లంచాల బాగోతంపై మీనమేషాలు
● రైతుల నుంచి అటవీ అధికారి లంచాల వసూలు
● ఫిర్యాదు చేసినా విచారణలో జాప్యం
నిడమర్రు: కొల్లేరు జిరాయితీ భూముల వ్యవహారంలో రైతుల నుంచి లంచాలు వసూలు చేసిన ఏలూరు అటవీ శాఖ రేంజ్ కార్యాలయ ఉద్యోగి శ్రీనివాస్ వ్యవహారాన్ని నీరుగార్చేందుకు ఆ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీఅడిగినంత ఇస్తేనే అక్వా సాగుశ్రీ అనే శీర్షిక ఈ నెల 14న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంపై స్పందించిన డీఎఫ్‌వో.. విచారణ అధికారిగా ఏలూరు రేంజర్ పి.మోహిని విజయలక్ష్మిని నియమించిన విషయం తెలిసిందే. ఈ నెల 15న ఆ అధికారి.. శ్రీనివాస్‌పై లంచాల ఆరోపణలు చేసిన రైతులతో మాట్లాడి ఏలూరులోని తన కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని తెలిపారు. రైతులు విచారణ నిమిత్తం ఏలూరుకు వెళ్లేందుకు నిరాకరించారు. నిడమర్రుకు వచ్చి గ్రామంలోని రైతులతో మాట్లాడితే శ్రీనివాస్ లంచాలు తీసుకున్నట్టు సాక్ష్యాధారాలు అందిస్తామని రేంజర్ మోహినీ విజయలక్ష్మికి తెలిపినట్టు బాధిత రైతులు శ్రీసాక్షిశ్రీకి వెల్లడించారు. విచారణ అధికారి సోమవారం రైతు మండా పోలయ్యకు ఫోన్ చేసి ఈరోజు విచారణ నిమిత్తం నిడమర్రు వస్తున్నట్టు తెలపడంతో రైతులంతా సాయంత్రం ఐదు గంటల వరకు నిరీక్షించారు. విచారణ నిమిత్తం ఎవ్వరూ రాకుండా ఐదు గంటల తర్వాత వాట్సప్ చేసి ఈ నెల 15న విచారణకు రైతులు ఏలూరు రావాలని సూచించారు. 15న విచారణకు రావాలంటూ 17న నోటీసు పంపించడంతో వారు అవాక్కయ్యారు. నిడమర్రులోని వెంకటాపురం జిరాయితీ భూముల్లో సాగుపై సెక్షన్ అధికారి లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలు చేస్తే, భీమడోలు మండలం చెట్టున్నపాడు గ్రామంలోని జీకేఎఫ్‌కు చెందిన 300 ఎకరాల భూముల్లో చేపల చెరువుల్లో సాగు నిమిత్తం లంచాలు ఇచ్చినందుకు విచారణకు వస్తున్నట్టు నోటీసులో ఉండటంతో కంగుతిన్నామని రైతులు చెబుతున్నారు. ఈ విషయంపై డీఎఫ్‌వో విజయను వివరణ కోరగా, విచారణ అధికారులు నిడమర్రు రైతుల వద్దకే మంగళవారం వస్తారన్నారు. సోమవారం ప్రత్యేక వర్క్‌షాప్ ఉండటం వల్ల రాలేకపోయారని చెప్పారు.
ఈ అధికారులతో న్యాయం జరగదు
15న విచారణకు హాజరవ్వాలని 17న నాకు ఏలూరు రేంజర్ మోహిని విజయలక్ష్మి వాట్సప్‌లో సమాచారం పంపడం చూస్తుంటే.. ఈ విచారణ అధికారుల వల్ల మాకు న్యాయం జరగదనిపిస్తోంది. సోమవారం ఉదయం వస్తున్నట్టు ఫోన్ చేయడంతో అందరూ పనులు మానుకుని ఎదురు చూశాం. అయినా సాయంత్రం 5.30 గంటల వరకు ఎవరూ రాలేదు.
– మండా పోలయ్య, రైతు, నిడమర్రు
లంచాల బాగోతంపై మీనమేషాలు
లంచాల బాగోతంపై మీనమేషాలు
Comments
Please login to add a commentAdd a comment