విదేశాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం
జర్మనీ దేశ ప్రతినిధి బృందం
ద్వారకాతిరుమల: జర్మనీ, యూరప్ దేశాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశం తమ పర్యటన ద్వారా బలపడిందని జర్మనీ దేశ ప్రతినిధి బృందం పేర్కొంది. రైతు సాధికార సంస్థ ‘్ఙఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం’ (ఏపీసీఎన్‌ఎఫ్) ద్వారా అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను జర్మన్ ప్రతినిధి బృందం ఏలూరు జిల్లాలో బుధవారం పర్యటించింది. ఈ సందర్భంగా ‘ఫౌండేషన్ ఆన్ ఫ్యూచర్ ఫార్మింగ్ ’ తరపున బృంద సభ్యులు జాస్పర్ జోర్డాన్, బెన్నెడిక్ట్ హెర్లిన్, పోర్చుగల్‌కు చెందిన ప్రాజెక్టు ఎర్త్ ప్రతినిధి డియోగో కౌటినో, అటెలియర్ ఫుడ్ సిస్టమ్ చేంజ్ ప్రతినిధి లూకస్ కేహ్లే ద్వారకాతిరుమల మండలం గుండుగొలనుగుంటలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. అలాగే ఏటీఎం(ఎనీ టైమ్ మనీ), ఏ గ్రేడ్ మోడల్స్‌తో పాటు, పీఏండీఎస్ (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్), ఆర్‌డీఎస్ (రబీ డ్రై సోయింగ్) తదితర పంట పొలాలను సందర్శించి, సాగు విధానాలపై ఆరా తీశారు.
లెక్కల మాస్టారుపై డీఈఓ విచారణ
ద్వారకాతిరుమల: స్థానిక ఎంపీయూపీ పాఠశాలలో లెక్కల ఉపాధ్యాయుడు ఎంఎన్‌వీ ముత్యాలరావు గతేడాది నవంబర్‌లో విద్యార్థులను చితకబాదిన ఘటనపై డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ బుధవారం విచారణ జరిపారు. వివరాల్లోకి వెళితే. ద్వారకాతిరుమల ఎంపీయూపీ పాఠశాలలో ఒకటవ తరగతి చదివే గుండె త్రివిక్రమ్, నాల్గో తరగతి చదివే గుండె సహస్రలను గతేడాది నవంబర్ 25న లెక్కల ఉపాధ్యాయుడు ఎంఎన్‌వీ ముత్యాలరావు అకారణంగా చితకబాదిన ఘటనపై తల్లిదండ్రులు అప్పట్లో కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. విచారణలో విద్యార్థులను ముత్యాలరావు కొట్టాడని ఎంఈఓ నివేదికలో పేర్కొన్నా ఆయనపై డీఈఓ చర్యలు తీసుకోకుండా, బదిలీ చేయడంపై అప్పట్లో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ వెంకట లక్ష్మమ్మ, చైల్డ్‌రైట్స్ ప్రొటెక్షన్ అధికారి సూర్యచక్ర వేణి బుధవారం పాఠశాలలో విచారణ జరిపి గుండె ధర్మరాజు, మాణిక్యాలు నుంచి స్టేట్‌మెంట్‌లు రికార్డ్ చేశారు. అలాగే ఎంఈఓ–1 డి.సుబ్బారావు, ఎంఈఓ–2 పి.వెంకట్రావుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం డీఈఓ మద్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. కాగా మొదటి నుంచి ఉపాధ్యాయుడు ముత్యాలరావును కాపాడుతూ వస్తున్న డీఈఓతో విచారణ జరిపిస్తే బాదితులకు ఏం న్యాయం జరుగుతుందని పలువురు అంటున్నారు. ఇతర అధికారులతో కలెక్టర్ విచారణ జరిపించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment