‘వెర్రి వెయ్యి విధాలు’ అంటారు. ‘ఎవడి వెర్రి వాడికి ఆనందం’ అంటారు. ‘వెర్రి ముదిరిందంటే రోకలి తలకు చుట్టండి అన్నాట్ట’ అనే సామెత మనకు తెలియనిది కాదు. వెర్రికి తిక్క, పిచ్చి, రిమ్మ, మతిభ్రంశం, మతిభ్రమణం, చిత్తచాంచల్యం, ఉన్మాదం వంటి పర్యాయపదాలు చాలానే ఉన్నాయి. వెర్రి లేదా పిచ్చికి సంబంధించి తెలుగులోనే కాదు, ప్రపంచంలోని దాదాపు అన్ని భాషల్లోనూ నానుడులు, సామెతలు, జాతీయాలు, పదబంధాలు పుష్కలంగా ఉన్నాయి. కవిత్వంలోనూ, కాల్ప నిక సాహిత్యంలోనూ పిచ్చితనం లేదా వెర్రితనం ప్రస్తావన విరివిగానే కనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా భాషా సాహిత్యాలకూ వెర్రితనానికీ ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది మరి!
అప్పుడెప్పుడో అమాయకపు సత్తెకాలంలో ‘వెర్రి వెయ్యి విధాలు’ అని జనాలు వాపోయేవారు గానీ, ఇప్పటి ప్రపంచంలోనైతే కొత్త కొత్త వెర్రితనాలు వెలుగులోకి వస్తూ, వార్తలకెక్కుతూనే ఉన్నాయి. వెర్రి వెయ్యి విధాలు అనే నమ్మకం ప్రబలంగా ఉన్న కాలంలో కొత్తపల్లి సూర్యారావు ‘ఉన్మాద సహస్రము– వెఱి<కి వేయి విధములు’ పేరిట వెర్రిలోని వెయ్యి విధాలకు వెయ్యి పద్యాలతో సహస్రాన్ని రాశారు. మన సాహిత్యంలో శతకాలు శతాధికంగా ఉన్నాయి. అక్కడక్కడా ద్విశతకాలు, త్రిశతకాలూ లేకపోలేదు. అయితే, ఏకంగా ఒకే అంశంపై వెయ్యి పద్యాలతో కూడిన సహస్రం తెలుగు సాహిత్యంలో బహుశ ఇదొక్కటేనేమో!
వెర్రి మీద ఏకంగా సహస్రమే రాసి పారేయాలనే ఆలోచన వెనుక ఎంతటి వెర్రి ఉండి ఉండాలి! ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకుంటూ, ‘వేయిపై నొక్కటవదగు వెఱి<గాదె/ వెఱి<వారల వెఱి< వ్రేలువంచి/ లెక్కపెట్టుట తన వెఱి< యొక్కడైన/ గానలేకుంట నాబోటిగాడు జగమ!’ అనడం విశేషం. ఇలా ఎలాంటి శషభిషలూ లేకుండా తన వెర్రిని తానే స్వయంగా ప్రకటించుకోవడం కంటే ఆత్మజ్ఞానం ఏముంటుంది? ఆత్మవంచనా శిల్పంలో ఆరితేరిన సమాజానికి ఆత్మజ్ఞానులు వెర్రివాళ్లుగానే కనిపిస్తారు. అది వేరే సంగతి.
‘వెర్రితనాన్ని బట్టబయలు చేసుకోవడం కంటే, రహస్యంగా ఉంచుకోవడమే మేలు’ అన్నాడు గ్రీకు తత్త్వవేత్త హెరాక్లిటస్. రహస్యంగా దాచుకోవడానికి వెర్రితనం ఏమైనా నల్లడబ్బా? వెర్రితనం అన్నాక వెలుతురులా బట్టబయలు కాకుండా ఉంటుందా ఎక్కడైనా? పాపం ఆయన ఎంత వెర్రి మాలోకం కాకపోతే అలా చెబుతాడు? మనం ఎంత మామూలుగా ఉందామనుకున్నా మనకు పిచ్చెక్కించే సందర్భాలు ఎదురవుతాయి.
అలాంటివి తట్టుకోలేని పరిస్థితుల్లో ఏమీ చేయలేక మన జుట్టు మనమే పీక్కుంటుంటాం. ఇక వెర్రివాళ్లు పాలకులైతేనా? వాళ్ల ఏలుబడిలోని ప్రజలకు ప్రతిరోజూ పిచ్చెక్కుతూనే ఉంటుంది. చరిత్ర పుటలను తిరగేస్తే, రాజ్యాలను ఏలిన పిచ్చి మారాజులు చాలామందే కనిపిస్తారు. మహా మహా చక్రవర్తులనైనా కాలం గడిచే కొద్ది ప్రజలు మరచిపోతారు గానీ, పిచ్చి మారాజులను మాత్రం అంత తేలికగా మరచిపోలేరు. ఎన్ని తరాలు గడచినా, వాళ్ల జ్ఞాపకాలు ప్రజల మనసుల్లోంచి తొలగిపోవు. మన దేశ ప్రజలు పాపం ఇప్పటికీ తుగ్లక్‌ను తలచుకుంటూ ఉండటమే ఇందుకు ఉదాహరణ.
సాధారణంగా పిచ్చివాళ్లలో పున్నమికీ అమావాస్యకూ పిచ్చి మరింతగా ప్రకోపిస్తుందనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకం. ఇంగ్లిష్‌లో ‘లునాసీ’ అనే మాట ఈ నమ్మకం నుంచే వచ్చింది. అసలు ఈ లోకమే పిచ్చిదనే నమ్మకం చాలామందిలో ప్రబలంగా ఉంది. అ నమ్మకంతోనే కాబోలు ‘ఈ పిచ్చి లోకంలో కేవలం పిచ్చివాళ్లే తెలివైనవాళ్లు’ అన్నాడు జపానీస్ దర్శకుడు అకిరా కురసావా. ఈ పిచ్చి ప్రపంచంలో తెలివి కలిగి ఉండటం కూడా ఒక్కోసారి నేరమై కూర్చుంటుంది. ‘పిచ్చి ప్రపంచంలో నా తెలివిని క్షమించండి’ అంటూ అమెరికన్ కవయిత్రి ఎమిలీ డికిన్సన్ క్షమాపణలు వేడుకుందంటే, ఈ ప్రపంచం ఎంత పిచ్చిదో అర్థమవడం లేదూ!
ఎంతటి మేధావికైనా వేపకాయంత వెర్రి ఉంటుందని చాలామంది నమ్మకం. గురివింద గింజ తన నలుపెరుగనట్లే, ఎవరి పిచ్చి వాళ్లకు తెలీదు గానీ, ఎదుటివాళ్లకు మాత్రం అది కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంటుంది. అలవిమాలిన అనురాగాన్ని, మితిమీరిన ఇష్టాన్ని కూడా పిచ్చితోనే పోలు స్తారు. ‘ప్రేమా పిచ్చీ ఒకటే’ అన్నారు ఆత్రేయ. ‘ప్రేమ ఒక తాత్కాలికమైన పిచ్చి. అది పెళ్లితో నయ మవుతుంది’ అని అమెరికన్ రచయిత ఆంబ్రోస్ బయెస్ సెలవిచ్చాడు. ‘పెళ్లి జరిగితే పిచ్చి కుదురు తుంది. పిచ్చి కుదిరితే పెళ్లి జరుగుతుంది’ అనే సామెత మనకు తెలిసినదే కదా! కొందరికి కవిత్వ మంటే పిచ్చి, ఇంకొందరికి సంగీతమంటే పిచ్చి, మరికొందరికి పేకాటంటే పిచ్చి.
చాలామందికి సినిమాలంటే పిచ్చి, ఎందరికో డబ్బు పిచ్చి, మరెందరికో పదవి పిచ్చి. యోగ్యతలకు మించిన డబ్బు, అధికారం అప్పనంగా వచ్చిపడ్డాక సాటి మనుషులను చులకనగా చూసే మదాంధత ఒక పిచ్చి. ఇక మూర్ఖుల చేతిలో అధికారం గురించి చెప్పేదేముంటుంది? అది పిచ్చోడి చేతిలోని రాయి. సమాజంలోని కొత్త కొత్త ధోరణులు మొదలైనప్పుడు చాలామంది వేలంవెర్రిగా వాటిలో పడి కొట్టుకుపోతారు.ఈ సువిశాల ప్రపంచంలో మనుషులకు రకరకాల వెర్రితనాలు మామూలే! కాలం మారే కొద్దీ కొత్త కొత్త వెర్రితనాలు వేలాదిగా వెర్రితలలు వేస్తూనే ఉంటాయి. వెర్రిలోని కొత్త పుంతలకు ఒక తాజా ఉదాహరణ: గుజరాత్‌లోని క్షమా బిందు అనే యువతి తనను తానే వేడుకగా పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లిని వ్యతిరేకిస్తూ కొందరు నోరు పారేసుకుంటున్నారు. వాళ్లది మరో వెర్రి. ఏం చేస్తాం? హైటెక్కు టమారాల కాలంలో వెర్రి వేవేల విధాలు అని సరిపెట్టుకోవడం తప్ప!
Comments
Please login to add a commentAdd a comment