
బోధనా లోపం.. విద్యార్థులకు శాపం !
చాట్రాయి: మండలంలోని చిన్నంపేట జెడ్పీ హైస్కూల్ (హైస్కూల్ ప్లస్)లో మొత్తం 28 మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాయగా ఇటీవల విడుదల ఫలితాల్లో వారంతా ఫెయిల్ అయ్యారు. ఇందుకు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైస్కూల్ ప్లస్‌లో బైపీసీ, సీఈసీ గ్రూప్‌ల్లో 28 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ సిలబస్‌కు అనుగుణంగా బోధించేందుకు తగినంత మంది సిబ్బందిని నియమించకుండా.. విద్యార్థులను ఎందుకు చేర్పించుకున్నారని మండిపడ్డారు. హైస్కూల్ టీచర్లతో మొక్కుబడిగా తరగతులు నిర్వహించడం వల్లే తమ పిల్లలు ఉత్తీర్ణులు కాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు కాలేజీల్లో ఫీజులు కట్టలేక.. తమ పిల్లలను ప్రభుత్వ కాలేజీలో చేర్పిస్తే.. ఇవా ఫలితాలు అంటూ మండిపడ్డారు. ఓ విద్యార్థిని తల్లి సుజాత మాట్లాడుతూ.. 10వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైన తన కుమార్తె ఇప్పుడు ఫెయిల్ అయ్యిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బోధనా సిబ్బంది లేకుండా పిల్లల్ని ఎలా చేర్చుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధన సరిగ్గా లేకపోవడం వల్లే తాము ఫెయిల్ అయ్యామని రాజేశ్వరి అనే విద్యార్థిని వాపోయింది.
చిన్నంపేట హైస్కూల్ ప్లస్‌లో ఇంటర్‌లో జీరో శాతం ఉత్తీర్ణత
అధ్యాపకుల కొరత.. మొక్కుబడిగా తరగతులు