విలేకరిపై దాడిని నిరసిస్తూ ర్యాలీ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండల ప్రజాశక్తి విలేకరి రామారావును చంపుతానని బెదిరించిన మండల టీడీపీ అధ్యక్షుడు వేణుగోపాల్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ జర్నలిస్టు సంఘాల నాయకులు మంగళవారం ఏలూరు జిల్లా ఎస్పీ కే. ప్రతాప్ శివ కిషోర్‌కు వినతిపత్రం సమర్పించారు. దాడిని జిల్లాలోని అన్ని జర్నలిస్టు సంఘాల నాయకులు, జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహం వద్ద నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, సామ్నా ఇతర జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు హాజరై ర్యాలీ నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కేపీకే కిషోర్, ఐజేయూ కార్యవర్గ సభ్యుడు జీవీఎస్‌ఎన్ రాజు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.మాణిక్యరావు తదితరులు ఎస్పీతో మాట్లాడుతూ జర్నలిస్టులపై ఇలాంటి దాడులు బాధాకరమన్నారు. రాజకీయ నాయకుల తప్పులు ఎత్తిచూపితే విలేకరులను బెదిరించి దాడి చేస్తున్నారని, వారిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment