
శ్రీవారి క్షేత్రంలో భక్తజన సందోహం
ద్వారకాతిరుమల: సెలవుదినం కావడంతో ద్వారకాతిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తుల తాకిడి మొదలైంది. దానికి తోడు ఆలయ అనివేటి మండపంలో, పరిసర ప్రాంతాల్లో వివాహాలు, ఒడుగులు, అన్నప్రాసన వేడుకలు పెద్ద ఎత్తున జరిగాయి. దాంతో క్షేత్ర పరిసరాలు కళకళలాడాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు దేవస్థానం సిబ్బంది మజ్జిగ అందజేశారు. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని శ్రీహరి కళాతోరణ వేదికపై వీరిశెట్టిగూడెంకు చెందిన జానపద వృత్తి కళాకారుల సంఘం వారు నిర్వహించిన భజనలు భక్తులను అలరించాయి. క్షేత్రంలో రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది.