ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే నియమించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఏలూరు జిల్లా కో కన్వీనర్ తొర్లపాటి రాజు డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా బుధవారం ఏలూరు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావుకు ఏఐవైఎఫ్ నాయకులు విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర ఖాళీల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. డీఆర్‌ఓని కలిసిన వారిలో ఏఐవైఎఫ్ ఏలూరు జిల్లా నాయకులు ఏ ప్రసన్నకుమార్, ఏఐఎస్‌ఎఫ్ ఏలూరు జిల్లా కోశాధికారి కె.క్రాంతి కుమార్ పాల్గొన్నారు.
ముగిసిన ఇంటర్ ప్రయోగ పరీక్షలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా జరుగుతున్న ప్రయోగ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. పరీక్షల చివరి రోజున జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు 14 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 659 మందికి గాను 640 మంది హాజరు కాగా 19 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహించిన పరీక్షకు 317 మందికి 311 మంది హాజరు కాగా.. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకూ నిర్వహించిన పరీక్షకు 342 మందికి గాను 329 మంది హాజరయ్యారు.
ఛత్రపతి శివాజీకి నివాళులు
భీమవరం: భీమవరం పట్టణంలో మరాఠీ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ముఖ్యఅతిథిగా విచ్చేసి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడారు. శివాజీ దేశానికే ఆదర్శమైన మహారాజని, మహిళల పట్ల అతను చూపిన గౌరవం, రాజ్య పరిపాలన దక్షత సువర్ణాధ్యాయంగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో మరాఠీ సంఘం నాయకులు చంద్రశేఖర్, శ్రీవిద్య, అల్లు శ్రీనివాస్, మటపర్తి మురళీకృష్ణ, ఇళ్ల హరికృష్ణ, వనమా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు సెలవు
ఏలూరు(మెట్రో): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్ధలు పోలింగుకు ముందు రోజు, పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు రోజున అవసరాన్ని బట్టి సెలవులు ప్రకటించాలని రిటర్నింగ్ అధికారి వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీచేశారు. ఏలూరు జిల్లాలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడిన కార్యాలయాలు/సంస్థలకు పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు స్థానిక సెలవు ప్రకటించారన్నారు. ఓట్ల లెక్కింపునకు పెదపాడు మండలం, వట్లూరు గ్రామంలోని సర్ సి.ఆర్.రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, మార్చి 3న కాలేజీలో స్థానిక సెలవు గా ప్రకటిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
21లోగా ఎమ్మెల్సీ ఓటరు స్లిప్పుల పంపిణీ
ఏలూరు(మెట్రో): తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల స్లిప్పుల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 21లోగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకు 16 వేల ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారని, మిగిలిన వాటిని ఈ నెల 21లోగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
భీమవరంలోనే కలెక్టరేట్
భీమవరం: జిల్లా కేంద్రమైన భీమవరంలోనే కలెక్టరేట్ నిర్మాణం జరుగుతుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు. బుధవారం భీమవరంలో మాట్లాడుతూ కలెక్టరేట్ తరలిపోతుందనేది కేవలం అపోహమాత్రమేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment