్కేదేమో!

స్పీకర్‌ చెప్పిన లెక్క ప్రకారం 12 రోజులు సమావేశాలు జరిగాయి. 2 లక్షల 56 వేల కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ప్రాధాన్యాల మీద తొలిరోజు గవర్నర్‌ ప్రసంగించారు. ఈ రెండింటి మీద చర్చ జరిగింది. 11 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించారు. గత ప్రభుత్వం పౌరుల గోప్యతను ప్రమాదంలోకి నెట్టి, పెగసస్‌ అనే స్పైవేర్‌ను వాడిందనే ఆరోపణలపై చర్చ జరిగింది. ఒక సభా సంఘాన్ని వేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడే సందర్భంగా ముఖ్య మంత్రి వచ్చే ఏడాదికి సంబంధించిన వెల్‌ఫేర్‌ క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఇది ప్రజలకు వెల్‌ఫేర్, ప్రతిపక్షానికి ఫేర్‌వెల్‌ అని కూడా ముఖ్యమంత్రి కామెంట్‌ చేశారు. ‘వెల్‌ఫేర్‌’ అనే మాటను తిరగేస్తే ‘ఫేర్‌వెల్‌’ అనే మాట వస్తుంది. ప్రభుత్వ వెల్‌ఫేర్‌ ఎజెండాను వ్యతిరేకిస్తే, ప్రతిపక్షానికి ఫేర్‌వెల్‌ తప్పదనే అర్థంలో ముఖ్యమంత్రి కామెంట్‌ చేసి ఉంటారు. మొత్తం పన్నెండు రోజుల్లో 103 మంది సభ్యులు చర్చల్లో పాల్గొన్నారు. కానీ, తెలుగుదేశం సభ్యులెవరూ కూడా ఈ చర్చల్లో పాల్గొనలేదు.

‘సీసా’ పద్యమే ఏకైక ఎజెండాగా సభలో టీడీపీ వ్యవహారాల్ని నడిపింది. నాటుసారా తాగడం వల్ల జంగారెడ్డి గూడెంలో కొంతమంది చనిపోయారని ఎల్లో మీడియా – తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా చేసిన ప్రచారాన్నే టీడీపీ ఎమ్మెల్యేలు సభలోకి మోసుకొని వచ్చారు. దానిపై న్యాయ విచారణ జరగాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిరోజూ వాయిదా తీర్మానాన్ని ఇవ్వడం, సభను స్తంభింపజేయడం... ఏకసూత్ర కార్యక్రమంగా పెట్టుకున్నారు. సహజ మరణాలను సారా మరణాలుగా చిత్రీకరిస్తున్నారనీ, అసలు చంద్రబాబు హయాం లోనే మద్యం ఏరులై పారిందనీ అధికార పక్షం ఎదురుదాడి చేసింది. ఈ ఎపిసోడ్‌ను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మద్యం పాలసీకి సంబంధించి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ వైఖరిని ముందుగా అవగాహన చేసుకోవాలి.

మద్యపాన రహిత సమాజమే తమ పార్టీ విధానమని గతంలోనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. అయితే ఒకే ఉదుటున మద్యనిషేధం అసాధ్యం కనుక, గతంలో జరిగిన అటువంటి ప్రయత్నాలు విఫలమైన అనుభవాలున్న నేప థ్యంలో పార్టీ అధికారంలోకి రాగానే మధ్యేమార్గాన్ని ఎంచు కొన్నది. మద్యపాన ఆసక్తిని నిరుత్సాహపరచడం, అలవాటును క్రమంగా మాన్పించడం అనే కార్యక్రమాన్ని చేపట్టింది. అంతకుముందు వీధివీధినా, వాడవాడనా వెలసిన 44 వేల బెల్టు షాపులను ఎత్తివేసింది. షాపులకు అనుబంధంగా ఓపెన్‌ బార్‌లుగా నడుస్తున్న పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేసింది. షాక్‌ కొట్టే విధంగా ధరలుండాలనీ, దానివల్ల తాగాలన్న కోరికను అదుపులో పెట్టుకుంటారన్న ఉద్దేశంతో రేట్లు పెంచారు. షాపు లను ప్రైవేట్‌ వ్యక్తులకు కేటాయిస్తే లాభాపేక్ష వలన మళ్లీ బెల్టు షాపులకు తెరతీస్తారన్న ఆలోచనతో ప్రభుత్వం ఆ వ్యాపారాన్ని స్వయంగా చేపట్టింది. షాపుల సంఖ్యను కూడా తగ్గించి, అమ్మే వేళల్ని కూడా కుదించింది. కొంతకాలం తర్వాత ధరలు కొంత తగ్గించాలన్న డిమాండ్‌ ముందుకు వచ్చింది. అలవాటుకు బానిసలైన వారు తొందరగా మానలేకపోతున్నారనీ, పెరిగిన ధరలను భరించలేక నాటు సరుకుకు అలవాటయ్యే అవకాశ ముందనీ కనుక కొంతమేరకు ధరలు తగ్గించాలనీ ప్రభుత్వానికి అభ్యర్థనలు అందాయి. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా అవుతున్నదని కూడా వార్తలు వచ్చాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ధరలకు తగ్గించింది. మద్యం అక్రమ రవాణానూ, నాటుసారా తయారీనీ, గంజాయి అక్రమ రవాణా వగైరాలనూ పూర్తిగా అరికట్టే ఉద్దేశ్యంతో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ)ను ఏర్పాటు చేసింది. ఈ ఏర్పాటు ఇప్పటికే సత్ఫలితాలనిచ్చింది. ఈ మొత్తం వ్యవహారాల్లో దండలో దారంలాగా అంతర్లీనంగా ఒక సంకల్పం మనకు కనబడుతున్నది. సంకల్పాన్ని వాస్తవికతనూ బ్యాలెన్స్‌ చేసుకుంటున్న ఒక లాజిక్‌ కనబడుతున్నది.

ఇక జంగారెడ్డిగూడెం ఘటన విషయానికి వద్దాము. అక్కడ నాటుసారా తాగి నాలుగైదు రోజుల్లో పదహారు మంది చనిపోయారని ముందుగా సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాతనే ఎల్లో మీడియా హడావిడి చేసింది. ఆ వెంటనే చంద్రబాబు నాయుడు అక్కడ పర్యటించి వచ్చారు. కల్తీ మద్యంతో జనం చనిపోతున్నారని మీడియా సమావేశం పెట్టి ఆరోపించారు. నిజ నిర్ధారణ కోసం వెళ్లిన ఆర్డీవో విచారణ జరిపి, చనిపోయిన వారిలో ముగ్గురికి మాత్రమే మద్యం సేవించే అలవాటున్నదని ప్రకటించారు. మిగిలిన వారు వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో చని పోయారని చెప్పారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారంగా ఉండే ఒక చిన్న పట్టణం జంగారెడ్డి గూడెం. 2011 లెక్కల ప్రకారం ఈ పట్టణం జనాభా 48,494. ఏజెన్సీ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వలసలు పెరగడం వలన ప్రస్తుతం పట్టణ జనాభా 70 వేలు దాటిందని చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితి పాపులేషన్‌ లెక్కల ప్రకారం భారతదేశంలో సగటు మరణాల రేటు ప్రతి వెయ్యి జనాభాకు 7.3. గడచిన ఐదేళ్లుగా దాదాపు ఇదే నిష్పత్తి కొనసాగుతున్నది. ఈ లెక్కను జంగారెడ్డి గూడెం పట్టణానికి వర్తింపజేస్తే సగటున ఏడాదికి సుమారు 500 మరణాలు సంభవించే అవకాశం ఉన్నది. అంటే నెలకు నలభైకి పైగా! గడచిన రెండు మూడు మాసాల లెక్కలు చూస్తే ఎన్నడూ ఈ సంఖ్య దాటలేదు. మరి ఈ ‘సారా మరణాలు’ సాధారణ సంఖ్యను ఎందుకు దాటలేదు?

ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేపట్టిన సారా ఉద్యమాన్ని వెన్నంటే... ఇంకో ప్రచారం సోషల్‌ మీడియాలో మొదలైంది. మద్యం దుకాణాలు ప్రైవేట్‌ వ్యాపారుల చేతిలో ఉన్నప్పుడు వారి వ్యాపారం కోసం నాటు సారా సమాచారాన్ని ఎక్సైజ్‌ వారికి చేరవేసేవారు. ఇప్పుడు ప్రభుత్వ దుకాణాల్లో పనిచేసే వారికి అటువంటి చొరవ లేనందువల్లనే నాటు సారా తయారీ పెరుగు తున్నదని ఈ ప్రచారం సారాంశం. ఇప్పుడు సినిమా అర్థమవు తున్నట్టే కదా? మద్య నియంత్రణ లక్ష్యం నుంచి ప్రభుత్వాన్ని తప్పించేందుకు ప్రతిపక్షం తయారు చేసిన గేమ్‌ ప్లాన్‌. కొత్త విధానం వల్ల నష్టపోయిన తమ పార్టీ అనుయాయులైన మద్యం వ్యాపారులను రంగంలోకి దించి నడిపిస్తున్న నాటకం. ఈ ప్రచారం వలన ఒత్తిడి పెరిగి ప్రభుత్వం మద్యం దుకాణాలను మళ్లీ ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టాలి. వారు పర్మిట్‌ రూమ్‌లు, బెల్ట్‌షాపులు ఓపెన్‌ చేయాలి. మద్య నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని చెప్పాలి. తన అనుయాయులు కాసులు దండుకోవాలి.

సమావేశాల ముగింపు రోజున వచ్చే ఏడాది కాలానికి గానూ సంక్షేమ కార్యక్రమాల క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మరోసారి ద్రవ్యోల్బణం ఛాయలు ముసురుకుంటున్నట్టు కనిపిస్తున్న పరిస్థితుల్లో ఈ సంక్షేమ క్యాలెండర్‌కు ప్రాధాన్యం ఉన్నది. గడచిన రెండేళ్లపాటు కోవిడ్‌ విసిరిన సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించిన ఉపాయం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన నగదు బదిలీ (డిబిటీ) కార్యక్రమం. దాదాపు లక్షా ముప్ఫయ్‌వేల కోట్ల రూపా యల నగదును వివిధ స్కీముల కింద వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం జనం చేతిలో పెట్టింది. చిల్లర శ్రీ మహాలక్ష్మి అంటారు పెద్దలు. కోటి కుటుంబాల తలుపుతట్టిన శ్రీమహాలక్ష్మి గ్రామీణ సంతల దగ్గర్నుంచి పట్టణ మార్కెట్‌ల వరకు గతిశీలతతో నిలబడేలా దీవించింది. సంక్షోభంలో కూరుకుపోకుండా కాపాడింది. 

అంతటి ప్రాధాన్యం కలిగిన సంక్షేమ క్యాలెండర్‌కు ఎల్లో మీడియాలో తగినంత చోటు దొరక్కపోవడం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే ‘కాగ్‌’ నివేదిక పేరుతో ఆ మీడియాకు ఓ కొబ్బరికాయ దొరికింది. ఏటా బడ్జెట్‌ సమా వేశాలప్పుడు ఈ కొబ్బరికాయ పగలాల్సిందే! ఇది రాజ్యాంగ ధర్మం. కాకపోతే పూజనంతా వదిలేసి, కొబ్బరి చిప్పలపైనే ఎల్లో మీడియా మోజు పడటం విశేషం. ప్రభుత్వాల జమాఖర్చుల్ని ఆడిట్‌ చేయడం ‘కాగ్‌’ బాధ్యత. అందుకోసం కొన్ని నిర్దిష్ట ప్రమాణాలను అది ఏర్పాటు చేసుకున్నది. వాటి ఆధారంగా అది తన నివేదికను విడుదల చేస్తుంది. ప్రభుత్వాలకు అవసర మయ్యే వెసులుబాటు దారులను అది గుర్తించదు. ప్రభుత్వ వ్యయాల మీద ‘కాగ్‌’ సాంకేతిక విమర్శలు సర్వసాధారణం. ఒక లక్షా తొమ్మిదివేల కోట్ల రూపాయల ఖర్చుకు సంబంధించి శాసనసభ అనుమతి పొందలేదన్నది ‘కాగ్‌’ ప్రధాన విమర్శ. ఈ విషయాల్ని ఎల్లో మీడియా ప్రధాన వార్తగా ఫోకస్‌ చేసింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం దాదాపు రెండు లక్షల కోట్ల రూపా యలను బడ్జెట్‌ కేటాయింపు లేకుండా ఖర్చు చేసిందనీ, శాసన సభ అనుమతి తీసుకోవాలనీ పదేపదే సూచించినా కూడా పెడచెవిన పెట్టిందనీ అప్పట్లో ‘కాగ్‌’ విమర్శించింది. కానీ అప్పుడది ఎల్లో మీడియాలో ప్రాధాన్యతకు నోచుకోలేదు. గత ఆర్థిక సంవత్సరంలో 41 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్లులను నిబంధనల మేరకు ట్రెజరీ కోడ్‌ ప్రకారం కాకుండా సీఎఫ్‌ఎమ్‌ఎస్‌ ద్వారా చెల్లించారనీ, ఇటువంటి సాంకేతిక లోపాలను సరిదిద్దుకోవాలనీ ‘కాగ్‌’ సలహా ఇచ్చింది. ఈ పాయింట్‌ను ఆసరాగా తీసుకొని 41 వేలకోట్ల రూపాయలు గల్లంతయ్యాయనీ, ఆ డబ్బును ఎవరు మింగేశారో తేల్చాలనీ గగ్గోలు చేయడం ఒక రకమైన వింత ప్రవర్తనగానే పరిగణించాలి. తెలుగుదేశం అధికారంలో ఉన్న చివరి సంవత్సరంలో కూడా వివిధ పద్దుల కింద కేటాయింపులు చేసిన రూ. 47 వేల కోట్లను ఖర్చు చేయలేదని ‘కాగ్‌’ అప్పుడు చెప్పింది. మరి ఆ సొమ్మును ఎవరు మింగేసినట్టు!

జగన్‌ ప్రభుత్వం ఎంచుకున్న అభివృద్ధి వికేంద్రీకరణ పథాన్ని తెలుగుదేశం – ఎల్లో మీడియా కూటమి, ఆ కూటమి తాబేదార్లు తప్పుపడుతున్నారు. అమరావతిని ఏకైక రాజ ధానిగా ప్రకటించడమొక్కటే అభివృద్ధికి కొండగుర్తు అన్నట్టుగా వీరి ప్రచారం కొనసాగుతున్నది. చంద్రబాబు పరిపాలన సామాజిక విధ్వంసానికి ప్రతిరూపంగా రుజువయినప్పటికీ, ఆయనను అభివృద్ధికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రచారం చేయ డాన్ని ఈ కూటమి మానలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణులు చెబుతున్న అభివృద్ధి నిర్వచనాలకూ, చంద్రబాబు విధానాలకూ ఏమాత్రం సాపత్యం ఉండటం లేదు.

భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్, షికాగో యూనివర్సిటీ ప్రొఫెసర్‌ రఘురామరాజన్‌ మరో ప్రొఫెసర్‌ రోహిత్‌ లాంబాతో కలిసి భారత ఆర్థిక రంగానికి సంబంధించి కొన్ని వరస వ్యాసాలను ఇటీవల రాశారు. రెండు రోజుల కిందటే ఒక జాతీయ దినపత్రికలో ‘మైండ్, బాడీ అండ్‌ గ్రోత్‌’ పేరుతో ఒక వ్యాసం వచ్చింది. ఇందులో వారు చెప్పిందే మిటంటే – నాణ్యమైన విద్య, నైపుణ్యం (మైండ్‌), శారీరక ఆరోగ్యం (బాడీ) కలిసి ఆర్థిక వృద్ధికి (గ్రోత్‌)కు బాటలు వేస్తాయని! అంటే సమస్త ప్రజానీకానికి సమాన స్థాయిలో నాణ్యమైన విద్యాబుద్ధులు నేర్పి, నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందుబాటులో ఉంచినట్లయితే నైపుణ్యం గల మానవ వనరులు తయారవుతాయనీ, అవే దేశాభివృద్ధిని నిర్దేశిస్తాయనీ వారు స్పష్టంగా చెప్పారు.

భారత ఆర్థికాభివృద్ధికి ఏ మార్గాన్ని ఎంచుకున్నా సరే, లక్ష్యాన్ని సాధించాలంటే మానవ వనరులే కీలకమని వారు ఘంటాపథంగా చెప్పుకొచ్చారు. తెలుగు రాష్టాల్లో ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను విధ్వంసం చేసిన వారిలో మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు. ఇది దాచేస్తే దాగని సత్యం. నూటికి తొంభైమందికి నాణ్యమైన విద్య దొరక్కపోవడానికీ, వైద్యం అంగడి సరుకుగా మారడానికీ ఆయనే ప్రధాన కారకుడు. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ చారిత్రక దుర న్యాయాన్ని సరిదిద్దే పనిచేస్తున్నది. కుల మత ప్రాంత, ధనిక – పేద తేడా లేకుండా అందరికీ ఒకే విధమైన నాణ్యమైన విద్య, నైపుణ్యాలు అలవడే విద్యా వ్యవస్థకూ, ఆరోగ్య వ్యవస్థకూ బాటలు వేస్తున్నది. ఈ విషయాలన్నీ జనం అనుభవంలోకి ప్రత్యక్షంగా వస్తున్నాయి. అభివృద్ధికి అర్థమేమిటో వారికి అవగతమవుతున్నది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులను తెలిసో, తెలియకో సహించిన ప్రజలు ఇప్పుడు సహించేందుకు ఎంతమాత్రమూ సిద్ధంగా లేరు. ఎల్లో మీడియా ఎన్ని కథలు చెప్పినా సరే, వారి ఎమ్మెల్యేలు ఎన్ని ఈల పాటలు పాడినా సరే! ‘ఈలపాట’కు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకునే రఘురామయ్య గారు కృష్ణుని వేషంలో చెప్పే పద్యాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ‘చెల్లియో చెల్లకో తమకు చేసిన యెగ్గులు సైచి రందరున్, తొల్లి గతించె...’! అంటే... ఇప్పుడిక పప్పులు ఉడకవని అర్థం.

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement