సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉభయగోదావరి జిల్లాల్లో పట్టభద్రులు తడబడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 19,789 మంది చెల్లని ఓట్లు వేశారు. వీటిలో 42 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా ఉండటం గమనార్హం. ప్రతి రౌండ్‌లో సగటున 2,400పైగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఓటుపై అధికారులు అనేక అవగాహన సదస్సులు నిర్వహించారు. అభ్యర్థులు ప్రచారంలో కూడా ఓటు ఎలా వేయాలనేది గ్రాడ్యుయేట్లకు వివరించారు. అయినప్పటికీ వేల సంఖ్యలో చెల్లని ఓట్లు నమోదయ్యాయి. మొదటి రౌండ్‌లో 2,416, 2వ రౌండ్‌లో 2607, 3వ రౌండ్‌లో 2632, 4వ రౌండ్‌లో 2109, 5వ రౌండ్‌లో 2329, 6వ రౌండ్‌లో 2725, 7వ రౌండ్‌లో 2760, 8వ రౌండ్‌లో 2211 మొత్తం కలుపుకుని 19,789 చెల్లని ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల విధుల్లో సుమారు 2,700 మంది సిబ్బంది పాల్గొనగా కేవలం 243 మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. వీటిలో కూడా 42 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. బ్యాలెట్ పేపర్‌లో ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాలి. మొదటి ప్రాధాన్యత ఓటు అభ్యర్ధి పేరు ఎదురు ఉన్న గడిలో 1వ నెంబర్, ప్రాధాన్యతను బట్టి 2, 3, 4 నెంబర్లు ఇతర అభ్యర్థులకు వేయవచ్చు. ఒకే అంకెను ఇద్దరికి వేసినా, 1 వేయకుండా 2, 3, 4 వేసినా నెంబర్లు కాకుండా రోమన్ నెంబర్లు వేసినా, అక్షరాలు రాసినా ఓటు చెల్లదు. ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు ఓటు వేయాలనుకున్న అభ్యర్థు పేరు వద్ద టిక్ పెట్టడం, రౌండ్ చుట్టడం, వారి సొంత పెన్నులు వినియోగించడం వంటి కారణాలతో వేల సంఖ్యలో ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. మొదటి మూడు స్థానాల్లో ఉన్న వారిని మినహాయిస్తే.. మిగిలిన 32 మందికి కలిపి 11,082 ఓట్లు పోలయ్యాయి. వారందరి ఓట్ల కంటే చెల్లని ఓట్లే అధికంగా ఉండటం విశేషం.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో 19,789 చెల్లని ఓట్లు
పోలైన ఓట్లలో 9 శాతం చెల్లనివే
Comments
Please login to add a commentAdd a comment