స్కూళ్లలో ఎన్నికల ప్రచారం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉభయగోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడుగడుగునా కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియామవళితో సంబంధం లేకుండా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు మొదలుకొని ప్రభుత్వ ప్రాంగణాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కూటమి అభ్యర్ధికి మద్దతుగా ఉమ్మడి పశ్చిమలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహిస్తూ అడుగడుగునా కోడ్‌ను ధిక్కరిస్తున్నా జిల్లా యంత్రాంగం దృష్టి సారించడం లేదు.
ఈ నెల 27న ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఏలూరు జిల్లాలో 62 పోలింగ్ కేంద్రాల్లో, పశ్చిమగోదావరి జిల్లాల్లో 93 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. గ్రాడ్యుయేట్ బరిలో మొత్తం స్వతంత్ర అభ్యర్థులతో కలిపి 35 మంది పోటీలో ఉన్నారు. కూటమి పార్టీ నుంచి కాకినాడ రూరల్‌కు చెందిన టీడీపీ నేత పేరాబత్తుల రాజశేఖరం పోటీ చేస్తున్నారు. దీంతో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, క్యాంపు కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహించడం, మండలాల వారీగా ముఖ్య నాయకుల ద్వారా గ్రాడ్యుయేట్ ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇంతవరకు బాగానే నడుస్తుంది. ఈ నెల 25న సాయంత్రం 5 గంటలతో ప్రచారం పర్వం ముగించాల్సి ఉంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రభుత్వ ప్రాంగణాలు, స్కూళ్లలో సమావేశాలు నిర్వహించడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కూడా కోడ్ ఉల్లంఘనే. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో కూటమి నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అధికార యంత్రాంగం నామమాత్రంగా ఫ్లెక్సీలను తొలగించి ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేస్తున్నామని ప్రకటించారు.
క్లస్టర్ సమావేశాల పేరుతో ఎన్నికల ప్రచారం
ఈ నెల 15న జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లో 116 క్లస్టర్లలో సమావేశాలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 20 మండలాల్లో 84 క్లస్టర్లలో అదే రోజు సమావేశం నిర్వహించేలా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కొక్క క్లస్టర్ పరిధిలో 8 నుంచి 20 వరకు స్కూళ్లు ఉన్నాయి. అన్ని స్కూళ్ల ఉపాధ్యాయులు క్లస్టర్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలి. కేవలం గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసమే క్లస్టర్ సమావేశాలు నిర్వహించినట్లు ఆరోపణలున్నాయి. సమావేశ ప్రధాన అజెండా కూడా వచ్చే విద్యా సంవత్సరం అకడమిక్ అంశాల మార్పులు, చేర్పులపై ఉపాధ్యాయులు చర్చించుకోవడానికి అని చెబుతున్నారు. విద్యా సంవత్సరానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఈ క్రమంలో క్లస్టర్ సమావేశాలు ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచార సభలుగా మార్చేసుకున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ధర్మరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు కై కరం, పెదనిండ్రకొలను, గణపవరం పాఠశాలల్లో సమావేశాలు నిర్వహించారు. కై కరంలో హెచ్‌ఎం అభ్యంతరం తెలపడంతో స్కూల్ బయట నిర్వహించారు. గణవపరంలో బాయ్స్ హైస్కూల్లో క్లస్టర్ సమావేశానికి హాజరై కూటమి అభ్యర్థిని గెలిపించాలని కరపత్రాలను పంపిణీ చేశారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కూడా పాఠశాలల సమయాల్లో ప్రాంగణాలకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఎన్నికల ప్రచారం చేసినట్లు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది.
అడుగడుగునా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన
ప్రచార సభలుగా స్కూల్ క్లస్టర్ సమావేశాలు
గణపవరంలో సమావేశం వద్దని అడ్డుకున్న హెచ్‌ఎం
కై కరంలోనూ స్కూల్ ప్రాంగణంలో సమావేశంపై అభ్యంతరం
స్కూళ్లలో ఎన్నికల ప్రచారం
Comments
Please login to add a commentAdd a comment