
గుడ్‌ఫ్రైడే వేడుకల్లో అపశ్రుతి
పేరుపాలెం బీచ్‌లో స్నానానికి దిగి ఒకరి మృతి
నరసాపురం రూరల్ : క్రైస్తవ సోదరులు ఎంతో పవిత్రంగా భావించి జరుపుకునే గుడ్‌ఫ్రైడే వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పేరుపాలెం బీచ్‌లో స్నానానికి దిగిన యువకుడు ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. 40 రోజుల ఉపవాస దీక్షలు పూర్తి చేసుకున్న ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన విశ్వాసులు పేరుపాలెం తీరంలోని వేళాంకణ్ణి మాత ఆలయం వద్ద మాల విరమణ చేసేందుకు శుక్రవారం రాత్రినుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇందులో శనివారం వేకువ జామున సముద్రస్నానానికి దిగిన ఇద్దరు యువకులు సముద్రపు అలలకు ఉక్కిరి బిక్కిరై ఒడ్డుకు ప్రాణాలతో కొట్టుకు వచ్చారు. వీరిలో నల్లజర్ల మండలం ప్రకాశపాలెంకు చెందిన సంకెళ్ల ఉదయ్‌కుమార్ (19) అనే యువకుడిని స్థానికులు, పోలీస్ సిబ్బంది మొగల్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉండటంతో నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం చేస్తుండగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉదయకుమార్ తండ్రి చిన్న తనంలోనే మృతి చెందగా తల్లి విజయలక్ష్మి బిడ్డను చూసుకుంటోంది. ఈ ఘటనపై మృతుడి అక్క విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొగల్తూరు 2వ ఎస్సై వై నాగలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇదే ప్రమాదంలో బయట పడిన మరో వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో కుటుంబ సభ్యులు భీమవరంలో చికిత్స చేయించి సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లినట్లు సమాచారం. అ వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.