పక్కా ‘ప్లానింగ్’తో అక్రమాలు
ఏలూరు (టూటౌన్): ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ కట్టడాలపై ఆరోపణలు వెల్లువెత్తగా.. మున్సిపల్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి దాదాపు 20 రోజులు కావస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న టౌన్‌ప్లానింగ్ ఉద్యోగి ఒక ప్రజా ప్రతినిధికి నమ్మిన బంటు కావడంతో ఎలాంటి చర్యలు లేవని తెలుస్తోంది. ఆ ప్రజా ప్రతినిధి జోక్యంతోనే విచారణ ముందుకు సాగకుండా తొక్కి పెడుతున్నారే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు ఉద్యోగి నగరపాలక సంస్థ పట్టణ ప్లానింగ్ విభాగంలో అన్నీ తానై చక్రం తిప్పుతున్నాడని అదే కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది బాహాటంగా మాట్లాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా ప్రతినిధులు తమకు విధేయులుగా ఉండే ఉద్యోగులకు కొమ్ము కాస్తూ వారు ఏం చేసినా కాపాడుకుంటు వస్తున్నారనే వాదనలు బలంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ వడ్డించే వాడు మనవాడైతే కడ బంతిలో ఉన్నా అన్నీ అందుతాయనే సామెతలా ఎన్ని తప్పులు, పొరపాట్లు చేసినా కాపాడే ప్రజా ప్రతినిధులు ఉన్నప్పుడు ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకాడక తప్పదనే భావన వ్యక్తమవుతుంది.
అక్రమాలని తేల్చినా..
ఏలూరు నగర పాలక సంస్థలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న ఒక ఉద్యోగిపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. బీ–ఫాం పట్టాలు ఉన్న స్థలాల్లో కూడా పక్కా భవనాలు కట్టుకునేందుకు, ఏలూరు కోర్టు సెంటర్‌లోని దుకాణాలకు, అశోక్ నగర్‌లోని కొన్ని కట్టడాలకు, ఒకటో పట్టణ పరిధిలోని కొన్ని భవనాలకు అనుమతులు ఇవ్వడం వంటి అంశాలపై గత నెల 28న రాజమండ్రి ఆర్‌జేడీ కార్యాలయానికి చెందిన బృందం నగరంలో తనిఖీలు నిర్వహించింది. బీ–ఫాం పట్టాలు ఉన్న స్థలాల్లో కూడా పక్కా భవనాలకు అనుమతులు ఎలా ఇచ్చారని తనిఖీ బృందం ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆ ఉద్యోగిపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. అయినా సదరు ఉద్యోగి ఉన్నతాధికారుల ప్రశ్నలకు ఏ విధమైన సమాధానం ఇవ్వకుండా మౌనంగానే ఉన్నారు. తన గురువు చూసుకుంటారులే అని ధీమాగా ఉన్నట్లు సమాచారం.
రెండోసారి తనిఖీలు నిల్
గత నెల 28న తనిఖీకి వచ్చిన అధికారులు మళ్లీ వారంరోజుల్లో రెండోసారి తనిఖీలు నిర్వహించి ఆర్‌జేడీకి విచారణ రిపోర్టు అందజేస్తామని ప్రకటించారు. వారు మొదటిసారి తనిఖీకి వచ్చి దాదాపు 20 రోజులు కావస్తున్నా ఇంతవరకు రెండో సారి తనిఖీకి రాలేదు. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఉద్యోగిపై ఇంత వరకు విచారణ రిపోర్టు ఇచ్చిందనే దానిపై స్పష్టత లేదు. దీనిపై ఏలూరు నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు సైతం ఎలాంటి సమాచారం చెప్పలేని పరిస్థితి. ఆర్‌జేడీ కార్యాలయం నుంచి రెండోసారి తనిఖీలు నిర్వహించకుండా సదరు ఉద్యోగికి అండదండలు అందిస్తున్న ఆ ప్రజా ప్రతినిధి మోకాలు అడ్డుతున్నట్లు సమాచారం.
పై అధికారుల ఆదేశాలు బేఖాతరు
ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని పట్టణ ప్లానింగ్ విభాగానికి ఏసీపీ హెడ్‌గా ఉంటారు. ఆయన కింద టౌన్ ప్లానింగ్ విభాగంలోని మిగతా ఉద్యోగులు పనిచేయాలి. వీరికి పైన కార్పొరేషన్ పరిఽధిలో అసిస్టెంట్, డిప్యూటీ కమిషనర్‌లు చివరగా నగర కమిషనర్ ఉంటారు. కింది స్థాయి ఉద్యోగి అన్నీ తానై చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు ఉన్న పై అధికారుల ఆదేశాలు బేఖాతారు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఏలూరు టౌన్ ప్లానింగ్‌లో చక్రం తిప్పుతున్న చిరుద్యోగి
విచారణ చేపట్టి 20 రోజులైనా చర్యలు శూన్యం
ప్రజా ప్రతినిధి అండతో రెచ్చిపోతున్న వైనం
Comments
Please login to add a commentAdd a comment