
వక్ఫ్ సవరణకు వ్యతిరేకంగా ఓటేయాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా చేపట్టనున్న వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సోమవారం ఏలూరు తంగెళ్ళమూడి వంతెన వద్ద ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి జాతీయ జెండా చేపట్టి నిరసన కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఈదుల్ ఫితర్ పండుగ నమాజ్ అనంతరం మసీదుల నుంచి ర్యాలీగా బయలుదేరి వంతెన వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు ఎండీ ఇస్మాయిల్ షరీఫ్, ఎండీ ఇలియాజ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకుంటుందన్నారు. ముస్లింల వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు స్థానం కల్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వారి బోర్డుల్లో ముస్లింలకు కూడా స్థానం కల్పిస్తారా అని నిలదీశారు. ఎవరికి కేటాయించిన సంస్థల్లో వారు ఉంటే ఆ సంస్థలకు, దేశానికి కూడా మేలు జరుగుతుందన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం చేయించి కేంద్రానికి పంపాలన్నారు. కూటమి ఎంపీలతో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కూటమిలో ఉన్న పార్టీలు ముస్లిం సమాజానికి ద్రోహం చేశారని భావించి భవిష్యత్తులో తగిన బుద్ధి కలిగేలా చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ నాయకుడు ఎండీ ముజాహిద్, అహలెసున్నత్‌వల్ జమాత్ నాయకుడు ఎస్‌కే పాషా, అంజుమన్ ముహాఫిజుల్ ఇస్లాం ప్రతినిధులు, ముస్లింలు పాల్గొన్నారు.