రాధా పాండే
ఇప్పటి వరకు బాల్యవివాహాలను అడ్డుకున్న ఎంతో మంది సామాజిక కార్యకర్తలను చూశాం. ఇప్పుడు తన వివాహాన్ని తానే అడ్డుకున్న ఓ బాలికను చూస్తున్నాం. ఇటీవల జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ బాలిక తన పెళ్లిని తనే స్వయంగా ఆపి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్న ఆ బాలిక పేరు రాధాపాండే.
రాధను అభినందిస్తున్న జిల్లా డిప్యూటీ కమిషనర్ రమేశ్ ఘోలప్
కొడెర్మా జిల్లా మధుబన్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల రాధాపాండేకు.. ఆమె తల్లిదండ్రులు పక్క ఊరి వరుడితో వివాహం నిశ్చయించారు. ఈ పెళ్లి జూన్ 23 జరగాల్సింది. అయితే మే నెలలో ఆ విషయం తెలుసుకున్న రాధ ‘ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని, పెళ్లి ఆపేయమని తల్లిదండ్రులు, బంధువులను కోరింది’. కానీ పెద్దలు ఎవరూ తనకు సహకరించకపోగా పెళ్లికి సిద్ధపడు అని బెదిరించారు. తన తల్లిదండ్రులను ఒప్పించలేక, వరుడి తండ్రి దగ్గరకు వెళ్లి ‘తనకు చదువుకోవాలని ఉందని, ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని, పెళ్లిచేసుకుంటే తన కలలన్నీ చెదిరిపోతాయని’ చెప్పి... ఈ గండం నుంచి గట్టెక్కించమని వేడుకుంది. కానీ ఆయన మనసు కూడా రాధ వేడుకోలుకు కరగలేదు.
కేఎస్‌సీఎఫ్..
ఇదే సమయంలో మధుబన్ పంచాయితీలో బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ వివిధ కార్యక్రమాలతో యాక్టివ్‌గా ఉండే కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ (కేఎస్‌సీఎఫ్) గురించి రాధ తెలుసుకుంది. వెంటనే వాళ్లను కలిసి తన బాధ వెళ్లబోసుకుని, ఎలాగైనా ఈ పెళ్లిని ఆపించమని అభ్యరి్థంచింది. దీంతో కేఎస్‌సీఎఫ్ బృందం రాధ తల్లిదండ్రులను కలిసి వారు తలపెట్టిన బాల్యవివాహాన్ని ఆపాలని చెప్పారు. మొదట్లో రాధ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. పద్దెనిమిదేళ్లు రాకుండా పెళ్లి చేయడం చట్టరీత్యా నేరం అని చెప్పడంతో, పోలీసులకు భయపడి ఎట్టకేలకు ఒప్పుకున్నారు. వరుడి కుటుంబంతో చర్చించి పెళ్లి రద్దు చేశారు. అంతేగాక రాధకు మైనారిటీ తీరేంత వరకు పెళ్లి చేయబోమని కూడా మాట ఇచ్చారు. దీంతో రాధ పెళ్లి ఆగిపోయింది.
జిల్లాకు అంబాసిడర్...
రాధ పెళ్లి విషయం, ఆమెకు బాలల హక్కులు, బాల్యవివాహాలపై ఉన్న అవగాహనతో ధైర్యంగా ఎదుర్కొన్న తీరు తెలుసుకున్న జిల్లా డిప్యూటీ కమిషనర్ రమేశ్‌ఘోలప్ ఎంతో సంతోషించారు. ఆయన రాధను అభినందించి, ఆమెను జిల్లాలో బాల్యవివాహాలకు వ్యతిరేకంగా పోరాడే అంబాసిడర్‌గా నియమించారు. ‘ముఖ్యమంత్రి సుకన్య’ ప్రభుత్వ పథకం కింద నెలకు రెండు వేల రూపాయలను కూడా జారీ చేయించారు. అంతేగాక రాధ కుటుంబానికి రేషన్ కార్డు, ఉచిత వైద్య సదుపాయం, పెన్షన్ వంటి సదుపాయాలను కలి్పంచారు. ప్రభుత్వ ప్రోత్సాహం, కేఎస్‌సీఎఫ్ ఆధ్వర్యంలో రాధ ఇప్పుడు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ తనలాంటి ఎంతో మంది అమ్మాయిలను కాపాడుతోంది. బాగా చదువుకుని భవిష్యత్‌లో మంచి టీచర్‌ను అవుతానని రాధ చెప్పడం విశేషం. ప్రతి బాలికలోనూ రాధలాంటి తెగువ, అవగాహన ఉంటే బాల్యవివాహాలు కనుమరుగు కావడానికి ఎక్కువ సమయం పట్టదు.
చదవండి: "Kidnap And Wed": ఆ దీవిలో జరిగేవన్నీ దాదాపుగా రాక్షస వివాహాలే!
Comments
Please login to add a commentAdd a comment