చిల్లరతో పనేముంది! | - | Sakshi
Sakshi News home page

చిల్లరతో పనేముంది!

Published Mon, Apr 14 2025 12:56 AM | Last Updated on Mon, Apr 14 2025 1:19 AM

చిల్ల

చిల్లరతో పనేముంది!

కరోనా భయంతో..

కరోనా వైరస్‌ సమయంలో ఇతరులను తాకాలన్నా, వారి వస్తువులు ముట్టుకోవాలన్నా భయపడేవారు. ఈ క్రమంలో కరెన్సీ నోట్లు తీసుకుంటే కోవిడ్‌ సోకుతుందేమోనని ఆందోళన చెందేవారు. బ్యాంకులకు వెళ్లే పరిస్థితి కూడా లేకపోవడంతో, నగదు రహిత లావాదేవీలు జోరందుకున్నాయి. 2020–2021 లో మొదలైన ఈ డిజిటల్‌ లావాదేవీలు గత మూడేళ్లలో గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే వంటి యాప్‌ల వినియోగం పెరగడంతో ఆన్‌లైన్‌ లావాదేవీలు విస్తృతం అవుతున్నాయి. నగదు రహిత లావాదేవీల్లో 60 నుంచి 70 శాతం మైలు రాయిని అధిగమించాలని కొద్దినెలల క్రితం విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో ఆర్‌బీఐ ఉన్నతాధికారులు సూచించారు. దీనికి అనుగుణంగా జిల్లాలో ప్రభుత్వ, పైవేటు రంగ బ్యాంకులు నగదు రహిత లావాదేవీల్లో పోటీ పడుతున్నాయి.

ద్వారకాతిరుమల: ఒకప్పుడు పెద్ద కరెన్సీ నోటు పట్టుకుని ఏ షాపుకు వెళ్లినా చిల్లర కష్టాలు తప్పేవికావు. ఏ వ్యాపారి నోట విన్నా చిల్లర పట్టుకు రండి.. మా దగ్గర చిల్లర లేదు అన్న మాటే వినిపించేది. ఆ సమయంలో వినియోగదారులు వ్యాపారులను చిల్లర కోసం బతిమిలాడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. డిజిటల్‌ నగదు చెల్లింపులు వచ్చిన తరువాత చిల్లరకు కష్టాలు తప్పాయి. ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం ఇతర యూపీఐల ద్వారా నగదు చెల్లింపులు పెరగడమే ఇందుకు కారణం.

బ్యాంకుల్లో పేరుకుంటున్న చిల్లర

ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ హుండీల ద్వారా నెలకు రూ.10 లక్షల చిల్లర వస్తోంది. అందంతా స్థానిక యూనియన్‌ బ్యాంకుకు చేరుతోంది. ఇక్కడి నుంచి ఆ చిల్లర తాడేపల్లిగూడెంలోని సంబంధిత కార్యాలయానికి వెళ్తుంది. ప్రస్తుతం స్థానిక యూనియన్‌ బ్యాంకులో సుమారు రూ. 35 లక్షల వరకు చిల్లర ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఒకప్పుడు జిల్లాలోని వ్యాపారులు శ్రీవారి హుండీలు ఎప్పుడు తెరుస్తారో, చిల్లర ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూసేవారు. వాటి కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాసేవారు. ఇప్పుడా పరిస్థితులు లేవు.

చిన్న దుకాణాల్లోనూ స్కానర్లు..

నోటు చిరిగిందనే బాధ లేదు. వ్యాపారి నుంచి చిల్లర వస్తుందో.. లేదో అనే బెంగ లేదు. డబ్బు లెక్కపెట్టాల్సిన పని అంతకంటే లేదు. హైపర్‌ మార్కెట్‌ అయినా, డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌ అయినా, హోటల్‌ అయినా, కూరగాయల దుకాణాలైనా, ఫ్రూట్‌ జ్యూస్‌ షాపు అయినా, రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై అమ్మే కొబ్బరి బొండాలైనా, మొక్కజొన్న పొత్తులైనా, పెట్రోల్‌ బంకుల్లో అయినా, టీ కొట్టులో అయినా ఇలా ఏ దుకాణంలో అయినా అక్కడ క్యూఆర్‌ కోడ్‌ స్కానర్లు దర్శనమిస్తున్నాయి. వాటి ద్వారానే నగదు చెల్లింపులు జరుగుతున్నాయి. రూపాయి పెట్టి కొనే అగ్గిపెట్టె నుంచి రూ.లక్ష విలువ చేసే బంగారం వరకు నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి.

ఆర్‌బీఐ ప్రోత్సాహంతో..

అన్ని బ్యాంకుల్లోనూ నూరు శాతం నగదు రహిత లావాదేవీలు జరిగేలా రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా దాదాపు అన్ని వాణిజ్య, సహకార బ్యాంకులు సైతం ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాయి. ఆన్‌లైన్‌ లావాదేవీల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు పోటీ పడుతున్నాయి. ఒకప్పుడు రూ.100 కావాలంటే పనులన్నీ పక్కనబెట్టి, బ్యాంకుల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితులు లేవు. గడప దాటకుండానే నగదు రహిత లావాదేవీలు చేసుకునే అవకాశం రావడంతో ప్రజల అవసరాలు క్షణాల్లో తీరిపోతున్నాయి. సమయం ఆదాతో పాటు, జేబులో సొమ్ము పోతుందనే భయం లేకపోవడంతో వినియోగదారులు ఆన్‌లైన్‌ చెల్లింపులకు అలవాటు పడుతున్నారు.

విస్తృతమైన డిజిటల్‌ నగదు చెల్లింపులు

చిన్న చిన్న దుకాణాల్లోనూ యూపీఐ లావాదేవీలు

శ్రీవారి హుండీ ద్వారా నెలకు రూ.10 లక్షల చిల్లర

బ్యాంకుల్లో పేరుకుంటున్న చిల్లర

చిల్లర కష్టాలు తప్పాయి

యుపీఐ పేమెంట్లు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి క్షేత్రానికి వచ్చే భక్తుల్లో 90 శాతం ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వినియోగిస్తున్నారు. దాంతో చిల్లర కష్టాలు తప్పాయి. గతంలో బ్యాంకు నుంచి తెచ్చి వినియోగదారులకు చిల్లర ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితులు లేవు.

– దేశెట్టి రాంబాబు, కూల్‌డ్రింక్‌ షాపు వ్యాపారి, ద్వారకాతిరుమల

నగదు రహిత లావాదేవీలే బెస్ట్‌

కూరగాయలు కొంటున్న వారిలో ఎక్కువ మంది యూపీఐనే వాడుతున్నారు. చిల్లరతో పని లేకపోవడంతో అదే బెస్ట్‌ అనిపిస్తోంది. షాపునకు వచ్చే పది మందిలో, ఎనిమిది మంది నగదు రహిత లావాదేవీలనే జరుపుతున్నారు. మహిళలు సైతం యూపీఐని వినియోగిస్తున్నారు.

కళ్లేపల్లి అభిరామ్‌, కూరగాయల వ్యాపారి, ద్వారకాతిరుమల

చిల్లరతో పనేముంది! 1
1/2

చిల్లరతో పనేముంది!

చిల్లరతో పనేముంది! 2
2/2

చిల్లరతో పనేముంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement