బలివే ఉత్సవాల్లో సౌకర్యాలకు ప్రాధాన్యం
బలివే(ముసునూరు) : భక్తుల సౌకర్యాలు, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, అందరి సహకారంతో బలివే మహా శివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయనున్నట్లు ఉత్సవాల ప్రత్యేకాధికారి, నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్‌రాజ్ అన్నారు. బలివే శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఉత్సవాల నోడల్ అధికారి, తహసీల్దార్ కె.రాజ్‌కుమార్ అధ్యక్షతన సోమవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించామని, పంచాయతీరాజ్, పోలీస్‌శాఖల ఆధ్వర్యంలో భక్తుల స్నానాలు, దైవ దర్శనానికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. నూజివీడు, ఏలూరు రహదారుల మరమ్మతులు తక్షణం పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. ఉత్సవ ప్రాంగణ పరిసరాల్లో మద్యం విక్రయాలు లేకుండా ఆ శాఖలను అప్రమత్తం చేశామన్నారు. అనంతరం క్యూలైన్ల కోసం నిర్మించిన బారికేడ్లను, జల్లు స్నాన ఏర్పాట్ల్లను పరిశీలించారు. కార్యక్రమంలో డీఎల్పీఓ సుందరి ,ఎంపీడీఓ జి.రాణి, ఈఓపీఆర్డీ సత్యనారాయణ పాల్గొన్నారు.
ఇంటర్ ప్రాక్టికల్స్‌కు 3,109 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ప్రయోగ పరీక్షలకు సోమవారం 3,109 మంది హాజరయ్యారు. జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు 36 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 3,208 మందికి 3,109 మంది హాజరు కాగా 99 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహించిన పరీక్షకు 1716 మందికి గాను 1,647 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పరీక్షకు 1,492 మందికి 1462 మంది హాజరయ్యారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి యోహాన్ తెలిపారు.
క్లాప్ ఆటో డ్రైవర్లను తొలగించడం అన్యాయం
ఏలూరు (టూటౌన్): క్లాప్ (చెత్త సేకరణ)ఆటో డ్రైవర్లను ఎలాంటి ముందస్తు నోటీస్ లేకుండా ఫిబ్రవరి ఒకటి నుంచి నిలుపుదల చేయడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ ఏలూరు అసెంబ్లీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు శివరావు విమర్శించారు. ఇంటింటి చెత్త సేకరణ కోసం ఏలూరులో 60 క్లాప్ ఆటోలను కేటాయించారని, ఇందులో 60 మంది డ్రైవర్లను నియమించారన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారి జీవితాలను రోడ్డున పడేసిందని విమర్శించారు. క్లాప్ ఆటో డ్రైవర్లకు ఈఎస్‌ఐ, పీఎఫ్ జమ చేయలేదన్నారు. తక్షణమే క్లాప్ ఆటో డ్రైవర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైరస్ కోళ్లు ఖననం
తాడేపల్లిగూడెం రూరల్ : బర్డ్ ఫ్లూ నేపథ్యంలో మండలంలోని పెదతాడేపల్లి పౌల్ట్రీ ఫారంలోని కోళ్లను సోమవారం వెటర్నరీ అధికారులు ఖననం చేశారు. వెటర్నరీ సిబ్బంది పీపీ కిట్లు ధరించి సుమారు 23 వేల కోళ్లను దశల వారీగా గోతుల్లో వేసి పూడ్చారు. వెటర్నరీ జేడీ మురళీకృష్ణ, డీడీ డాక్టర్ సుధాకర్, ఎంపీడీవో ఎం.విశ్వనాథ్, వెటర్నరీ ఏడీ డాక్టర్ అనిల్‌కుమార్, ఈవోపీఆర్‌డీ ఎం.వెంకటేష్, పాల్గొన్నారు.
ఇళ్ల తొలగింపును నిరసిస్తూ ధర్నా
భీమవరం : భీమవరంలోని కోర్టు పక్కన నివాసితుల ఇళ్లు తొలగించవద్దంటూ గణపతినగర్ పేదలు మున్సిపల్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకుడు బి.వాసుదేవరావు మాట్లాడుతూ పట్టణంలో బడాబాబులు ఆక్రమించిన స్థలాలు, కాల్వలను వదిలి పేదల ఇళ్లను తొలగించడం దారుణమన్నారు. గణపతినగర్‌లో చంటిపిల్లలు, వృద్ధులతో ఉంటున్న పేదల ఇళ్లు తొలగించడంతో చెట్టు కింద ఉండాల్సిన దుస్థితి కల్పించారని విమర్శించారు. మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
బలివే ఉత్సవాల్లో సౌకర్యాలకు ప్రాధాన్యం
Comments
Please login to add a commentAdd a comment