ఏజెన్సీలో ఆదివాసీలకు అందని వైద్యం
కుక్కునూరు: ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలకు వైద్యం అందని ద్రాక్షలా తయారైందని సీపీఐ మండల కార్యదర్శి మైసాక్షి వెంకటాచారి విమర్శించారు. గురువారం కుక్కునూరు మండలంలోని బండారిగూడెం గ్రామానికి చెందిన ముచికి దేవమ్మ కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతూ రాజమ్రండి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిందని ఆయన తెలిపారు. నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన దేవమ్మను కుటుంబసభ్యులు భద్రాచలం, చింతూరు, రంపచోడవరం ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయించారన్నారు. అయినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో రాజమండ్రి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ దేవమ్మ మృతిచెందిందన్నారు. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు కూడా కుటుంబ సభ్యుల వద్ద డబ్బులు లేకపోవడంతో తానే చొరవ తీసుకోని స్వగ్రామానికి తీసుకొచ్చే ఏర్పాటు చేసినట్లు మైపాక్షి చెప్పారు. వెంకటాపురం నుంచి బండారిగూడెం గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో డోలీలో 3 కిలోమీటర్లు మృతదేహాన్ని మోసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైందని తెలిపారు. గిరిజనులు ఇటువంటి దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, ఇకనైనా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఆయిల్‌పామ్ రైతుల ధర్నా
గ్రేడింగ్ పేరుతో గెలల ఏరివేత ఆపాలని డిమాండ్
పెదవేగి : గ్రేడింగ్ పేరుతో ఆయిల్‌పామ్ గెలలు ఏరివేత ఆపాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఆయిల్ ఫెడ్ కర్మాగారం వద్ద గురువారం ఆయిల్‌పామ్ రైతులు ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయిల్ రికవరీ శాతం (ఓ.ఇ.ఆర్) పేరుతో రైతులు తెచ్చిన ఆయిల్‌పామ్ గెలలు గ్రేడింగ్ పేరుతో ఏరివేయడం అన్యాయమని విమర్శించారు. రైతులను ఇబ్బందులకు గురిచేసి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేలా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా ఉందన్నారు. అనంతరం డిప్యూటీ మేనేజర్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెదవేగి, లింగపాలెం మండలాలకు చెందిన ఆయిల్ పామ్ రైతులు బొల్లు రామకృష్ణ, మన్నె బాబూరావు, తాతినేని రమేష్, బొప్పన పూర్ణచంద్రరావు, బి.మురళీ, జాస్తి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ఆగిరిపల్లి: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. అనంతసాగరం గ్రామానికి చెందిన మెతుకుమిల్లి నవీన్ (25) మల్లవల్లిలోని స్పిన్నింగ్ మిల్లులో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన నవీన్ దుస్తులు ఆరవేసిన తీగపై ఉన్న కరెంట్ వైరుకు పొరపాటున చేయి తగలడంతో విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏజెన్సీలో ఆదివాసీలకు అందని వైద్యం
Comments
Please login to add a commentAdd a comment