మందులోడా... ఓరి మాయలోడా! | Sakshi Editorial On Medical Business | Sakshi
Sakshi News home page

మందులోడా... ఓరి మాయలోడా!

Published Mon, Nov 29 2021 3:05 AM | Last Updated on Mon, Nov 29 2021 8:32 AM

Sakshi Editorial On Medical Business

మనుషుల అవసరాలే వ్యాపారులకు లాభాలు తెచ్చే గనులు. మనుషులకు ఏం కావాలో ఓ కంట కనిపెట్టి వ్యాపారులు వాటిని తయారు చేసే పనిలో పడతారు. యుగాల తరబడి జరుగుతున్నది ఇదే. అసలైన వ్యాపారి ఎడారిలో ఇసుకను ఒంటెలకు అమ్మి బతికేయగలడు. తన దగ్గర ఉన్నదాన్నే ప్రజలకు అవసరం అయ్యేలా చేసే వ్యాపారులు మాయలోళ్లే! డబ్బు అవసరం ఉన్నవారికి వడ్డీకి అప్పులు ఇవ్వడం కొందరి వ్యాపారం.

డబ్బుకు ఎంతగా కటకటలాడుతున్నారో తెలుసుకొని, దానికి అనుగుణంగా వడ్డీ రేటు పెంచేస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా పెద్దపెద్ద దేశాలు కూడా అదే చేస్తాయి. చిన్న దేశాల అవసరాలను ఆసరా చేసుకొని, ఆ దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి వాటికి ఆర్థిక సాయం ముసుగులో అప్పుల ఊబిలోకి దింపేస్తాయి.ఒకప్పటి పెద్దన్న అమెరికాను కూడా భయపెడుతున్న చైనావాడు చేస్తున్నది అదే!

ఎవరికన్నా ఏ రోగమో వస్తే  దాన్ని నయం చేసే మందు తయారు చేయడం లాభసాటి వ్యాపారం. మరి మనుషులకు రోగాలే రాకపోతే ఆ వ్యాపారుల పరిస్థితి ఏంటి? అందుకోసం ఆ వ్యాపారులు ఏం చేస్తారు? అందరికీ తరచుగా రోగాలు వస్తూ ఉండాలని దేవుణ్ణి కోరుకుంటారు. ప్రపంచాన్ని శాసిస్తున్నది ఔషధ వ్యాపారమే! ఫార్మా కంపెనీలు మూడు మాత్రలు... ఆరు గోలీలన్నట్లు దూసుకుపోతున్నాయి. 

కొన్ని దశాబ్దాల క్రితం వర్షాకాలం ఆరంభంలో జ్వరం రావడమే పెద్ద రోగం. దానికి మిరియాల కషాయంతోనో, శొంఠి కషాయంతోనో వంటింటి వైద్యం చేసేసుకునేవారు. రెండేళ్ళుగా మొత్తం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది కరోనా. ఈ రెండేళ్లలో లక్షల కోట్ల రూపాయల మేరకు ఔషధ వ్యాపారం, ఆసుపత్రుల వ్యాపారం జరిగాయి. ఎప్పుడూ వినని, ఎన్నడూ కనని కరోనా రోగం ఓ వైరస్‌ వల్ల వ్యాప్తి చెందుతోంది.

అయితే ఈ వైరస్‌ దానంతట అదిగా పుట్టిందా, లేక  మనుషులే తయారు చేశారా అన్న చర్చ ప్రపంచాన్ని పట్టి కుదిపేసింది. కారణం – ఈ వైరస్‌ను చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌ నుండి ప్రపంచంపైకి వదిలిపెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, దీనికి కారణం చైనా కాదు... చైనాలోని అమెరికాకు చెందిన మాంసం ఎగుమతి కర్మాగారాలేనని మరో వర్గం ఆరోపిస్తోంది.

రెండు వర్గాలలో ఎవరు చెప్పింది నిజమైనా... ఈ రోగాన్ని ప్రపంచానికి అంటించింది మాత్రం మనుషులేనన్నది అర్థమవుతోంది. అది నిజంగానే నిజం అయితే... అంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు. ఒకప్పుడు కలరా వణికించింది. మలేరియా భయపెట్టింది. వాటికి వ్యాక్సిన్లు తయారుచేశారు. అటువంటి ఓ కొత్త వ్యాపారం కోసమే కరోనాను కనిపెట్టారా? అది నిజం కాదని అంటే మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. కానీ అదే నిజం అయితే మాత్రం చాలా చాలా భయంగానూ ఉంటుంది. భయం... ఇక్కడ రోగం వల్ల కాదు... దాన్ని మనపైకి వదిలిన దుర్మార్గుల వల్ల! కొన్నేళ్లుగా చికున్‌ గున్యా, డెంగ్యూ జ్వరాలు మన దేశంలో స్వైర విహారం చేస్తున్నాయి.

కొన్ని దశాబ్దాల క్రితం వరకు అసలీ రెండు జ్వరాల ఊసే లేదు. అప్పుడు లేని జ్వరాలు ఇప్పుడు కొత్తగా ఎలా పుట్టుకొచ్చాయి అని కొందరి ప్రశ్న. కొంపదీసి ఈ జ్వరాలను వ్యాప్తి చేసే దోమలను కూడా ఎవరో ఉత్పత్తి చేసి మానవాళిపైకి వదిలారా? జ్వరాలతో జనం వణుకుతూ ఉంటే... వాటికి మందులు అమ్మి, లాభాలు గడిస్తున్నారా? అని మరికొందరికి మాచెడ్డ అనుమానం. నిజానిజాల సంగతి తరువాత కానీ... ముందుగా అసలీ అనుమానాలు ఎందుకు వస్తున్నాయని అడిగామనుకోండి... ఔషధ వ్యాపారులతో పాటు బడా ఆసుపత్రుల భారీ ధనాశ చూస్తోంటే ఈ లోకంలో ఏదైనా సాధ్యమేనని అనిపించడం లేదా అని మనల్ని ఎదురు ప్రశ్నిస్తారు. 

కార్పొరేట్‌ ఆసుపత్రులు ఇంతగా పెరగని కాలంలో... గర్భవతులకు నూటికి నూరు శాతం సాధారణ డెలివరీలే అని ఆ తరం పెద్దవాళ్ళు చెబుతుంటారు. వైద్యవిద్య అంటే ఏమిటో కూడా తెలియని మంత్రసానులు పురుళ్లు పోసి, పండంటి బిడ్డలను కానుకగా ఇచ్చేవారు. తేడా ఎక్కడ ఉందో తెలీదు కానీ... ఆ తర్వాత అవసరం ఉన్నా లేకపోయినా సిజేరియన్‌ ఆపరేషన్లు పెరుగుతూ వచ్చాయి. ఏడు నెలల గర్భవతి కడుపు నొప్పిగా ఉందని ఆసుపత్రికి వస్తే చాలు... సిజేరియన్‌ చేయకపోతే తల్లికీ బిడ్డకీ ప్రమాదమేనని చెప్పి ఆపరేషన్లు చేసేస్తున్నారు అని కొందరి తీవ్ర ఆరోపణ.

నిజానికి, అటు రోగాల్లోనూ, మందుల్లోనూ కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. అవి అన్నీ కచ్చితంగా చెడ్డవి కావు. అలా గంపగుత్తగా ఓ ముద్ర వేసేయడం సరైనది కాదు. నయం కాని రోగాలకు కొత్త మందులు ఆవిష్కరించడం శాస్త్రీయ పరిశోధనలో కచ్చితంగా పెద్ద ముందడుగే. కాకపోతే ఆ మందుల అవసరం లేని వాళ్లతో కూడా వాటిని కొనిపించడానికి ప్రయత్నిస్తేనే... తప్పు. అలా చేసే వారే అసలు విలన్లు. 

ఏ వ్యాపారాన్నైనా క్షమించవచ్చు కానీ... విద్య, వైద్యం లాంటి విషయాల్లో మాత్రం కాదు. ఇలాంటి అక్రమాలు ఎక్కడ జరుగుతున్నా కనిపెట్టి, కళ్ళెం వేయాల్సింది పాలకులే. ‘వైద్యో నారాయణో హరిః’ అన్న నానుడి పుట్టిన దేశం మనది. ఇక్కడే వైద్యం అంటే... డబ్బు కోసం జరిగే వ్యాపారం అనిపిస్తే మాత్రం మంచిది కాదు. అందుకే, ఈ రోగాన్ని నయం చేయడమెలాగో అందరూ ఆలోచించాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు ఏదో ఒక మందు కనిపెట్టాలి! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement