సచివాలయ ఉద్యోగులపై పూటకో మాట
ఏలూరు(మెట్రో): పూటకో మాట.. రోజుకో నిర్ణయం.. సచివాలయ ఉద్యోగులపై కూటమి సర్కారు చేస్తున్న ప్రకటనలతో అయోమయం నెలకొంది. రేషనలైజేషన్ అంటూ ఉద్యోగుల భవితవ్యంతో ఆడుకుంటున్నారు. వారి ఉద్యోగాలను ఉంచుతుందో, తీసేస్తోందో అనే భయంతో సచివాలయ ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. సీనియర్ అధికారులను నియమిస్తామని వారి ద్వారా సర్వీసు నిబంధనలను రూపొందిస్తామంటూ కూటమి నాయకులు ప్రకటించడం మరింత గందరగోళానికి తావిస్తోంది.
బెదిరింపు ధోరణిలో సర్కారు తీరు
జిల్లావ్యాప్తంగా కూటమి సర్కారు వచ్చిన వెంటనే వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన మాటలు అటకెక్కాయి. జీతాలు పెంచడం కాదు కదా అసలు వలంటీర్ల వ్యవస్థే లేకుండా చేసేసింది. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులపై కుట్రలు పన్నేందుకు కూటమి సర్కారు సమాయాత్తమైంది. అనేక సర్వేల పేరుతో వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ కనీసం వారి భవిష్యత్తుపై భరోసా లేకుండా రోజుకో ప్రకటన విడుదల చేస్తోంది. సచివాలయాలను తొలగిస్తామని, ఉద్యోగులను ఆయా శాఖలకు పంపుతామని ఒక మంత్రి ప్రకటిస్తే, సచివాలయ ఉద్యోగులను రేషనలైజేషన్ చేస్తామని, వారిని జనాభా ఆధారంగా నియమిస్తామంటూ మరో మంత్రి ప్రకటన చేస్తున్నారు. ఇలా రేషనలైజేషన్ అంటూ ఒక వైపు, ఉద్యోగులను గ్రేడ్‌లుగా విభజిస్తామని మరో వైపు ఇలా అనేక విధాలుగా ఉద్యోగులను బెదిరించే విధంగా రోజుకో ప్రకటనను కూటమి సర్కారు విడుదల చేస్తోంది.
ఇప్పటికే వలంటీర్ వ్యవస్థ రద్దు
గ్రామస్థాయిలో ప్రజలకు సేవలు అందించేందుకు వలంటీర్, వ్యవస్థను సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తూ నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగానే 600 పైచిలుకు సేవలను గ్రామ సచివాలయాల ద్వారా గత ప్రభుత్వం ప్రజలకు అందించింది. జనన ధ్రువీకరణ పత్రం నుంచి మరణ ధ్రువీకరణ పత్రం వరకు, మహిళల సంక్షేమం, రైతు సేవలు, రేషన్‌కార్డులు, ఇలా ప్రతీ ఒక్క సేవను గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు గత ప్రభుత్వం చేరువచేసింది. ఈ వ్యవస్ధలో ప్రధానమైన వలంటీర్ వ్యవస్థను ఇప్పటికే రద్దు చేయడంతో జిల్లాలో 10 వేల మంది వలంటీర్లు ఉద్యోగాలు కోల్పోయారు. ప్రస్తుతం పొంతన లేని ప్రకటనలతో సచివాలయ ఉద్యోగులు సైతం గందరగోళానికి గురవుతూ వారి భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 517 సచివాలయాలు ఉండగా, ఈ సచివాలయాలకు 5,591 పోస్టులు మంజూరయ్యాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 4,412మంది సచివాలయ ఉద్యోగులు జిల్లాలో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. 1,179 సచివాలయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి చర్యలు తీసుకోకపోగా, ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసే ప్రకటనలు కూటమి సర్కారు చేస్తుండటంతో వారి భవిష్యత్తు దినదినగండంగా మారింది.
ఇప్పటికే సర్వేల పేరుతో ముప్పుతిప్పలు
తాజాగా ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరణ అంటూ గందరగోళం
Comments
Please login to add a commentAdd a comment