ఆకతాయిల వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య
కామవరపుకోట: ఆకతాయిల వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం కామవరపుకోట పంచాయతీ వడ్లపల్లిలో చోటుచేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వడ్లపల్లి గ్రామానికి చెందిన గంజి నాగ దీప్తి (19) ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. గత కొంతకాలంగా నాగ దీప్తి కాలేజీకి వచ్చి, వెళ్లే సమయాల్లో కామవరపుకోటకు చెందిన ఆకతాయిలు ఆమెను ప్రేమించాలని, లేకపోతే మీ కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించేవారు. ఈ విషయంపై ఆమె అన్నయ్య అరవింద్ ఆ యువకులను నిలదీశాడు. దీంతో ఇటీవల కామవరపుకోటలో జరిగిన వీరభద్రస్వామి తిరునాళ్లలో అరవింద్‌ను తీవ్రంగా కొట్టినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. బుధవారం మళ్లీ ఆ యువకులు నాగ దీప్తికి ఫోన్ చేసి తమను ప్రేమించకపోతే మీ అన్నయ్యతో సహా మీ కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించారు. దీంతో మనస్థాపానికి గురైన నాగదీప్తి గురువారం ఇంట్లో ఫ్యాన్‌కు ఊరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆసమయంలో తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, రాణి వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వెళ్లగా అన్నయ్య అరవింద్ గదిలో నిద్రపోతున్నాడు. నాగ దీప్తి ఫ్యానుకు వేలాడుతూ ఉండడాన్ని గమనించిన అరవింద్ చుట్టుపక్కల బంధువుల సహాయంతో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నా కుమార్తె మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆమె కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటనపై తడికలపూడి ఎస్సై చెన్నారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment