
యథేచ్ఛగా మట్టి దందా
ఆగిరిపల్లి: కూటమి నాయకుల అక్రమ మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. మండలంలోని నరసింగపాలెంలోని బ్రహ్మ లింగయ్య చెరువు వద్ద ఉన్న బండ్లమూరు కొండపై అనుమతి లేకుండానే మట్టి తవ్వకాలు చేపట్టి లక్షలు ఆర్జిస్తున్నారు. పది రోజుల నుంచి జేసీబీ సాయంతో కొండను తవుతున్నారు. అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. నరసింగపాలెంకు చెందిన టీడీపీ నాయకుడి ఆధ్వర్యంలో ఈ మట్టి దందా సాగుతుంది. అధికారులు, గ్రామస్తులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో శుక్రవారం మట్టిని లారీలలో తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. మైనింగ్, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మట్టి మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా సాగుతుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ ప్రసాద్‌ను సంప్రదించగా అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.