పట్టిసం ఉత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు
పోలవరం రూరల్: ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు పట్టిసంలో జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇక్కడ లక్షమందికి పైగా భక్తులు ఉత్సవాలకు హాజరవుతారనే అంచనాతో అధికార యంత్రాంగం ఆ దిశగా ఏర్పాట్లు చేపట్టింది. పంచాయతీ చేపట్టే పనులు ఈ ఏడాది కొంత ఆలస్యమయ్యాయి. గత నాలుగేళ్లుగా పనులు చేపట్టిన టెండర్‌దారులకు రూ.28 లక్షల వరకు బకాయిలు ఉన్నాయని, అందువల్ల టెండర్‌దారులు ముందుకు రాలేదని సిబ్బంది చెబుతున్నారు. ఫెర్రీ టిక్కెట్ రేటును ప్రస్తుతం రూ.30 వసూలు చేస్తుండగా, ఈ ఏడాది అదనంగా మరో రూ.10 పెంచి రూ.40 వసూలు చేసేందుకు నిర్ణయించారు. భక్తులు శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కాలినడకన వెళ్లి రావాల్సిందే. పంచాయతీ చేపట్టే పనులకు సంబంధించి కొంత సొమ్ము దేవస్థానం అధికారులు ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితి ఇలా ఉంటే శివక్షేత్రం వద్ద భక్తులు దైవ దర్శనం చేసుకుని వెళ్లే విధంగా చేపట్టే ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయి. అలాగే దర్శనానికి వెళ్లే భక్తులు నది దాటి వెళ్లేందుకు వీలుగా ఫ్లాట్‌ఫారాలు, పంట్లు, టిక్కెట్ కౌంటర్‌లు, చలువ పందిళ్లు తదితర పనులు కూడా వేగంగా సాగుతున్నాయి.
ఇంకా చేపట్టాల్సిన పనులు
ఇసుక తిన్నెలపై చేపట్టే ఇంకా కొన్ని పనులు ప్రారంభమే కాలేదు. స్నానఘట్టాలతో పాటు, మహిళలు దుస్తులు మార్చుకునే తాత్కాలిక ఏర్పాట్లు, మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. వెదురు కర్రలు, తడికలతో వీటిని ఏర్పాటు చేస్తారు. తాగునీటికి పైప్‌లైన్, చేతిపంపు నిర్మించాల్సి ఉంది.
ఏర్పాట్లు పరిశీలించిన సీఐ
పట్టిసం రేవులో జరుగుతున్న ఉత్సవ ఏర్పాట్లను పోలవరం సీఐ సురేష్‌బాబు, ఎస్సై పవన్‌కుమార్ పరిశీలించారు. క్యూలైన్‌లు, కంపార్ట్‌మెంట్‌లు తదితర పనులను పరిశీలించి ఫెర్రీ కాంట్రాక్టర్‌కు సూచనలు చేశారు. రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చేపట్టాల్సిన పనులను పరిశీలించారు. ఉత్సవాల సమయంలో పోలీసుల అనుమతి లేకుండా పట్టిసీమ, గూటాల, పోలవరం తదితర ప్రాంతాల్లో ప్రయాణికులతో పడవలను నడపరాదని హెచ్చరించారు.
పట్టిసం ఉత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment