ఏలూరు (టూటౌన్): నవ వధువు బంగారం, వెండి ఆభరణాలు పట్టుకుని పరారైన ఘటన ఏలూరు నగరంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ఏలూరు గజ్జల వారి చెరువు సమీపంలో వి.శివ నాగ సాయి కృష్ణ జ్యూస్ దుకాణాన్ని నిర్వహిస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. గత నెల 31వ తేదీన అతనికి విశాఖపట్టణం కంచరపాలెం ప్రాంతానికి చెందిన బోడేపు చంద్రహాసినితో వివాహమైంది. అత్తవారింటి నుంచి ఏడు రోజుల క్రితం ఏలూరు నగరానికి చేరుకున్న కొత్తజంట కొత్త కాపురాన్ని బిట్టుబారు సమీపంలో ఉన్న అద్దె ఇంట్లో మొదలుపెట్టారు. అయితే ఈ నెల 16వ తేదీన భార్యాభర్తలు ఇద్దరు నిద్రకు ఉపక్రమించగా, 17వ తేదీన శివ నిద్రలేచి చూసేసరికి నవవధువు ఇంటి నుంచి పరారైనట్లు గుర్తించాడు. ఆమె వెళ్తూవెళ్తూ నాలుగు కాసుల బంగారు గొలుసు, ఉంగరం, వెండి పట్టీలు సెల్‌ఫోన్‌తో పరారైనట్లు శివ గుర్తించాడు. ఆమె ఆచూకీ కోసం ఆమె తండ్రితో కలిసి వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సారా స్థావరాలపై
ఎకై ్సజ్ దాడులు
కామవరపుకోట: ఈస్ట్‌యడవల్లి గ్రామంలో నిర్వహిస్తున్న నాటు సారా స్థావరాలపై మంగళవారం ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన మరీదు రాజు అనే వ్యక్తి సారా తయారుచేస్తుండగా అతడిని పట్టుకుని, బట్టి వద్ద ఉన్న 10 కేజీల బెల్లం, 200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు చింతలపూడి ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ పి.అశోక్ తెలిపారు. అలాగే సారా తయారీదారుడికి బెల్లం విక్రయిస్తున్న మహాలక్ష్మి జనరల్ స్టోర్స్‌పై తనిఖీలు నిర్వహించి 70 కేజీల బెల్లం, 50 కేజీల అమ్మోనియా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దుకాణం యజమాని భాస్కర శ్రీ సాయి రంగ ప్రకాష్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్సైలు ఆర్‌వీఎల్ నరసింహరావు, అబ్దుల్ ఖలీల్, సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామ బహిష్కరణపై ఫిర్యాదు
మండవల్లి: తనకు గ్రామ బహిష్కరణ లేకుండా రక్షణ కల్పించాలని ఓ గొర్రెల పెంపకందారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కొవ్వాడలంక గ్రామవాసి త్రిమూర్తులు గొర్రెల పెంపకందారుడు. గొర్రెల పెంపకం వలన గ్రామ వాతావరణం కాలుష్యమౌతుందంటూ గ్రామం నుంచి బహిష్కరిస్తామని సర్పంచ్‌తోపాటు స్థానిక పెద్దలు గ్రామ సభ ద్వారా హెచ్చరికలు జారీ చేశారని త్రిమూర్తులు మంగళవారం మండవల్లిలో పేర్కొన్నాడు. గ్రామసభ ఏర్పాటు చేసి, గొర్రెలను స్వాధీనం చేసుకుని కఠినమైన చర్యలు తీసుకుంటామని గ్రామ చావడి మైక్ ద్వారా తెలియజేశారన్నాడు. తనకు గ్రామ బహిష్కరణ లేకుండా రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.
అదుపుతప్పి లారీ బోల్తా
దెందులూరు: జాతీయ రహదారిపై లారీ అదుపు తప్పి బోల్తా పడింది. వివరాల ప్రకారం విజయవాడ నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న లారీ దెందులూరు మండలం కొవ్వలి వంతెన దగ్గర జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment