
అర్జీల పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలి
కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు(మెట్రో): ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) ద్వారా అందిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్‌లో జేసీ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఎస్‌ఈ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె.భాస్కర్, శ్రీనివాసరావు, ఏడీ సర్వే ఎండీ అన్సారీలతో కలిసి ఆమె అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను త్వరితగతిన పరిష్కరించి నాణ్యమైన ఎండార్స్‌మెంట్ అందజేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోపు సమస్యలను పరిష్కరించాలన్నారు.
అర్జీల్లో కొన్ని..
● జంగారెడ్డిగూడెం మండలం చిన్నవారిగూడేనికి చెందిన గెల్లానాగ తనకు తాడువాయి పంచాయతీలో ఉన్న 1.38 సెంట్లు భూమి ఆక్రమణకు గురైందని, సమస్య పరిష్కరించాలని కోరారు.
● దెందులూరుకు చెందిన బూరుగుపల్లి నాగేశ్వర రావు తాను నివసిస్తున్న ఇంటి కోసం కుమారుడు బెదిరిస్తున్నాడని రక్షణ కల్పించాలని కోరారు.
● ముసునూరు మండలం గోపవరానికి చెందిన కొయ్యూరి తిరుపతమ్మ గోపవరంలోని అసైన్డ్ భూమికి సర్వే చేయించాలని అర్జీ అందించారు.
● నిడమర్రుకు చెందిన బత్తుల చంద్రమౌళి తమకు చెందిన 34 సెంట్లు భూమి మరొకరి పేరుతో మ్యుటేషన్ చేశారని, న్యాయం చేయాలని వినతిపత్రం అందించారు.
● భీమడోలుకు చెందిన నందవరపు సత్యవతి పెన్షన్ పొందుతూ తన భర్త మరణించారని ఆ స్థానంలో తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.
● లింగపాలెం మండలం భోగోలుకు చెందిన నిమ్మగడ్డ శ్రీనివాసరావు తమ భూమిని ఆన్‌లైన్ లో ఎంట్రీ చేసేందుకు దరఖాస్తు చేశానని, చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.
● జంగారెడ్డిగూడేనికి చెందిన వీరవల్లి శంకరరావు శారీరక దివ్యాంగుడైన తనకు స్కూటీని మంజూరు చేయాలని కోరారు.