
కల్యాణ ముహూర్తాలు ప్రారంభం
కొయ్యలగూడెం: పెళ్లికళ వచ్చేసిందే బాలా అంటూ వధూవరులు బంధుమిత్రులు వేడుకలు చేసుకునే సమయం వచ్చేసింది. ఏప్రిల్‌లో శుభలగ్నాలతో కూడిన తొమ్మిది పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. విశ్వావసు నామ సంవత్సర చైత్ర మాసం ప్రారంభమైన నేపథ్యంలో ఒకటో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు మూఢం ఉందని చెబుతున్నారు. అనంతరం 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30 తేదీలు ముహూర్తాలకు శుభప్రదమైనవి. ఈ నేపథ్యంలో కల్యాణ మండపాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. కొన్ని ఆలయాల వద్ద నిర్మించిన కల్యాణ మండపాలలో ఏప్రిల్ ఆరు నుంచి శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం, అనంతరం ఉత్సవాలు కూడా నిర్వహించనున్నారు. పురోహితులు అడ్వాన్స్ బుకింగ్ అవ్వగా, ఈవెంట్ బుకింగ్ మేనేజర్లు కల్యాణ ఏర్పాట్లకు సంబంధించి తల మునకలై ఉన్నారు. టిప్ టాప్ మొదలుకుని భాజా భజంత్రీలు.. కళ్యాణానికి సంబంధించిన వారు అందరూ తమ షెడ్యూల్ రూపొందించుకుంటున్నారు. సంవత్సరంలో ఒకే నెలలో ఇన్ని ముహూర్తాలు రావడం ఇదే మొదటిదని పండితులు అంటున్నారు.