పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి

Published Sat, Feb 22 2025 2:20 AM | Last Updated on Sat, Feb 22 2025 2:20 AM

పన్ను

పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి

ఏలూరు (టూటౌన్‌): నగరపాలక సంస్థ, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో నూరు శాతం పన్ను వసూలు చేయాలని పురపాలక శాఖ రాజమండ్రి రీజనల్‌ డైరెక్టర్‌–కం–అప్పిలేట్‌ కమిషనర్‌ నాగ నరసింహారావు ఆదేశించారు. స్థానిక గోకుల్‌ కల్యాణ మండపంలో శుక్రవారం రెవెన్యూ వసూ ళ్లు, 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ నిధుల వినియోగం, గుంతలు లేని రోడ్లు తదితర అంశాలపై సమీక్షించారు. ప్రస్తుత ఆర్థ్ధిక సంవత్సరంలో ఆస్తి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోడ్లకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించాలని, పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని, దోమల నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఏలూరు కమిషనర్‌ ఎ.భానుప్రతాప్‌, అడిషనల్‌ కమిషనర్‌ జి.చంద్రయ్య, మున్సిపల్‌ కమిషనర్లు టి.పావని, కె.వెంకటరమణ, వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.

కొనసాగిన టీసీసీ పరీక్షలు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు (టీసీసీ) పరీక్షలు గురువారం కొనసాగాయి. ఏలూరులో జరిగిన డ్రాయింగ్‌ లోయర్‌ పరీక్షకు 21 మందికి ఐదుగురు, హయ్యర్‌ పరీక్షకు 9 మందికి ఐదుగురు హాజరయ్యారని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.

టీచర్ల సమస్యలు పరిష్కరించాలి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ విజయ రామరాజుకు శుక్రవారం వినతిపత్రం సమర్పించినట్టు వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్‌ ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలు, జీఓ 117 ప్రత్యామ్నాయ చట్టంపై చర్చించామని పేర్కొన్నారు.

లైఫ్‌ సర్టిఫికెట్లు సమర్పించాలి

ఏలూరు(మెట్రో): జిల్లాలోని సర్వీస్‌ పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు లైఫ్‌ సర్టిఫికెట్‌ను ఈనెల 28లోపు సమర్పించాలని జిల్లా ఖజానా, లెక్కల శాఖ అధికారి టి.కృష్ణ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఏదైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత ఖజానా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

వీధి కుక్కలకు శస్త్రచికిత్సలు

ఏలూరు(మెట్రో): జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కలకు యాంటీ రాబిస్‌ వ్యాక్సిన్‌, బర్త్‌ కంట్రోల్‌ శస్త్రచికిత్సలను ఏప్రిల్‌ నెలాఖరుకు పూర్తిచేయాలని కలెక్టర్‌ కె. వెట్రిసెల్వి మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కమిషనర్లతో ఆమె సమీక్షించారు. నాలుగు మున్సిపాలిటీల్లో సుమారు 2,400 వీధి కుక్కలను గుర్తించగా వాటిలో 45 రోజుల్లో 590 కుక్కులకు యాంటీరాబీస్‌ వ్యాక్సిన్‌, బర్త్‌ కంట్రోల్‌ శస్త్రచికిత్సలు చేశారన్నారు. తాగునీరు, కుళాయిల మంజూరు అంశాలపై కలెక్టర్‌ సమీక్షించారు. అన్న క్యాంటీన్ల వద్ద పారిశుద్ధ్యం, క్యాంటీన్ల నిర్వహణ, భోజన నాణ్యతపై తనిఖీలు చేయాలన్నారు. పట్టణాల్లో పారిశుద్ధ్య పనులపై సూచనలిచ్చారు.

ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని కూచింపూడిలో 23, 24 తేదీల్లో జరిగే గంగానమ్మ జాతరకు ఏలూరు నుంచి రెండు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటుచేస్తున్నట్టు ఏలూరు ఆర్టీసీ డిపో మేనేజర్‌ బి.వాణి ప్రకటనలో తెలిపారు. అలాగే 25న మధ్యాహ్నం నుంచి 27న మధ్యాహ్నం వరకు బలివేకు మహాశివరాత్రి సర్వీసులు నడుపుతామన్నారు. 26న ఉదయం తాడేపల్లిగూడెం మండలం వీరంపాలేనికి ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేస్తామన్నారు. శ్రీశైలం క్షేత్రానికి రోజూ రాత్రి 9 గంటలకి ప్రత్యేక బస్సును నడుపనున్నామని చెప్పారు.

శ్రీశైలంకు ప్రత్యేక బస్సులు

భీమవరం(ప్రకాశం చౌక్‌): మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 24, 25 తేదీల్లో భీమవరం బస్టాండ్‌ నుంచి శ్రీశైలం క్షేత్రానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు డిపో మేనేజర్‌ పీఎన్‌వీఎం సత్యనారాయణమూర్తి తెలిపారు. ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ ఉందని, టికెట్‌ ధర పెద్దలకు రూ.730, పిల్లలకు రూ.370 అన్నారు. వివరాలకు సెల్‌ 7382924754, 08816 239100 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి 1
1/1

పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement