
కరెంట్ షాక్‌తో పెయింటర్ మృతి
ఏలూరు టౌన్: కరెంట్ షాక్‌తో పెయింటర్ మృతి చెందాడు. దెందులూరు మండలం పోతునూరు కు చెందిన లింగాల పరుశురాం (31) పెయింటర్‌గా పనిచేస్తుంటాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం ఏలూరు సుబ్రహ్మణ్యం కాలనీలో ఒక భవనానికి మొదటి అంతస్తులో ఐరన్‌పైపునకు రోలర్ బిగించి గోడకు పెయింటింగ్ వేస్తున్నాడు. సమీపంలో 11కేవీ విద్యుత్ వైర్లు ఐరన్ పైపునకు తగిలి పరశురాం విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. ఏలూరు వన్‌టౌన్ ఎస్సై నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరశురాం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు.
గుర్రపుడెక్క తొలగిస్తూ...
ఏలూరు టౌన్: గుర్రపుడెక్క తొలగిస్తూ ప్రమాదవశాత్తూ కోనేరులో మునిగి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఏలూరు తూర్పువీధికి చెందిన తిర్లంగి జీవరత్నం (36) శనివారం మరో ముగ్గురితో కలిసి ఏలూరు శివారులోని రామయ్యకోనేరులో గుర్రపుడెక్క తొలగింపు పనికి వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తూ జీవరత్నం కోనేరులో ముగిని మృతిచెందాడు. అతడి మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. రూరల్ ఎస్సై సీహెచ్ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మూడు మట్టి లారీల సీజ్
జంగారెడ్డిగూడెం : కేతవరంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న మూడు లారీలను సీజ్‌చేశారు. కేతవరం చెరువు నుంచి రాత్రి సమయంలో అక్రమంగా మట్టిని తరలిస్తుండగా, వీఆర్‌వో ఫిర్యాదు మేరకు పోలీసులు లారీలను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తహసీల్దార్ కె.స్లీవజోజి చర్యలు తీసుకుంటారని స్టేషన్ రైటర్ సత్యనారాయణ తెలిపారు.
శ్రీవారి కొండపై షార్ట్‌కట్ మార్గం మూసివేత
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఉన్న షార్ట్‌కట్ మార్గాన్ని ఆలయ అధికారులు పూర్తిగా మూసివేశారు. స్వామివారి దర్శనానంతరం పలువురు భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సమీపంలోని మార్గం గుండా కొండపైన నిత్యాన్నదాన భవనం, శివాలయం వద్దకు కాలినడకన వెళుతున్నారు. ఆ ప్రాంతంలో జేసీబీతో పూడిక పనులు జరుగుతున్నాయి. దీనిపై సాక్షి దినపత్రికలో ఈనెల 25న ‘శ్రీవారి కొండపై షార్ట్‌కట్ మార్గం వద్దు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఆలయ అధికారులు ఆ మార్గాన్ని ఇనుప బారిగేట్‌తో పూర్తిగా మూసివేశారు.