జర్మనీ రాజకీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది. మరో కొత్త అధ్యాయం మొదలైంది. పదహారేళ్ళ సుదీర్ఘకాలం తర్వాత జర్మనీకి కొత్త సారథి వచ్చారు. అనేక ఒడుదొడుకుల మధ్య 2005 నుంచి ఏకధాటిగా దేశాన్ని విజయవంతంగా ముందుకు నడిపిన ఏంజెలా మెర్కెల్ స్థానంలో ఓలఫ్ షాల్జ్ ప్రపంచ యుద్ధానంతర జర్మనీకి 9వ ఛాన్సలర్ అయ్యారు. సోషల్ డెమోక్రాట్ అయిన ఆయన కొద్ది నెలల క్రితం జరిగిన ఫెడరల్ ఎన్నికలలో తమ పార్టీకి స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించి, పెట్టారు. అటుపైన మరో రెండు పార్టీలతో సంకీర్ణ ఒప్పందం కుదుర్చుకొని, అలా మూడు పార్టీల కొత్త సంకీర్ణ ప్రభుత్వపు పగ్గాలు తీసుకున్నారు. ఐరోపాలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ జర్మనీని నవీకరించి, ప్రగతిపథంలో మరింత ముందుకు తీసుకుపోతామని సంకల్పం చెప్పుకున్నారు.
షాల్జ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మధ్యేవాద వామపక్ష ‘సోషల్ డెమోక్రాటిక్ పార్టీ’ (ఎస్పీడీ), దానితో సైద్ధాంతిక వైరుద్ధ్యాలున్న ఉదారవాద ‘ఫ్రీ డెమోక్రాట్లు’ (ఎఫ్డీపీ), అలాగే ‘గ్రీన్స్’ – ఈ మూడూ తొలిసారిగా కలసి సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేస్తున్నాయి. వరుసగా ఆ 3 పార్టీల సాంప్రదాయిక రంగులు – ఎరుపు, పసుపు, ఆకుపచ్చ. అచ్చంగా ట్రాఫిక్ లైట్‌లోని వరుసలోనే పార్టీల రంగులూ ఉండడంతో, జర్మనీ రాజకీయాల్లో ఇది ‘ట్రాఫిక్ లైట్ సంకీర్ణం’గా పేరు తెచ్చుకుంది. ఈ మూడు పార్టీలూ కలిస్తే పార్లమెంటు దిగువ సభలో మంచి మెజారిటీ ఉంది. దాంతో, తమ 177 పేజీల సంకీర్ణ ఒప్పందానికి ఆమోద ముద్ర వేసుకొని, జనవరి మొదట్లో కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది. ఐరోపా ఖండంలో కొత్త సంబంధాలకు తెర తీయాలనీ, ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే, ఖండంలోకెల్లా అతిపెద్ద తమ ఆర్థికవ్యవస్థని డిజిటలీకరణతో పరుగులు తీయించాలనీ భావిస్తోంది.
నిష్క్రమిస్తున్న ప్రభుత్వంలో మెర్కెల్ కింద దేశ వైస్ ఛాన్సలర్‌గా ఆర్థిక మంత్రిగా పనిచేసిన రాజకీయ అనుభవం షాల్జ్ సొంతం. కానీ మెర్కెల్‌ను మరిపించేలా చేయడం ఆయనకూ, ఆయన సర్కారుకీ అంత సులభమేమీ కాదు. ఈ నెల 8న పదవి నుంచి విరమించుకున్న మెర్కెల్ మరొక్క 10 రోజులు గనక కొనసాగి ఉంటే, తన రాజకీయ గురువు హెల్మట్ కోల్‌ను అధిగమించి, ప్రపంచ యుద్ధానంతరం అత్యధిక కాలం ఛాన్సలరనే రికార్డు సృష్టించి ఉండేవారు. జర్మనీకి అంతకాలం సారథ్యం వహించిన ఘనత మేడమ్ మెర్కెల్‌ది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నిరంకుశవాదం పెచ్చరిల్లుతున్న సందర్భంలో తద్భిన్నంగా ఉదారవాద ప్రజాస్వామ్యపు దివిటీ ఎత్తిన నడత ఆమెది. ఇన్నేళ్ళ పదవీకాలంలో జర్మనీ, ఐరోపాలను అనేక సంక్షోభాల నుంచి గట్టెక్కించిన చరిత ఆమెది. సిరియా శరణార్థులను దేశంలోకి అనుమతించడం సహా అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న నిష్క్రమిస్తున్న ప్రభుత ఆమెది. ఆమె సర్కారు కన్జర్వేటివ్‌లు, ఎస్పీడీల భారీ సంకీర్ణం. మరో విడత దేశానికి సారథ్యం వహించాలని ఆమె కోరుకోలేదు. ఆమె తరువాత ఇప్పుడాయన పీఠమెక్కారు.
మునుపటి అధినేత్రి మెర్కెల్‌కు పాలనా దక్షురాలిగా పేరున్నా, అనేక సమస్యలను ఆమె పరిష్కరించలేదని అభియోగం మోపేవారూ ఉన్నారు. సమస్యలను చాప కిందకు నెట్టేస్తూ, అప్పటికి ఏదోలా బండి నడిపిస్తూ వచ్చారని ఆమెను ఆక్షేపించే విమర్శకులూ ఉన్నారు. ఆమె తరువాత గద్దెనెక్కిన షాల్జ్ అనేక అంశాలపై కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని వారి అంచనా. అందుకే, పూర్వాశ్రమంలో లాయరైన షాల్జ్‌కు ఈ అధికార పీఠం పూలపాన్పు కాదు. కార్మిక, ఉపాధి చట్టాలలో నిపుణుడైన ఆయన ముందు అనేక తక్షణ సవాళ్ళున్నాయి.
బ్రెగ్జిట్ తాలూకు పరిణామాల్లో ఐరోపా ఇప్పటికీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. బెలారస్‌తో ఐరోపా సమాజపు (ఈయూ) సరిహద్దులోనూ సమస్య ఉంది. ఇంకోపక్క అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు ఉండనే ఉన్నాయి. కరోనా మహమ్మారితో పోరాటానికి తక్షణమే అత్యధిక ప్రాధాన్య మిస్తామని షాల్జ్ ప్రకటించారు. అలాగే, సంకీర్ణ సర్కారు అనేక స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలూ పెట్టుకుంది. సంకీర్ణపు ఒప్పందం మేరకు పునర్వినియోగ ఇంధనాల వైపు విస్తరణ సాగించాల్సి ఉంది. కాలుష్యకారక బొగ్గు నుంచి దూరం జరగాల్సి ఉంది. కనీస వేతనాలు పెంచాల్సి ఉంది. అణువిద్యుత్‌కు దశల వారీగా దూరమవుతామన్న పదేళ్ళనాటి సర్కారీ నిర్ణయాన్ని కొనసాగించడమూ కొత్త పాలకులకు తలనొప్పే. ఇప్పటికే కర్బన ఉద్గారాలను అత్యధికంగా వెలువరిస్తూ, ఐరోపాలోకెల్లా విద్యుత్ ఛార్జీలు అధికమైన జర్మనీ అణువిద్యుత్ ఆసరా లేకుండా, దేశంలో కరెంటివ్వడమే కష్టం. అధికార భాగస్వాములైన ‘గ్రీన్స్’ అభిమతం మేరకు అకర్బనీకరణతో, హరిత ప్రస్థానం మరింత కష్టం. ఇక, విదేశాంగ విధానంలోనూ రష్యా, చైనాలతో వ్యవహారం నల్లేరుపై నడక కాబోదు. భారత్ సంగతికొస్తే, ఐరోపాలో అతి పెద్ద వాణిజ్య భాగస్వామి జర్మనీయే. మన దగ్గర ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల (ఎఫ్డీఐ)కీ అదే కీలకం. కాబట్టి, వాణిజ్యం, హరిత ధనసాయం, సరఫరా వ్యవస్థలపై కొత్త సర్కారు నిర్ణయాలు భారత్‌పై ప్రభావం చూపుతాయి. 1924లో బెర్లిన్‌లో తొలిసారి ట్రాఫిక్ లైట్ పెట్టినప్పుడు అది సరిగ్గా పనిచేస్తుందో, లేదోనని అనుమానించారు. ‘‘కానీ సరైన దిశలో, సురక్షితయానానికి అది తప్పనిసరని కాలగతిలో రుజువైంది’’ అని షాల్జ్ వందేళ్ళ క్రితం సంగతి గుర్తు చేశారు. అలాగే, తమ ‘ట్రాఫిక్ లైట్’ సంకీర్ణం సైతం జర్మనీ ప్రగతిలో అపూర్వ పాత్ర పోషిస్తుందని ఆయన ఆశిస్తున్నారు. ఆశయంగా పెట్టుకున్నారు. కొత్త సారథి ఆశలు నెరవేరితే, జర్మనీ కొత్త ప్రయాణంలో అది మరో సరికొత్త మజిలీ!
Comments
Please login to add a commentAdd a comment