మోటారుసైకిల్ అదుపు తప్పి..
ఏలూరు (టూటౌన్): మోటారుసైకిల్ అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన ఏలూరు రూరల్ మండలంలో చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భీమడోలు మండలం ఆగడాలంక గ్రామానికి చెందిన భలే బాలాజీ (34) బంటా మేస్త్రిగా పనిచేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ఇతనికి వివాహం జరిగినప్పటికీ భార్యాభర్తల మధ్య విభేధాలతో ఇరువురు వేరుగా ఉంటున్నారు. బాలాజీ తన సొంత గ్రామంలో కాకుండా తన అక్క ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో మాదేపల్లి గ్రామం నుంచి మంగళవారం అర్ధరాత్రి కోటేశ్వర దుర్గాపురం వైపు వెళుతున్న సమయంలో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి రోడ్డుపై పడ్డాడు. ఈ ఘటనలో తలపై బలమైన గాయం కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం ఉదయం అతడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్తుమార్టం నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. అనంతరం బుధవారం సాయంత్రం బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు.
వాగులో దిగబడిన స్కూల్ బస్సు
జంగారెడ్డిగూడెం: పట్టెన్నపాలెం వద్ద బుధవారం జల్లేరు వాగును దాటుతుండగా ప్రైవేట్ స్కూల్ బస్సు దిగబడిపోయింది. అదృష్టవశాత్తూ ప్రస్తుతం వాగులో నీరు లేకపోవడంతో బస్సులో ఉన్న 25 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. పట్టెన్నపాలెం గ్రామస్తులు స్పందించి ట్రాక్టర్ సహాయంతో బస్సును బయటకు తీసుకువచ్చారు. ఇక్కడ హైలెవల్ బ్రిడ్జి నిర్మించి సురక్షిత రాకపోకలకు అవకాశం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
సొమ్ముల కోసం వెళ్లి..
నూజివీడు: పట్టణంలోని విస్సన్నపేట రోడ్డులో పంజాబీ దాబా వద్ద బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో కారు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని దేవరగుంటకు చెందిన పల్నాటి రామ్మోహన్‌రావు (55) పట్టణంలోని అమ్మవారితోట ప్రాంతంలో స్థిరపడ్డాడు. వ్యవసాయం చేస్తూ కూరగాయలు పండిస్తున్నాడు. ఉదయం పంజాబీ దాబాకు సొరకాయలు దిగుమతి చేసిన రామ్మోహన్‌రావు వాటి డబ్బుల కోసం ఇంటి సమీపంలో ఉండే విబూది రాంబాబు అనే వ్యక్తితో కలిసి పంజాబీ దాబా వద్దకు వెళ్లారు. రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేసి దాబాలోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా విస్సన్నపేట వైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టి అక్కడికక్కడే కన్నుమూశాడు. ఎస్సై జ్యోతిబసు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సీఐ సత్య శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మోటారుసైకిల్ అదుపు తప్పి..
Comments
Please login to add a commentAdd a comment