
ఏలూరు ఇందిరమ్మకాలనీ వద్ద అస్థిపంజరం
విచారణ చేస్తున్న ఏలూరు రూరల్ పోలీసులు
ఏలూరు టౌన్: ఏలూరు నగరంలోని ఇందిరమ్మకాలనీ పంటకాలువ సమీపంలో ఒక వ్యక్తి మృతదేహం అస్థిపంజరంను స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఏలూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఏలూరు రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు మృతుడు వేమూరి సత్యనారాయణ (65)గా గుర్తించారు. కొత్తూరు ఇందిరమ్మ కాలనీలో సత్యనారాయణ ఒంటరిగా ఉంటున్నాడని, అతని భార్య విజయవాడలోని కుమారుడి వద్ద ఉంటుందని చెబుతున్నారు. మద్యానికి బానిసై పంటకాలువ వద్ద పడి మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతిచెంది సుమారు నెలరోజులు అయి ఉండవచ్చిని పోలీసులు అంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జాతీయ వెయిట్ లిఫ్టింగ్‌లో కీర్తనకు రజతం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో నగరంలోని ఏఆర్‌డీజీకే పాఠశాల విద్యార్థిని చుక్క కీర్తన రజత పతకం సాధించింది. ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకూ మణిపూర్ రాష్ట్రం ఇంఫాల్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కీర్తన 59 కేజీల విభాగంలో స్నాచ్‌లో 67 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 87 కిలోలు కలిపి మొత్తం 154 కిలోలు ఎత్తి రజత పతకం సాధించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డీ. షారోన్ తెలిపారు. అలాగే తమ పాఠశాలకు చెందిన మొయిద పావని 40 కేజీల విభాగంలో స్నాచ్‌లో 47 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 55 కిలోలు మొత్తం 102 కిలోల బరువు ఎత్తి 4వ స్థానంలో నిలిచిందన్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శించి పతకాలు సాధించిన విద్యార్థినిలను, ఫిజికల్ డైరెక్టర్ పీ పుల్లారావును బుధవారం పాఠశాలలో ప్రత్యేకంగా అభినందించారు. సీనియర్ ఉపాధ్యాయులు వీ కాంతి జయకుమార్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఈడే శివశంకర రావు పాల్గొన్నారు.

ఏలూరు ఇందిరమ్మకాలనీ వద్ద అస్థిపంజరం