
26న జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్
ఏలూరు (టూటౌన్) : ఈనెల 26న ఏలూరు సీపీఐ జిల్లా కార్యాలయం, స్ఫూర్తి భవన్ నందు జిల్లా ఓపెన్ చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.కృష్ణ్ణమాచార్యులు, జిల్లా నాయకుడు పి కిషోర్ తెలిపారు. సీపీఐ జిల్లా కార్యాలయం నందు చెస్ టోర్నమెంట్ బ్రోచర్‌ను గురువారం వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీపీఐ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఏఐటీయూసీ క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని చెస్ క్రీడాకారులంతా ఈ పోటీల్లో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఏలూరు సహాయ కార్యదర్శి కూరెళ్ళ వరప్రసాద్, ఏఐటీయూసీ ఏలూరు ఏరియా కార్యదర్శి ఎస్ అప్పలరాజు, నాయకులు బి జగన్నాధరావు తదితరులు పాల్గొన్నారు.
మే 4 నుంచి శంకరమఠంలో వేద పరీక్షలు
తాడేపల్లిగూడెం (టీఓసీ): శ్రీ గోదావరీ మండల వేదశాస్త్ర ప్రవర్ధకసభా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లా వేద విద్యార్థులకు మే 4, 5, 6 తేదీల్లో తాడేపల్లిగూడెంలోని శంకరమఠంలో వేద పరీక్షలు నిర్వహించనున్నట్లు శంకరమఠం సభ్యులు వెల్లడించారు. సుమారు 450 మంది వేద విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలు వేద, శాస్త్ర, శ్రౌత, స్మార్త, ఆగమ, అపర్ణ విద్యలో జరుగుతాయన్నారు. విద్యార్థులందరికీ 3 రోజులు భోజన వసతులు పట్టణంలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మే 6 వ తేదీన శంకరమఠంలో పాలకొల్లు వలివేటి శ్రీ హరి శర్మ సన్మానం, వేద సభ జరగనున్నట్లు పేర్కొన్నారు.
చోరీ కేసులో ముద్దాయిలకు జైలు శిక్ష
నరసాపురం: పట్టణంలో జరిగిన ఓ దొంగతనం కేసులో నేరం రుజువు కాడడంతో ముద్దాయిలు కొత్తపల్లి రమేష్‌కు రెండేళ్లు సాధారణ జైలు, రూ 2వేలు జరిమానా, బీర రమేష్, గుబ్బల భాస్కర్‌కు ఏడాది సాధారణ జైలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ నరసాపురం జూనియర్ సివిల్ జడ్జి కె.శ్రీనివాస్ తీర్పు చెప్పారు. నరసాపురం టౌన్ సీఐ బి.యాదగిరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని జోస్యులవారి వీధి కొప్పర్తి వెంకటరత్నం ఇంట్లో జరిగిన దొంగతనం ఘటనలో ముద్దాయిలను 2023 జనవరి 16వ తేదీన అప్పటి ఎస్సై సుధాకరరెడ్డి కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో ముద్దాయిలకు కోర్టు జైలు శిక్ష విధించినట్టు సీఐ వివరించారు.