ఏలూరు(మెట్రో): గులియన్ బారి సిండ్రోమ్(జీబీఎస్)పై వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం వైద్యాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జీబీఎస్, ఇమ్యునైజేషన్, మాతా శిశుమరణాల నివారణ తదితర అంశాలపై డీసీహెచ్‌ఎస్ డా.పాల్ సతీష్, డీఎంహెచ్‌ఓ డా.ఆర్.మాలిని తదితరులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జీబీఎస్‌ను ఎదుర్కోవడానికి వైద్యాధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఈ వ్యాధిపై ఎలాంటి అపోహలకు తావులేకుండా అవగాహన కలిగించాలన్నారు. అనుమానాస్పద కేసులను గుర్తించిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. జీబీఎస్ సిండ్రోమ్ వ్యాప్తి, కారణాలు నిరోధానికి తీసుకోవల్సిన చర్యలపై వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో వైద్యాధికారుల పనితీరు మరింత మెరుగుపడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వారి ఆరోగ్య నివేదికను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. మాతా శిశు మరణాల నివారణే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించే విషయాన్ని సామాజిక బాధ్యతగా భావించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment