
చెల్లి మరణం తట్టుకోలేక అన్న ఆత్మహత్య
పెనుగొండ: తోడబుట్టిన చెల్లెలు మరణాన్ని తట్టుకోలేక అమ్మా నేనూ వచ్చేస్తున్నానంటూ అన్న ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన సిద్ధాంతం ప్రజలను కలచి వేసింది. సిద్ధాంతానికి చెందిన ఈదుపల్లి లక్ష్మీ నరసింహ(21) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసి మృత్యువుతో పోరాడి బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచాడు. వివరాల్లోకి వెళితే సిద్ధాంతంకు చెందిన ఈదుపల్లి నాగలక్ష్మీ అనారోగ్యంతో ఈ నెల 10న ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఏసీ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్న అన్న లక్ష్మీ నరసింహ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. చెల్లె మరణం జీర్ణించుకోలేక ఈ నెల 12న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తల్లిదండ్రులు వెంటనే గమనించి తణుకులోని ప్రైవేటు ఆసుపత్రికి వైద్యం నిమిత్తం తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచాడు. దీంతో తండ్రి ఈదుబిల్లి సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు పెనుగొండ ఎస్సై కొప్పిశెట్టి గంగాధరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 15 రోజుల వ్యవధిలోనే ఇద్దరు పిల్లలూ మృత్యువాత పడడంతో ఈదుబిల్లి సూర్యనారాయణ దంపతులు తల్లడిల్లిపోతున్నారు. పెనుగొండలో చదువుకుంటున్న కూతురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువక ముందే చేతికందివచ్చి, కుటుంబానికి అండగా నిలుస్తాడునుకున్న కొడుకూ మృతి చెందడంతో తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు.