బియ్యం లారీ చోరీ చేసిన ముగ్గురి అరెస్ట్
వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రావణ్ కుమార్
ఏలూరు టౌన్: బియ్యం లారీ చోరీ చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో గురువారం డీఎస్పీ డీ.శ్రవణ్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఏలూరు కండ్రికగూడెం సమీపంలోని ఎఫ్‌సీఐ గోడౌన్ వద్ద 290 బస్తాల బియ్యంతో ఉన్న లారీని గత నెల 29వ తేదీన గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. లారీకి ఉన్న జీపీఎస్ ట్రాకర్‌ను పడేసి ఈ చోరీ చేశారు. బియ్యం విలువ సుమారు రూ.8 లక్షలు ఉంటుంది. దీనిపై లారీ యజమాని ఫిర్యాదు చేయగా ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాధునిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల సహాయంతో కేసును పోలీసులు విచారణ చేశారు. గురువారం ఏలూరు రూరల్ పరిధిలో లారీలో ఉన్న బియ్యాన్ని విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో వన్‌టౌన్ సీఐ జీ.సత్యనారాయణ, రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ బియ్యంతో సహా లారీని, నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు కొత్తూరు గ్రామానికి చెందిన జన్యవుల సుధాకర్‌గా గుర్తించగా పెరవలికి చెందిన దూడల ధనరాజు, కొల్లేపుర మణికంఠ అతడికి సహకరించినట్లు డీఎస్పీ తెలిపారు. సుధాకర్‌పై రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులు పదుల సంఖ్యలో ఉన్నాయని, షీట్ తెరిచేందుకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేసినట్లు చెప్పారు. ఈ కేసును ఛేదించిన సీసీఎస్ పోలీసులు, ఏలూరు వన్‌టౌన్ పోలీసులను అభినందించారు. సమావేశంలో ఏలూరు వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ, రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్, సీసీఎస్ ఏఎస్సై ఎండి రుహుల్ల, శేషు కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment