
యుద్ధం ఎక్కడ జరిగినా, ఎప్పుడు జరిగినా, ఎందుకు జరిగినా మానవాళికి తీరని నష్టం తప్పదు. ఇందుకు ఎన్నో అనుభవాలు ఇప్పటికే ఉన్నాయి. గడచిన యుద్ధాలు చేసిన గాయాల మచ్చలింకా మిగిలే ఉన్నాయి. అయినా ఇప్పటికీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ‘యుద్ధం ఎప్పుడు వచ్చినా, తొలుత మరణించేది సత్యమే’ అన్నాడు అమెరికన్ రాజనీతిజ్ఞుడు హైరమ్ వారెన్ జాన్సన్. చరిత్రలో యుద్ధాలతో గడిచిన కాలమే ఎక్కువ. యావత్ ప్రపంచం అంతటా శాంతి పరిఢవిల్లిన కాలం చాలా తక్కువ. లోకంలో ఎందుకు శాంతికి కరవు ఏర్పడుతోందంటే, ‘పగవృద్ధి బొందించు భ్రష్టులే కాని/యడగించు నేర్పరు లవనిలో లేరు’ అని ‘పలనాటి వీరచరిత్ర’లో కవిసార్వభౌముడు శ్రీనాథుడు ఏనాడో కుండబద్దలు కొట్టాడు. అంతేకాదు, ‘బోరు మంచిదికాదు భూమినెక్కడను/ పాడౌను దేశంబు పగమించెనేని’ అని హితవు పలికాడు. యుద్ధోన్మాదం తలకెక్కిన నియంతలకు, మిథ్యాపౌరుషాలతో పిచ్చిపట్టిన పాలకులకు ఇలాంటి హితోక్తులు రుచించవు. వాళ్ల ఆధిపత్యమే వాళ్లకు ముఖ్యం. వాళ్ల చండశాసనాలు చలామణీ కావడమే వాళ్లకు ముఖ్యం.
ప్రపంచంలో ఏదో ఒక దేశం సహేతుకంగానో, నిర్హేతుకంగానో మరో దేశం మీదకు దండెత్తుతుంది. దండయాత్రకు గురైన దేశం అనివార్యంగా ఆత్మరక్షణ కోసం యుద్ధంలోకి దిగుతుంది. అలా మొదలైన యుద్ధం ఎన్నాళ్లు సాగుతుందో, ఎన్నేళ్లు సాగుతుందో ఎవరూ అంచనా వేయలేరు. యుద్ధం ముగిశాక చూసుకుంటే రెండు దేశాల్లోనూ సామాన్య పౌరులకు మిగిలేది అంతులేని విషాదమే! ఉక్రెయిన్‌పై రష్యా ప్రస్తుతం యుద్ధం కొనసాగిస్తున్న నేపథ్యంలో మూడో ప్రపంచయుద్ధం ముంచుకొచ్చే ప్రమాదం లేకపోలేదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతపనే గనుక జరిగితే, అప్పుడు జరగబోయే అనర్థాలను ఎవరూ అంచనా వేయలేరు.‘మూడో ప్రపంచయుద్ధంలో ఏ ఆయుధాలతో పోరు జరుగుతుందో నాకు తెలీదుగాని, నాలుగో ప్రపంచయుద్ధంలో మాత్రం కర్రలు, రాళ్లతోనే పోరు జరుగుతుంది’ అన్నాడు ఐన్‌స్టీన్. ఒకవేళ మూడో ప్రపంచయుద్ధమే గనుక జరిగితే, ఆ యుద్ధంలో జరిగేది నాగరికతా వినాశనమేనని ఆయన అంచనా. నాగరికత నశించాక మనుషులకు కొట్టుకోవడానికి మిగిలేవి కర్రలు, రాళ్లే! ఆధిపత్య వాదులు, నిరంకుశ నియంతలు తప్ప సామాన్యులెవరూ యుద్ధాలను కోరుకోరు. యుద్ధాల్లో పాల్గొనే సాధారణ సైనికులు సైతం స్వభావసిద్ధంగా శాంతికాముకులుగానే ఉంటారు. విధి నిర్వహణ కోసం తప్ప ఉత్తపుణ్యానికే వారెవరితోనూ కయ్యానికి కాలుదువ్వరు. ‘వయసు మళ్లిన వాళ్లు యుద్ధాలను ప్రకటిస్తారు. అయితే, యుద్ధాల్లో పాల్గొని ప్రాణాలు పోగొట్టుకునేది యువకులే’ అన్నాడు అమెరికన్ రాజనీతిజ్ఞుడు హెర్బర్ట్ హూవర్.
నాగరికతలు మొదలైన నాటి నుంచి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. క్రీస్తుకు పూర్వం శతాబ్దాల కిందటి నుంచే కళా సాహిత్యాలలో యుద్ధం ప్రభావం కనిపిస్తుంది. యుద్ధం వల్ల అనర్థాలు తప్ప ఒరిగేదేమీ ఉండదని ఎందరో కవులు, రచయితలు, తత్త్వవేత్తలు చెబుతూనే వస్తున్నారు. మొదటి ప్రపంచయుద్ధానికి చాలాకాలం ముందే రష్యన్ రచయిత లియో టాల్‌స్టాయ్ ‘వార్ అండ్ పీస్’ నవల రాశాడు. యుద్ధాలకు ఉవ్విళ్లూరే పాలకుల ధోరణిని ఎత్తిపొడుస్తూ, ‘రాజులు చరిత్రకు బానిసలు’ అని ఆయన తేల్చాడు. యుద్ధాల్లో మంచి యుద్ధాలు, చెడ్డ యుద్ధాలు అంటూ ఏవీ ఉండవు. ఎలాంటి యుద్ధమైనా– అది ఒక సామూహిక మానవ హననకాండ. ‘ఎంత అవసరమైనా సరే, ఎంత సమర్థనీయమైనా సరే యుద్ధం నేరం కాదనుకోవడం తగదు’ అని అమెరికన్ రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే అన్నట్లు ఎలాంటి యుద్ధమైనా, అది మానవాళి పట్ల నేరమే! ఈ భూమ్మీద యుద్ధం జరగని చోటంటూ ఏదీ లేదు. ‘రణరంగం కానిచోటు భూ/ స్థలమంతా వెదకిన దొరకదు/ గతమంతా తడిసె రక్తమున/ కాకుంటే కన్నీళులతో’ అన్నాడు శ్రీశ్రీ.
ప్రత్యక్ష యుద్ధాలు, ప్రచ్ఛన్న యుద్ధాలు, అంతర్యుద్ధాలు– ఇలా రకరకాల యుద్ధాలు ఎక్కడో ఒకచోట ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉన్నాయి. యుద్ధంలో గెలిచిన పక్షమే సరైనదని నిర్ణయించలేం. యుద్ధం ముగిసీ ముగియడంతోనే శాంతి వెల్లివిరుస్తుందనుకోవడం భ్రమ! యుద్ధం ముగిశాక మనుషుల మధ్య సామరస్యాన్ని కాపాడుకోగలిగినప్పుడే శాంతి స్థాపనకు ఆస్కారం ఏర్పడుతుంది. ‘యుద్ధంలో గెలుపు సాధించడంతోనే సరిపోదు. శాంతిని నెలకొల్పి, దానిని కాపాడుకోవడం ముఖ్యం’ అన్నాడు గ్రీకు తత్త్వవేత్త అరిస్టాటిల్. ఇప్పటికే జరిగిన రెండు ప్రపంచయుద్ధాలు మానవాళికి అనేక గుణపాఠాలు నేర్పాయి. రెండో ప్రపంచయుద్ధం ముగిశాక ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. శాంతిని ఉల్లంఘించే దేశాలపై చర్యలు తీసుకునేందుకు అంతర్జాతీయ కోర్టు ఏర్పడింది. శాంతి స్థాపన కోసం అంతర్జాతీయ చట్టాలు అమల్లోకి వచ్చాయి. ప్రపంచశాంతి కోసం ఇంతటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా యుద్ధాలు జరగడం ఆగట్లేదు. ‘రెండు యుద్ధాల నడుమ విరామ కాలమే శాంతి’ అన్నాడు బ్రిటిష్ ఆర్థికవేత్త రాల్ఫ్ హాట్రే. అయితే, యుద్ధాలు సమసిపోయిన తర్వాత కూడా చాలాచోట్ల ఉద్రిక్తతలు కొనసాగే పరిస్థితులు ఉన్నప్పుడు వర్తమాన ప్రపంచంలో శాంతి అనేది ఒక ఎండమావి! బలిసిన దేశాలు ఒకవైపు శాంతి ప్రవచనాలు చెబుతూనే, మరోవైపు అణ్వాయుధ సంపదను పోగేసుకుంటూ, ఆయుధ వ్యాపారాలు సాగిస్తున్న నేపథ్యంలో ప్రపంచశాంతి ఎంతమేరకు సాధ్యమవుతుందో చరిత్రే చెప్పాలి మరి!
Comments
Please login to add a commentAdd a comment