ఉగ్రవాద మహమ్మారి ఎక్కడ, ఎప్పుడు విరుచుకుపడుతుందో ఎవరూ చెప్పలేరు. ఇన్నాళ్లూ నగరాల్లోని జనసమ్మర్థం వున్న ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడటం, భద్రతా దళాలపై పొంచివుండి దాడులు చేయడం వంటి పనులకు పాల్పడుతున్న ఉగ్రవాదులు తొలిసారి డ్రోన్లు ఉపయోగించి బాంబు పేలుళ్లు జరిపారు. ఆదివారం జమ్మూ విమానాశ్రయం ఆవరణలో వున్న వైమానిక దళ స్థావరంపై వారు డ్రోన్‌లతో చేసిన బాంబు దాడి తీవ్రత పెద్దగా లేకపోవచ్చు. వైమానిక దళ సిబ్బందిలో ఇద్దరికి స్వల్ప గాయాలు కావటం, ఒక భవనం పైకప్పు ధ్వంసం కావడం మినహా పెనునష్టం జరిగి వుండకపోవచ్చు. కానీ కాటేయడానికి వారు కొత్త మార్గం ఎంచుకున్నారని, మన భద్రతా బలగాలు ఇకపై ఈ బెడదను కూడా ఎదుర్కొనక తప్పదని ఈ దాడి నిరూపించింది. వైమానిక స్థావరంపై దాడి జరిగిన మరికొన్ని గంటలకు జమ్మూలోనే మరో సైనిక ప్రాంతంపై ఇలాంటి దాడికే ఉగ్రవాదులు తెగబడ్డారు. అయితే వెంటనే క్విక్ రియాక్షన్ టీం సభ్యులు అప్రమత్తం కావటంతో ఆ రెండు డ్రోన్లూ తప్పించుకున్నాయి. వాస్తవానికి వైమానిక దళ స్థావరంపై జరిగిన దాడిలో ఉగ్రవాదుల లక్ష్యం నెరవేరినట్టయితే భారీ నష్టం వాటిల్లేది. ఎందుకంటే అక్కడి హ్యాంగర్‌లో యుద్ధ విమానాలు, ఎంఐ 17 హెలికాప్టర్లు, డోన్లు ఉన్నాయి. పైగా ఆ స్థావరానికి దగ్గరలో నివాస ప్రాంతా లున్నాయి. డ్రోన్ల ద్వారా ప్రయోగించిన పేలుడు పదార్థాలు అక్కడ జారవిడిచివుంటే జన నష్టం అధికంగా వుండేది.
ఉగ్రవాదులు, ఇతర రాజ్యేతర శక్తులూ డ్రోన్ల ద్వారా దాడి చేసే ప్రమాదం వున్నదని కొంత కాలంగా నిపుణులు హెచ్చరిస్తూనే వున్నారు. తాజా దాడి వెనక ఏ సంస్థ హస్తం ఉందో, ఇందులో ఇంటి దొంగల ప్రమేయం ఏపాటో దర్యాప్తులో తేలుతుంది. సాధారణంగా సైనిక స్థావరాలు అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో వుంటాయి. చుట్టూ భారీ కుడ్యాలు, వాటిపై విద్యుత్ తీగలు, చాలా దూరం నుంచే శత్రువుల కదలికలు తెలిసేలా నిఘా వగైరాలుంటాయి. వైమానిక, హెలికాప్టర్ దాడులు జరగకుండా రాడార్ వ్యవస్థ ఉ#ంటుంది. కానీ మారిన పరిస్థితుల్లో ఇవి ఎంతమాత్రం సరిపోవని తాజా దాడి హెచ్చరించింది. గగనతలంలో ఎగిరే విమానాలనూ, హెలికాప్టర్లను పసిగట్టినంత తేలిగ్గా, తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లను ఈ రాడార్లు పోల్చుకోలేవు. దరిదాపు రూ. 20,000 వ్యయంతో లభించే డ్రోన్లు పటిష్ఠమైన భద్రత వుండే ప్రాంతాల్లోకి సైతం ఎలా చొచ్చుకురాగలవో, అవి ఏ స్థాయిలో నష్టం కలగజేయగలవో జమ్మూ దాడి తేటతెల్లం చేసింది. 20 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించే డ్రోన్లు మొదలుకొని వేలాది కిలోమీటర్ల దూరం వెళ్లగలిగే సైనిక డ్రోన్లు ఇప్పుడు లభ్యమవుతున్నాయి. ఇవి రెండురోజులు ఏకబిగిన ప్రయాణించి రాకెట్లనూ, క్షిపణులనూ కూడా మోసుకెళ్లి జారవిడవగలవని చెబుతున్నారు.
ఈమధ్యకాలంలో మారు మనసు తెచ్చుకున్నట్టు కనబడుతున్న పాకిస్తాన్ ప్రమేయం లేకుండా ఈ దాడులు జరిగి వుంటాయని భావించలేం. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్‌ఏటీఎఫ్) ఆంక్షల పరిధినుంచి తప్పించుకోవటానికో, అమెరికా ఒత్తిడి వల్లనో ఇటీవలకాలంలో అది తగ్గివున్నట్టు కనబడుతోంది. అధీన రేఖ వద్ద గతంలో మాదిరి మన సైన్యంపై, పౌర ప్రాంతాలపై అది కాల్పులు జరపడాన్ని విరమించుకుంది. సరిహద్దుల్లో చొరబాట్లు కూడా గణనీయంగా తగ్గి పోయాయి. అమెరికా ప్రమేయంతో భారత్, పాకిస్తాన్‌ల మధ్య లోపాయికారీగా జరిగిన చర్చల ఫలితంగానే ఈ మార్పు కనబడుతోందని విశ్లేషకులు అంటున్నారు. కానీ అంతమాత్రం చేత అది వెనకటి గుణం మానుకోదు. జమ్మూ–కశ్మీర్‌లో సాధారణ పరిస్థితి ఏర్పడటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్న సూచనలు కనబడటం పాక్‌కు ససేమిరా ఇష్టం లేదు. తమ ప్రమేయం లేకుండానే అక్కడ దాడులు జరుగుతున్నాయని ప్రపంచ దేశాలకు అభిప్రాయం కలిగిం చటమే దాని లక్ష్యం. ఇప్పుడు దాడికి ఉపయోగించిన డ్రోన్ల వంటివి సరిహద్దుల్లో గత రెండేళ్లుగా పాకిస్తాన్ వినియోగించటం, వాటి ద్వారా ఆయుధాలను, పేలుడు పదార్థాలనూ జారవిడవటం మన సైన్యానికి కొత్తగాదు. అయితే ప్రస్తుత దాడిలో తన ప్రమేయం లేదని చెప్పుకోవటానికి పాకిస్తాన్‌కు అన్ని రకాల అవకాశాలూ వున్నాయి. దాడి జరిగిన ప్రాంతం సరిహద్దుకు 14 కిలోమీటర్ల దూరంలోవున్నా, డ్రోన్ల కదలికలను వైమానిక దళ స్థావరం సమీప ప్రాంతంనుంచి నియంత్రించి వుండొచ్చని అంచనా. కనుక స్థానికంగా వున్నవారే దాడికి పాల్పడివుంటారని చెప్పటానికి, అమా యకత్వం నటించటానికి పాకిస్తాన్‌కు వీలుంటుంది. పాకిస్తాన్‌లో పేరుకు ప్రజా ప్రభుత్వం సాగు తున్నా వెనకుండి నడిపించేదంతా సైన్యమూ, దాని ప్రధాన అంగమైన ఇంటర్ సర్వీస్ ఇంటెలి జెన్స్(ఐఎస్‌ఐ). యెమెన్‌లో తమపై తరచు దాడులు చేస్తున్న సౌదీ అరేబియాపై కక్ష తీర్చుకునేందుకు హౌతీ తిరుగుబాటుదార్లు సౌదీలోని కీలక చమురు కేంద్రాలపైనా, చమురు సరఫరా జరిగే పైప్‌లైన్లపైనా దాడులు చేస్తున్నారు. కొన్నిసార్లు భారీ నష్టం కలగజేస్తున్నారు. ఇలాంటి పరిణామాలు మన అప్రమత్తతను మరింత పెంచాలి. మన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) రూపొందించిన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చుకోవటంతోపాటు సాధ్యమైనంత త్వరగా ఇజ్రాయెల్ సైనిక డ్రోన్లను కూడా రప్పించాలి. కొత్త సవాళ్లకు దీటైన వ్యవస్థ వేగిరం అందుబాటు లోకొస్తేనే ఉగ్రమూకల దాడులకు దీటుగా జవాబివ్వటం సాధ్యమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment