సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సామాన్యులు సైతం కోటీశ్వరులు కావచ్చని నిరూపించి చూపిస్తున్నాడు పదహారేళ్ల యువకుడు దిగ్విజయ్ సింగ్. అతడు సమయాన్ని చాక్లెట్‌గా మార్చుకున్నాడు! కరోనా కారణంగా ఇళ్లలోనే జైల్లోలా కష్టంగా గడిపిన రోజులవి. పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా హఠాత్తుగా దొరికిన బోలెడంత సమయాన్ని ఏం చేయాలో అర్థంకాని అయోమయ పరిస్థితులు. ఉదయపూర్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన దిగ్విజయ్ సింగ్ కూడా ఏమి తోచుబాటుగాని ఆ సమయంలో.. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నాడు.
అనుకున్న వెంటనే యూట్యూబ్‌లో చాక్లెట్స్ తయారీ గురించి చూశాడు. చాక్లెట్స్ తయారీ సులభంగా ఉండడంతో ఇంట్లో తయారు చేశాడు. దిగ్విజయ్ చేసిన చాక్లెట్‌లు రుచిగా ఉన్నాయని కుటుంబ సభ్యులు, స్నేహితులు చెప్పడంతో మరిన్ని చాక్లెట్స్ తయారు చేసి అమ్మాలనుకున్నాడు. ఇదే విషయాన్ని తన స్నేహితుడు మహవీర్ సింగ్‌కు చెప్పడం, అతనికి ఆసక్తి ఉండడంతో ఇద్దరూ కలిసి చాక్లెట్‌లు తయారు చేద్దామని నిర్ణయించుకున్నారు.
గిఫ్ట్‌బాక్స్‌ను చూసి...
పదహారేళ్ల తన స్నేహితుడితో కలిసి యూట్యూబ్ సాయంతో చాక్లెట్స్, వివిధ రకాల డిజర్ట్‌లు తయారు చేసి స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంచేవాళ్లు. దీపావళికి దిగ్విజయ్ తండ్రి కారు కొన్నాడు. కారు షోరూం వాళ్లు కారుతోపాటు చాక్లెట్ బాక్స్‌ను గిప్ట్‌గా ఇచ్చారు. షోరూంలో కారు కొనే కస్టమర్లందరికీ చాక్లెట్ బాక్స్‌లు గిప్ట్‌గా ఇస్తున్నారని దిగ్విజయ్‌కి తెలిసింది. వెంటనే హోటల్, కార్‌షోరూం యజమానులను కలిసి కాంప్లిమెంటరీగా ఇచ్చేందుకు తాను ఇంట్లో తయారు చేసిన చాక్లెట్స్ ఇస్తానని చెప్పాడు. అందుకు వారు ఒప్పుకోవడంతో చాక్లెట్స్ తయారీ మొదలుపెట్టాడు.
రెండేళ్లలో రెండుకోట్లు
ఒక కార్ షోరూం వాళ్లు వెయ్యి చాక్లెట్స్ కావాలని 2021లో తొలి ఆర్డర్ ఇచ్చారు. అప్పుడే ‘సరామ్’అనే పేరుతో చాక్లెట్ విక్రయాలు ప్రారంభించాడు. చాక్లెట్స్ రుచిగా ఉండడంతో .. విక్రయాలు క్రమంగా పెరిగి ఏడాదిలోనే మంచి ఆదాయం వచ్చింది. దేశవ్యాప్తంగా రెండు టన్నులకు పైగా చాక్లెట్ విక్రయాలు జరిగాయి. దీంతో రెండేళ్లలోనే ‘సరామ్’ రెండు కోట్లను ఆర్జించింది.
సరికొత్తగా...
సాదా సీదాగా కాకుండా దేశంలో దొరికే రకరకాల పండ్లు, మసాలాలను ఉపయోగించి చాక్లెట్స్‌ను సరికొత్తగా తయారు చేసి విక్రయిస్తున్నాడు దిగ్విజయ్. కేరళ, తమిళనాడునుంచి కోకోపొడి, చాక్లెట్స్‌లో వాడే పండ్లను బాగా పండే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని నాణ్యమైన రుచికరమైన చాక్లెట్స్‌ను తయారు చేస్తున్నాడు. ఢిల్లీ, బెంగళూరు, ఉదయ్‌పూర్, జైపూర్‌లలో సరామ్ కస్టమర్లు చాలామంది ఉన్నారు. ఉదయ్‌పూర్, జైపూర్‌లలో స్టోర్‌లు, ఆఫ్‌లైనేగాక, ఆన్‌లైన్‌లో చాక్లెట్ విక్రయాలు జరుగుతున్నాయి. సమయాన్ని సక్రమంగా వినియోగిస్తే కోట్లు సంపాదించవచ్చుననడానికి దిగ్విజయ్ ఉదాహరణగా నిలుస్తున్నాడు.
(చదవండి: కొంబుచా హెల్త్ డ్రింక్! దీని ప్రయోజనాలకు ఫిదా అవ్వాల్సిందే )
Comments
Please login to add a commentAdd a comment