
కొంపముంచిన నకిలీ మొక్కలు
దెందులూరు: నకిలీ మొక్కలు, విత్తనాలు తమ కొంప ముంచాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేస్తే తీరని నష్టం కలిగిందని లబోదిబోమంటున్నారు. దెందులూరు మండలం చల్ల చింతలపూడి గ్రామంలో ఖమ్మ బ్రహ్మాజీ తన ఐదెకరాల పొలంలో ఒక మొక్క రూ.211 చొప్పున 337 పామాయిల్ మొక్కలు రూ.71 వేలకు 2018లో ఓ ప్రైవేటు కంపెనీ నుంచి కొనుగోలు చేసి సాగు చేశాడు. మొత్తం 36 మొక్కలు బెరుకు మొక్కలు వచ్చాయని, దీంతో వేలాది రూపాయలు పెట్టుబడి వృథా అయ్యిందని, నకిలీ విత్తనాలు తన పాలిట శాపంగా మారాయని రైతు బ్రహ్మాజీ కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై రెండు రోజుల్లో హార్టికల్చర్ శాఖ, విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకోకుంటే తన పొలంలోనే దీక్షలు చేస్తానని హెచ్చరించారు. హార్టికల్చర్ ఆఫీసర్ కరణ్ స్పందిస్తూ పామాయిల్ సాగులో బెరుకు మొక్కలు వచ్చిన సంగతి వాస్తవమే అన్నారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేయడం జరుగుతుందన్నారు. మరోవైపు ఇదే గ్రామంలో పుచ్చ విత్తనాలు తనకు నష్టం మిగిల్చాయని రైతు బోప్పన శ్రీను కన్నీటి పర్యంతమయ్యాడు. తనకున్న రెండున్నర ఎకరాల్లో రూ.22 వేలతో పుచ్చ విత్తనాలు వేశానని, సాగు, డ్రిప్పు మల్చింగ్ నిమిత్తం రూ.55 వేలు పెట్టుబడి పెట్టానని, కానీ 40 శాతం మాత్రమే మొలకలు వచ్చాయని వాపోయాడు. నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసగిస్తున్న కంపెనీలపై వ్యవసాయ, విజిలెన్స్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
గగ్గోలు పెడుతున్న రైతన్నలు

కొంపముంచిన నకిలీ మొక్కలు