బలివేలో ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
ముసునూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవ క్షేత్రం బలివేలోని శ్రీరామ లింగేశ్వరాలయం. పూర్వపు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ, ప్రాచీన తూర్పు వేంగీ చాళుక్యుల రాజధాని వేంగీ పురం(నేటి పెదవేగి)కి అతి సమీపాన కృష్ణా జిల్లా, ముసునూరు మండలం బలివేలో తమ్మిలేరు ఒడ్డునే ఈ ఆలయం ఉంది. ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు మూడు రోజులపాటు ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఏటా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. స్వామివారిని దర్శించేందుకు ఏటా రెండు లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా నూజివీడు సబ్‌కలెక్టర్ స్మరణ్‌రాజ్ ప్రత్యేకాధికారిగా, తహసీల్దార్ కె.రాజ్‌కుమార్ నోడల్ అధికారిగా, సర్పంచ్ రావు ప్రవీణ సుధాకర్, ఈఓ పామర్తి సీతారామయ్య నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలో తమ్మిలేరుపై ప్రారంభమైన చెక్‌డ్యామ్ కమ్ హైలెవెల్ బ్రిడ్జి, స్నానఘట్టాల నిర్మాణం పూర్తి కావడంతో విశాల ప్రాంగణంగా రూపుదిద్దుకుని భక్తులకు ఆహ్వానం పలుకుతోంది. భక్తుల సౌకర్యార్థం జల్లు స్నానాల ఏర్పాట్లు ప్రారంభించగా, తమ్మిలేరు జలాశయం నుంచి నీటిని కూడా విడుదల చేశారు. ఇప్పటికే మిఠాయిల దుకాణాలు, వినోద సౌకర్యాలు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకోవాలని ఆలయ కమిటీ కోరింది.
బలివే చేరాలంటే బస్సురూట్లు ఇలా
రెండు జిల్లాల సరిహద్దులో ఉన్న బలే రామ లింగేశ్వర ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్న దృష్ట్యా మొత్తం నాలుగు భాగాలుగా నూజివీడు, ఏలూరు, సత్తుపల్లి ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు నడుపుతున్నారు.
● నూజివీడు నుంచి బలివే ఉత్సవ ప్రాంగణం వరకు
● ఏలూరు నుంచి వేల్పుచర్ల మీదుగా
● ఏలూరు నుంచి విజయరాయి మీదుగా
● సత్తుపల్లి, చింతలపూడిల నుంచి బలివే వరకు.
25 నుంచి 27వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు
దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఏటా ఘనంగా ఉత్సవాలు
రెండు లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా
బలివేలో ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment