అబ్‌ క్యా హోగా జీ? | Sakshi Editorial On telecommunication sector 5G technology | Sakshi
Sakshi News home page

అబ్‌ క్యా హోగా జీ?

Published Wed, Aug 3 2022 3:04 AM | Last Updated on Wed, Aug 3 2022 3:04 AM

Sakshi Editorial On telecommunication sector 5G technology

దేశ టెలికమ్యూనికేషన్‌ రంగ సాంకేతిక ప్రస్థానంలో ఇది పెద్ద ముందడుగు. దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న 5జీ సాంకేతికతను అందిపుచ్చుకొని, అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియ ఇక జోరందుకోనుంది. ఇప్పుడిక భారత్‌ సైతం అమెరికా, చైనా, దక్షిణ కొరియా, ఫిలిప్పైన్స్, కెనడా, బ్రిటన్‌ సరసన ప్రపంచ 5జీ పటంలో స్థానం సంపాదించుకోనుంది. ఆ ప్రక్రియలో ఓం ప్రథమంగా దేశంలో మునుపెన్నడూ లేనంతటి అతి పెద్ద 5జీ స్పెక్ట్రమ్‌ వేలం సోమవారం ముగిసింది. ఏడు రోజుల్లో దాదాపు 40 రౌండ్ల పాటు సాగిన వేలంలో, వివిధ బ్యాండ్ల విక్రయంతో ప్రభుత్వం ఊహించిన దాని కన్నా చాలా ఎక్కువగా రూ. 1.5 లక్షల కోట్ల పైగా ఆదాయం సమకూరడం విశేషమే. ఇక అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది ముగిసే లోగా కనీసం దేశంలోని కొన్ని నగరాల్లోనైనా మొబైల్‌ ఇంటర్నెట్‌ ఇప్పటి 4జీ సేవల కన్నా పది రెట్ల వేగం పుంజుకుంటుంది. 

మూడు రోజుల్లోనే ముగిసిపోతుందన్న అంచనాకు భిన్నంగా ఏడు రోజులు దిగ్విజయంగా వేలం సాగింది. మొత్తం 72 గిగాహెర్ట్‌›్జ మేర స్పెక్ట్రమ్‌ వేలానికి పెడితే... అందులో 51.2 గిగా హెర్ట్‌›్జ, అంటే 71 శాతం అమ్ముడైంది. దేశంలోని అన్ని సర్కిళ్ళలో వ్యాపించడానికి ఇది సరిపోతుం దని సర్కారు వారి మాట. రాగల రెండు, మూడేళ్ళలో 5జీ సేవలు విస్తరిస్తాయని అంచనా. తాజా వేలంలో రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌–ఐడియా, కొత్తదైన అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌... ఈ నాలుగు ప్రధాన సంస్థలే పాల్గొన్నాయి. అయినా, అన్ని బ్యాండ్లలోనూ గణనీయ మొత్తంలో స్పెక్ట్రమ్‌ అందుబాటులో ఉండడం, వేలంపాటదార్ల అతి దూకుడుతో ధరలు అతిగా పెరగకుండా తగినన్ని నియంత్రణలు పెట్టడంతో మొత్తం మీద ప్రక్రియ బాగానే సాగిందను కోవాలి. రిలయన్స్‌ జియో అత్యంత భారీగా రూ. 88 వేల కోట్ల పైగా వెచ్చించి, 5జీ స్పెక్ట్రమ్‌లో దాదాపు సగం చేజిక్కించుకుంది. అంతేకాక, ప్రపంచవ్యాప్తంగా 5జీ వ్యవస్థ బాగా అభివృద్ధి అయిన అతి కీలక 700 మెగాహెర్ట్‌›్జ బ్యాండ్‌ను ఇప్పుడు దక్కించుకున్న ఏకైక సంస్థ కూడా జియోనే!  

5జీకి వాడే మూడు బ్యాండ్లలోనూ స్పెక్ట్రమ్‌ కోసం సంస్థలు పోటీపడ్డాయి. మిడ్‌–ఫ్రీక్వెన్సీ ‘సి’ బ్యాండ్‌ పట్ల ఆసక్తి అధికంగా వ్యక్తమైంది. మిగిలిన బ్యాండ్ల కన్నా 700 మెగాహెర్ట్‌›్జ బ్యాండ్‌ది అధిక ధర. కాబట్టి 2016, 2021లలో స్పెక్ట్రమ్‌ వేలంపాటల్లో లానే ఈసారీ అది అమ్ముడుపోక పోవచ్చని సర్కార్‌ భావించింది. తీరా ఆ బ్యాండ్‌ అమ్ముడై, 600 మెగాహెర్ట్‌›్జ బ్యాండ్‌ అమ్ముడవకుండా మిగిలి పోయింది. వినియోగదారుల సాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కవరేజ్‌కు 700 బ్యాండ్‌ అత్యుత్తమం. 6 నుంచి 10 కిలోమీటర్ల పరిధి దాకా దాని కవరేజ్‌ ఉంటుందని ఓ లెక్క. అలా డేటా నెట్‌వర్క్‌లకూ, కస్టమర్ల సేవలకూ అది అనుకూలం. అందుకే, మొత్తం అన్ని బిడ్లలోకీ రెండో అత్యధిక మొత్తానికి (రూ. 39,720 కోట్లకు) అది అమ్ముడైంది. వెరసి, ఇతర పోటీదార్లతో పోలిస్తే, 5జీతో వినియోగదారుల్లో ముందుగా చొచ్చుకుపోవడానికి జియో చేతిలో ఇది పెద్ద అస్త్రం కానుంది.

2010 నుంచి ఇప్పటి దాకా జరిగిన 8 వేలంపాటలూ చూస్తే– ప్రభుత్వానికి ఈసారి 5జీలో వచ్చిన రూ. 1.5 లక్షల పైచిలుకు కోట్లే అత్యధిక ఆదాయం. గత ఏడాది 4జీ వేలంలో వచ్చిన రూ. 77,815 కోట్లకు ఇది రెట్టింపు. అలాగే, 2010లో 3జీ వేలంలో దక్కిన రూ. 50,968 కోట్లకు ఇది మూడు రెట్లు. నిన్నటి దాకా 2015లో వచ్చిన రూ. 1.10 లక్షల కోట్లే అత్యధికం కాగా, తాజా వేలం దాన్ని అధిగమించింది. ఇక, దాదాపు 10 కోట్ల సెల్‌ఫోన్‌ కనెక్షన్ల ఉత్తరప్రదేశ్‌ (తూర్పు) సర్కిల్‌ ఉండడంతో ఒక్క 1800 బ్యాండ్‌కే ఈసారి ఎక్కడ లేని పోటీ జరిగింది. మిగిలిన బ్యాండ్లన్నీ తమ తమ రిజర్వ్‌ ధరల్లోనే అమ్ముడవగా, ఈ ఒక్కటీ దాన్ని దాటి, 80 శాతం ఎక్కువకు అమ్ముడ వడం విశేషం. ఇక్కడా ఎయిర్‌టెల్‌ మీద జియోదే పైచేయి అయింది. ఇప్పుడు స్పెక్ట్రమ్‌ను కొన్న సంస్థలు మొత్తం 20 సమాన వాయిదాల్లో, ప్రతి ఏడాదీ ఆరంభంలోనే ముందస్తుగా ప్రభుత్వానికి చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. ఒకవేళ 5జీలో అనుకున్నంత విజయం సాధించకపోతే, ఈ సంస్థలు పదేళ్ళ తర్వాత కావాలంటే తమ స్పెక్ట్రమ్‌ను వెనక్కి అప్పగించేయవచ్చనేది వెసులుబాటే. 

నిజానికి ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ను కొట్టి, ప్రైవేటుకు పంచిపెట్టడంలో ముందున్న మన సర్కార్లు 5జీలోనూ ఆ పనే చేశాయి. అయితే, 5జీలో మనం ఇప్పటికే ఆలస్యమయ్యాం. బ్యాండ్లు కొన్న ప్రైవేట్‌ టెలికామ్‌ సంస్థలకూ ఇల్లలకగానే పండగ కాదు. గతంలో పాత టెక్నాలజీల నుంచి 3జీ, 4జీ టెక్నాలజీలకు ఎగబాకినప్పుడల్లా కస్టమర్లు వాడే డేటా పెరిగింది. కానీ, 5జీ ద్వారా ఇప్పటికిప్పుడు అలా డేటా వినియోగం పెరగకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మొత్తం చందా దార్లలో వైర్‌లెస్‌ డేటా చందాదార్లు నూటికి 70 మందికి పైనే ఉన్నారు. కాబట్టి, 5జీ తీసుకున్న సంస్థలు తమ నెట్‌వర్క్‌ను మరింత ఉన్నతీకరించుకోవడానికి కొంత వ్యవధి పడుతుంది. 

అలాగే, ప్రపంచంలో ఎక్కడా తొలి ఏళ్ళలోనే 5జీ భారీగా ఆదాయం తెచ్చిపెట్టలేదు. ఇది  కఠోర వాస్తవం. ఆ పాఠాలకు తగ్గట్టే సంస్థలు తమ ఆదాయవ్యయాలను అదుపులో పెట్టుకోవాలి. మరో సవాలేమిటంటే – అంతర్గత వినియోగ నిమిత్తం టెక్‌ సంస్థలకు నామమాత్రపు ధరకే 5జీ అందుబాటులోకి రానుంది. ఈ పోటీని టెలికామ్‌ సంస్థలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోపక్క మన దేశంలో ఎక్కువమంది ఇప్పటికీ చౌకైన ఫోన్లే వాడుతున్నారు. మరి, అందరినీ 5జీకి అనువైన కొత్త ఫోన్ల వైపు మళ్ళించడమూ సులభమేమీ కాదు. అసలు కథ ఇప్పుడే షురూ అయిందిజీ! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement