సూర్యుడు తూర్పు దిక్కుననే ఉదయించును. ఇది ఒక నిత్య సత్యం. పేద ప్రజల సాధికారతను పెత్తందార్లు అంగీకరించరు. ఇది కూడా అటువంటిదే. అనుదిన సత్యమే. నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక... ఈ సుభాషితాన్ని ‘ఈనాడు’ పత్రికవాళ్లు అప్పుడెప్పుడో బ్రాండ్ క్యాంపెయిన్‌కు వాడుకున్నట్టు గుర్తు. ఇప్పుడు పైన చెప్పిన రెండో సత్యాన్ని నిలబెట్టడం కోసం ఆ పత్రిక యాజమాన్యం ‘త్యాగాలకు’ కూడా సిద్ధమైంది. ఇంటింటికీ ఉచితంగా పత్రికను పంపిణీ చేసే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌లో ‘ఈనాడు’ శ్రీకారం చుట్టింది.
‘సత్యం నినదించు గాక’ అనే క్యాంపెయిన్‌ను ‘ఈనాడు’ చాలాకాలం కిందటే నిలిపివేసింది. చంద్రబాబు–యెల్లో కూటమి అండ్ సన్స్ ప్రయోజనాలకు అనుగుణంగా నిత్యం అసత్యాలను అచ్చొత్తడమే పనిగా పెట్టుకొన్నందున ఆ క్యాంపెయిన్‌ను కొనసాగించడానికి వాళ్లకే సిగ్గేసింది కాబోలు. ఏదో సినిమాలో మెడలో రుద్రాక్ష మాల ఉన్నంత వరకూ అల్లు అర్జున్ నాన్‌వయలంట్‌గా ఉండిపోతాడు. ఫైటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ మాలను తీసి పక్కన పెడతాడు. ఈ తీసుకోవడం, వేసుకోవడం గొడవంతా ఎందుకని ‘ఈనాడు’ వాళ్లు సత్యం నినదించుగాక అనే క్యాంపెయిన్ను శాశ్వతంగా నిద్రపుచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయం సమీపిస్తున్నకొద్దీ అసత్య కథనాల వంటకాన్ని ‘ఈనాడు’ భారీగా పెంచేసింది. పేజీకో పొయ్యి చొప్పున వెలిగించి నిత్యాగ్నిహోత్రాన్ని నిర్వహిస్తున్నది. అసత్య కథనాలతో అధికార పక్షం మీద బురద జల్లడానికే అది పరిమితం కాలేదు.మానవ నాగరికత వికాసానికి మోకాలొడ్డే సాహసం చేస్తున్నది. ప్రజాస్వామ్య పరిణతి ప్రస్థానాన్ని వెక్కిరించే విదూషక పాత్రను పోషిస్తున్నది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపాలనే తింగరి చేష్టకు తెగబడుతున్నది. కష్టజీవులు తలపెట్టిన సాధికారత యజ్ఞంపై మారీచ మాయలు ప్రయోగిస్తున్నది.
మహిళలూ – పేదవర్గాల సాధికారత అనేది ఈ దేశ రాజ్యాంగం ఇచ్చిన హామీ. ఈ హామీని అమలుపరచడంలో విఫలమైన ప్రభుత్వా ధినేతలందరూ ఈ విషయంలో దోషులే. ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ సమాన హక్కులూ, సమాన అవకాశాలూ కల్పించడం ద్వారానే క్రమంగా సాధికారత సాధ్యమవుతుంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ క్రమం నెమ్మదించింది.
ఇన్నాళ్లకు ఇప్పుడొక రాష్ట్ర ప్రభుత్వం దాని వేగాన్ని పెంచే పని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భారత రాజ్యాంగం ఆశయాల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలకు, అన్నివర్గాల మహిళలకు ఒక్కొక్కటిగా ఆర్థిక రాజకీయ సాంఘిక హోదాలను కట్టబెడుతూ వెళుతున్నారు.
ఈ అవకాశాలను ఉపయోగించుకొని సాధికారత పథంలో పరుగు తీయాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో సామాజిక సాధికార యాత్ర పేరుతో ఒక జన జాగృత కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు భుజాన వేసుకున్న మాట నిజమే. ఆ పార్టీ ప్రభుత్వమే, ఆ పార్టీ అధినేతే స్వయంగా పేదవర్గాల సాధికారతను ఒక పవిత్ర లక్ష్యంగా పరిగణిస్తున్నప్పుడు అదే పార్టీ ఈ కార్యక్రమానికి ముందు నడవడం అసహజమేమీ కాదు.
వెనుకబడిన వర్గాలను వెన్నెముక వర్గంగా మలిచే కార్యక్రమం వల్ల పాలక పార్టీ పలుకుబడి మరింత పెరుగుతుందనడం కూడా వాస్తవమే. ఈ ఒక్క కారణం చాలదా యెల్లో మీడియా కళ్లు మంటెక్కడానికి! దానికి తోడు శ్రామిక వర్గాల సాధికారతను సిద్ధాంతపరంగానే చంద్రబాబు కూటమి వ్యతిరే కిస్తున్నది.
కబుర్లు ఏవైనా చెప్పవచ్చు. ఆచరణ ఏమిటన్నదే కీలకం.వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన సాధికారతకు బాటలు వేసే ప్రతి కార్యక్రమాన్ని చంద్రబాబు పార్టీ – యెల్లో మీడియా తీవ్రంగా వ్యతిరేకించాయి. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం విద్యాబోధనను వ్యతిరేకించాయి. ఇప్పటికీ అభాసుపాలు చేయ డానికి, విఫలం చేయడానికి ప్రయ త్నిస్తున్నాయి. మహిళల పేరు మీద సొంత ఇల్లు కట్టించే కార్య క్రమాన్ని వ్యతిరేకించాయి. కోర్టు మెట్లెక్కాయి.
అమరావతి శాసన రాజధాని పరిధిలో బలహీనవర్గాల ప్రజలకు ఇళ్ల పట్టా లిస్తే ఘోరమైన, క్రూరమైన అప చారం జరిగినట్టు గావుకేకలు పెట్టాయి. బాబు గార్లు ఉండాల్సిన చోట బడుగులు నివసించడమేమిటని వాదించాయి. కుల భ్రష్టమైపోతారట, మైలపడిపోతారట! ఇదే విషయాన్ని పాలిష్ చేసి చెప్పారు. జనాభా సమ తుల్యత దెబ్బతింటుందని! కోర్టులో కూడా ఇదే వాదన చేశాయి.
పేదింటి ఆడబిడ్డల చదువు మధ్యలో ఆగిపోకుండా, బాల్య వివా హాల రుగ్మతను రూపుమాపే విధంగా పెళ్లి కానుకల కార్యక్రమాన్ని డిజైన్ చేస్తే కూడా ఈ కూటమి మండిపడింది. కారణం ఆడపిల్లల మీద అభిమానం కాదు. వారి అభివృద్ధి మీద ద్వేషం. అమ్మ ఒడి, చేయూత, ఆసరా వంటి కార్యక్రమాలను ఎద్దేవా చేశారు. ఇలాగైతే ఈ రాష్ట్రం దివాళా తీస్తుందని శాపనార్థాలు పెట్టారు. ఖర్చు చేయడానికి ప్రజల చేతిలో డబ్బులుంచాలని అభిజిత్ బెనర్జీ వంటి ఆర్థిక వేత్తలు చెప్పినా మన యెల్లో కూటమికి తలకెక్కలేదు.
జనం సొమ్ముతో సొంత వ్యాపారాలు చేసుకునే మన ‘చీ’ట్ ఫండ్ ముఠాకు అభిజిత్ ముఖర్జీలు, అమర్త్యసేన్‌లతో ఏం పని? చివరకు ఆర్థిక వేత్తలు చెప్పిందే నిజమైంది. జీఎస్‌డీపీ గ్రోత్ రేట్‌లో ఏపీ అగ్రగామిగా నిలబడింది. ఆర్థిక వ్యవస్థ పటిష్ఠమవడంతో పాటు లక్షలాది పేద కుటుంబాల ఆత్మగౌరవం పెరిగింది. ఆత్మ విశ్వాసం ఇనుమడించింది.
పేద వర్గాల ప్రజలు సాధికారతను సంతరించుకోవడానికి ఉపయోగపడే ప్రతి కార్యక్రమం మీదా చంద్రబాబు – యెల్లో ముఠా దాడులు చేస్తూనే వస్తున్నది. సాధికారత కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా మలిచి ప్రజలను చైతన్యం చేయడానికి సిద్ధమవగానే ‘ఈనాడు’ పత్రిక అన్ని విలువల్నీ వదిలేసింది. దిగంబరంగా నిలబడింది. చివరకు ఉచిత పత్రిక అవతారమెత్తింది. ‘సాక్షి’ చదివే పాఠకులందరికీ ఫ్రీగా పత్రికను పంచడం మొదలుపెట్టింది. ఇదితొలి దశ. క్రమంగా పాఠకులందరికీ పంచడానికి సిద్ధమవుతున్నది.
ఇప్పటికే ‘ఈనాడు’ పాఠకులుగా వున్నవారు వచ్చేనెల బిల్లు కట్టే పరిస్థితి లేదు. పక్కింట్లో ఫ్రీగా వేస్తున్నప్పుడు తాను మాత్రం ఎందుకు బిల్లు కట్టాలి. చివరికి ఫ్రీగా పేపర్ వేయించుకోవడానికి కూడా నెలకు రెండు ప్రియా పచ్చడి సీసాలు గిఫ్టుగా ఇవ్వాల్సిన దుఃస్థితిలోకి మన ఉచిత పత్రిక కూరుకొనిపోవచ్చు. స్వర్ణోత్సవ సంవత్సరంలోకి అడుగిడిన వేళ ఈ విషాదం దాని స్వయంకృతం.
సామాజిక సాధికారత యాత్ర మొదలవగానే ఫ్రీ పేపర్ కార్యక్రమాన్ని ఈ పత్రిక ప్రారంభించింది. ఈ కార్యక్రమం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందనేది ఒక కారణం కావచ్చు. అసలు కారణం పేదల, మహిళల సాధికారతకు యెల్లో కూటమి వ్యతి రేకమన్న విషయం గతంలో అనేక మార్లు రుజువైంది. బీసీలు జడ్జీలుగా పనికిరారని కేంద్ర న్యాయశాఖకు లేఖ రాసిన వారెవరు? చంద్రబాబు.
ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఈసడించుకున్న వారెవరు? చంద్రబాబు. దళితులు... మీకెందుకురా అధికారాలు, రాజకీయాలు... అవన్నీ మేం చూసుకుంటామని బోధించిన వారెవరు? బాబు శిష్యపరమాణువు చింతమనేని ప్రభాకర్. కోడలు మగపిల్లాడిని కంటా నంటే అత్త వద్దంటుందా అని మీడియా సమావేశంలోనే ప్రవ చించిన వారెవరు? చంద్ర బాబు. మహిళా అధికారి పట్ల వందలాదిమంది సాక్షిగా దుశ్శాసనుడిలా ప్రవర్తించింది ఎవరు? చంద్రబాబు శిష్య పరమాణువు చింతమనేని ప్రభాకర్.
బీసీల తోకలు కత్తిరి స్తానని బెదిరించిందెవరు?చంద్రబాబునాయుడు. ఎస్సీ పిల్లలు శుభ్రంగా ఉండరు, స్నానాలు చెయ్యరని తిట్టి పోసిందెవరు? చంద్రబాబు కొనుగోలు చేసిన ఆదినారా యణరెడ్డి. ముస్లిం మైనారిటీ లకూ, గిరిజనులకూ మంత్రి పదవి లేకుండా చేసిందెవరు? చంద్రబాబు నాయుడు. రాజ్యాంగబద్ధమైన గిరిజన సలహా మండలి ఏర్పాటును అటకెక్కించిందెవరు? చంద్రబాబు నాయుడు. ఈ రకమైన దుర్నీతిని ప్రశ్నించకుండా, ప్రస్తావించకుండా, ఎండ గట్ట కుండా ఆమోదముద్ర వేసిన ప్రముఖ పత్రికారాజము ఏది? మన ఉచిత పత్రిక, దాని తోకపత్రిక. ఇటువంటి ముఠా ప్రజా సాధికారతను ఏ రకంగా సహిస్తుంది?
రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో రోజూ వేలాదిమంది బహు జనులు సాధికారత కోసం నినదిస్తూ ప్రదర్శనలు చేస్తున్నారు. సభల్లో సగటున ఇరవై నుంచి పాతికవేల మంది చొప్పున మూడు ప్రాంతాల్లో ప్రజలు పాల్గొంటున్నారు. ఉష్ట్ర పక్షికి భయం వేసినప్పుడు దాని తలను ఇసుకలో దాచేస్తుందట! అప్పుడేమీ కనపడదు. భయం తగ్గిన తర్వాత మళ్లీ బయటకు తీస్తుంది. ఉచిత పత్రికకు కూడా అటువంటి భయమేదో ఉన్నట్టుంది.
బాటలు నడిచీ, పేటలు కడచీ, కోటల న్నిటినీ దాటుకుంటూ వచ్చే శ్రామిక జనాన్ని చూస్తే భయం. అందుకే సభ ప్రారంభం కాకముందూ, ముగిసిన తర్వాత ఫోటోలు తీసి అచ్చేసుకొని సంబర పడుతున్నది. ఉష్ట్రపక్షి మాదిరిగా ఉచిత పత్రిక దాని తలను ఎక్కడో దాచుకుంటే నిజం దాగుతుందా? ఎన్నో టీవీ చానెళ్లు, పత్రికలు అసలు విషయాన్ని చూపెడుతున్నాయి కదా! అయినా సరే – నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
పేదల సాధికారతపై ఉచిత పత్రిక ఉక్రోషం!
Published Sun, Nov 26 2023 12:11 AM | Last Updated on Sun, Nov 26 2023 9:50 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment