సత్య సాయి తాగునీరు పునరుద్ధరణ
కొయ్యలగూడెం: సత్యసాయి తాగునీటి సరఫరా పునరుద్ధరణకు నోచుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి పత్రికలో ఫిబ్రవరి 28న ‘నిలిచిన సత్యసాయి తాగునీరు’ శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో పాటు, సత్యసాయి తాగునీటి సరఫరా సిబ్బంది నాలుగు రోజులపాటు శ్రమించి పైపులైను మరమ్మతులు పూర్తిచేసి సరఫరా పునరుద్ధరించారు. దీంతో పోలవరం, చింతలపూడి నియోజకవర్గాలలోని పలు మండలాలకు తాగునీరు పూర్తిస్థాయిలో అందనుంది.
ఎన్నికల సిబ్బందికి అభినందనలు
ఏలూరు(మెట్రో): తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పట్టభధ్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా పూర్తిచేశామని దీనికి సహకరించిన అందరికి అభినందనలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేయడంలో అధికారులు, సిబ్బంది అందరూ టీం స్పిరిట్‌తో అద్భుతంగా పనిచేశారన్నారు. ఈ ఎన్నికల నిర్వహణలో ఓటర్ల జాబితా మొదలుకొని కౌంటింగ్ ముగిసే వరకు సంబంధిత అధికారులందరి సమష్టి కృషితోనే ఎన్నికల ప్రక్రియ విజయవంతమైందన్నారు. ఈ సందర్భంగా పోలీసు యంత్రాంగానికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
త్రీడి బయో ప్రింటింగ్ అద్భుతం
తాడేపల్లిగూడెం: శరీరంలో ఏ అవయవం దెబ్బతింటే ఆ అవయవాన్ని ప్రయోగశాలలో కృత్రిమంగా తయారుచేయడానికి త్రీడి బయో ప్రింటింగ్ ఉపయోగపడుతుందని, ఇది ఓ అద్భుతం మంగళవారం నిట్‌లో జరిగిన కార్యక్రమంలో ఐఐటీ బయో ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ అశోక్‌కుమార్ అన్నారు. వైద్య రంగంలో త్రీడి బయో ప్రింటింగ్ ఓ సంచలనంగా మారనుందన్నారు. ఆన్‌లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిట్ రిజిస్ట్రార్ దినేష్ శంకర్‌రెడ్డి మాట్లాడుతూ త్రీడి ప్రింటింగ్ టెక్నాలజీ భవిష్యత్‌లో నూతన అధ్యాయానికి నాంది పలకనుందన్నారు.
ఇచ్చిన హామీలు అమలు చేయాలి
ఏలూరు (టూటౌన్): భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భవన నిర్మాణ కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఐఎఫ్‌టీయు రాష్ట్ర సహాయ కార్యదర్శి కెవీ రమణ, ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యుడు కాకర్ల శ్రీనివాసు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు అనేక రకాల హామీలు ఇచ్చి గద్దెనెక్కిందన్నారు. తక్షణం కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ బోర్డును పునఃనిర్మించాలని, కార్మికులకు ఆ సంక్షేమ బోర్డు నుంచి పథకాలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్‌కు వినతిపత్రం ఇచ్చారు.
సత్య సాయి తాగునీరు పునరుద్ధరణ
సత్య సాయి తాగునీరు పునరుద్ధరణ
Comments
Please login to add a commentAdd a comment