రోగ నిరోధక శక్తి, ఊపిరితిత్తుల సామర్థ్యం, శరీరంలో ఆక్సిజన్ స్థాయి, మానసిక దృఢత్వం... ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కోవిడ్–19కు గట్టి విరుగుడుగా చెబుతున్న నాలుగు మాటలు, సహజ పరిష్కారాలు ఇవే! ముందు నుంచీ ఇవి తమలో ఉన్నవారు కరోనా వైరస్‌ను ధీటుగా ఎదుర్కోగలుగుతున్నారు. వ్యాధి బారిన పడ్డాకయినా... వీటిని పెంచుకుంటే కోవిడ్ నుంచి తేలిగ్గా బయటపడగలరనీ చెబుతున్నారు.
అత్యధిక సందర్భాల్లో ఇదే రుజువైంది. కానీ, ఈ నాలుగింటినీ ఇచ్చే ఔషధాన్ని ఇంతవరకు ప్రపంచ వైద్యారోగ్య నిపుణులు, శాస్త్రవేత్తలు కనుక్కోలేదు. ఔషధ పరిశ్రమలేవీ దీన్ని ఉత్పత్తి చేయలేదు. ఈ నాలుగింటినీ ధారాళంగా అందించే ఒక ప్రక్రియ మాత్రం అయిదువేల ఏళ్ల నుంచే భారతీయులకు అందుబాటులో ఉంది. అదే ‘యోగా’! సనాతన సంప్రదాయం నుంచి, మధ్యయుగాల ఆచరణ ద్వారా, ఆధునిక శాస్త్ర–సాంకేతిక తరం వరకు... అవిచ్ఛిన్నంగా భారతీయ జీవన విధానంలో అవిభాజ్య భాగమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆరేళ్ల కిందటి ఓ కృషి ఫలితంగా ఐక్యరాజ్య సమితిలోనూ గుర్తింపు దక్కింది.
ఫలితంగా 177 సభ్య దేశాల మద్దతుతో, మనం ప్రతిపాదించిన తీర్మానం ఆమోదం పొంది, 2015 నుంచి ఏటా జూన్ 21, ‘అంతర్జాతీయ యోగ దినోత్సవం’గా జరుగుతోంది. భవిష్యత్ కార్యక్రమాల్లో యోగానొక భాగంగా యూఎన్ నిర్ణయించింది. కోవిడ్ కష్టకాలంలో యోగ ప్రాధాన్యతను అందరూ గుర్తిస్తున్నారు. ‘అందరి అభ్యున్నతికి యోగ’ ఈయేడు ప్రాధాన్యతగా యూఎన్ ప్రకటించింది. ‘ఇంటి వద్దే యోగ, కుటుంబ సభ్యులందరితో కలిసి’ అనే నినాదాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రాచుర్యంలోకి తెస్తున్నారు.
అవగాహన లేమి వల్ల చాలా మంది ‘యోగ’ను పరిమితార్థంలో చూస్తారు. ఏవో రెండు ఆసనాలో, శ్వాస కసరత్తులనో యోగగా భావిస్తారు. కానీ, స్థూలార్థంలో ఇదొక పటిష్టమైన జీవన ప్రక్రియ. ఇందులో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. ‘యోగ’ అంటే (విడిపోవడమనే ‘వియోగ’ శబ్దానికి వ్యతిరేకార్థం) కలిపి ఉంచడం. శరీరం, మేధ, మనసు... ఈ మూడింటినీ ఒకే మార్గంలోకి తెచ్చి, మనిషిలోని అంతఃశక్తుల్ని గరిష్టంగా ఉద్దీపించే ప్రక్రియే యోగ! మూలాలు పరిశోధించి, సాధన పద్ధతుల్ని క్రోడీకరించి పతంజలి మహర్షి ‘అష్టాంగయోగ’ను వేల ఏళ్ల కిందటే రూపొందించారు.
‘పతంజలి’ కూడా ఒకరు కాదని, వేర్వేరు కాలాల్లో తమ నైపుణ్యాల్ని సమాజహితంలో (క్రీ.పూ 500 నుంచి క్రీ.శ 400) ప్రదర్శించిన ఇద్దరు ముగ్గురు రుషితుల్యులని చరిత్రకారుల ఉవాచ. ‘యమ’ (నైతికాంశాలు), ‘నియమ’ (ప్రవర్తన కట్టుబాట్లు), ‘ఆసన’ (శరీర పటిష్టత), ‘ప్రాణాయామ’(శాస్వ నియంత్రణ), ‘ప్రత్యాహార’(ఇంద్రియ నిగ్రహం), ‘ధారణ’(ఏకాగ్రత), ‘ధ్యాన’(నిమగ్నత), ‘సమాధి’(అన్నీ అదుపులోకి తెచ్చిన ఉన్నతస్థితి)... వీటన్నింటినీ కలిపి అష్టాంగయోగగా చెబుతారు. మనిషి ఇవి సాధన చేసి, పరిపూర్ణ జీవితం గడపాలనేది లక్ష్యం. గౌతమ బుద్దుడి ‘అష్టాంగిక పథం’ కూడా ఇటువంటిదే!
ఆ మహనీయుల పథనిర్దేశంలోనే మనిషి జీవిత ముఖ్యసారముందని జాతిపిత మహాత్ముడు, రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరైన డా.అంబేడ్కర్‌లు గట్టిగా విశ్వసించారు. ఇప్పుడు కరోనా విజృంభిస్తున్న కాలంలోనూ.. ప్రాణాంతకమైన అనూహ్య సూక్ష్మ జీవుల నుంచీ సదరు జీవనశైలి రక్షణ కల్పిస్తోంది. శతృదుర్భేధ్యమైన ఓ కోటలా శరీరాన్ని తీర్చిదిద్దుతుందీ యోగ! ఆధ్యాత్మిక, భౌతిక, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తుంది. కలవరపాటు, మానసిక ఒత్తిళ్ల నుంచీ ఉపశమనం కలిగిస్తుంది. మనిషిని ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంచడమే కాకుండా ఆధ్యాత్మిక ప్రజ్ఞ పెంచి మానసిక దృఢత్వంతో వ్యవహరించేలా చేస్తుంది.
‘ప్రాణాయామం’ శ్వాసమీద ధ్యాస నిలిపేలా చేస్తుంది. పద్దతిగా ఉశ్ఛ్వాస–నిశ్ఛ్వాస క్రియల సాధన ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శరీరంలోని అన్ని అవయవాలకు, కణజాలాలకు ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుంది. ఈ అవసరాన్ని, ఓ గుణపాఠంగా చెప్పింది కరోనా! మెదడు, శరీరం, ఆత్మ ఒకే వరసలోకి వచ్చి ఏకీకృత శక్తిగా మారి, మనిషి తనను తాను సమగ్రంగా తెలుసుకుంటాడని విశ్లేషకులంటారు. ఫలితంగా స్వీయ అవగాహన పెరిగి, ప్రాపంచిక అంశాల పట్ల సమ్యక్ దృష్టి, తనకు తాను సమస్థితి మనిషి సాధిస్తాడనేది విశ్వాసం.
ప్రకృతిని వికృతం చేస్తున్న మానవ తప్పిదాల వల్లే పర్యావరణం పాడవుతోంది. పలు విపరిణామాలొన్నాయి. వేగంగా వస్తున్న ‘వాతావరణ మార్పు’ ప్రభావంతో మున్ముందు ఇంక చాలా వైరస్‌లు దాడి చేస్తాయనే అధ్యయనాల నేపథ్యంలో... ఎన్నో సమస్యలకు ‘యోగ’ ఒక దీర్ఘకాలిక పరిష్కారం! జబ్బులనే కాక జీవితంలో దారితప్పిన క్రమతనూ సరిదిద్దే శక్తి యోగాకు ఉంది.
‘యోగా ఒక కాంతి ప్రజ్వలనం. ఒకసారి వెలిగితే ఆరిపోయేది కాదు. ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత వెలుగు’ అన్న యోగాచార్యుడు బి.కె.ఎస్ అయ్యంగార్ మాటలు అక్షర సత్యాలు. సాధన చేస్తే, మనిషి దివాణంలో సర్వవేళలా అందుబాటులో ఉండే దివ్యౌషధం ఈ యోగా! దీనికోసం జాతి మరింత జాగృతం కావాలి. నవతరం యువత తమ జీవనశైలిలో యోగాను ఒక భాగం చేసుకోగలిగితే... శారీరకంగా, మానసికంగా తలెత్తే భవిష్యత్ సవాళ్లను వారు సమర్థంగా ఎదుర్కోగలుగుతారు. తట్టుకొని నిలువగలుగుతారు.
Comments
Please login to add a commentAdd a comment