
చల్లచింతలపూడిలో గ్రావెల్ అక్రమ దందా
టాస్క్‌ఫోర్స్: దెందులూరు మండలంలోని చల్లచింతలపూడిలో అక్రమ గ్రావెల్ దందా మళ్లీ ప్రారంభమైంది. పొలం యజమాని గ్రావెల్ తవ్వకాలు అడ్డుకోవడంతో పాటు.. ఎస్‌ఐ, తహశీల్దార్, ఎస్పీ, కలెక్టర్, మైనింగ్ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. శుక్రవారం అక్రమ తవ్వకాలు చేస్తున్నారని తెలుసుకుని పొలం యజమాని జేసీబీలకు ఎదురుగా వాహనం పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కారుకు తాడు కట్టి జేసీబీతో మూడు కిలోమీటర్ల అవతలకు తీసుకువెళ్ళి వాహనాన్ని వదిలారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. స్థల యజమాని బాబురావు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని తన సొంత భూమిలో రక్షణ లేకపోతే ఎలాగని ప్రశ్నిస్తున్నాడు.